=రూ.59 కోట్లతో ఈపీడీసీఎల్ ప్రతిపాదనలు
=ఏజెన్సీలో మరిన్ని గ్రామాల్లో ఏర్పాటు
=వ్యక్తిగత వినియోగదారులకూ 50 శాతం రాయితీ
సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలో విద్యుత్ వెలుగులకు నోచుకోని మారుమూల పల్లెలు వందల్లో ఉన్నాయి. ఆయా తండాల్లో ఎలాంటి విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు వీల్లేని పరిస్థితి. రవాణా వ్యవస్థ కూడా మృగ్యం. ఇరుకుబాటలు, చెట్ల కొమ్మలతో ఆకాశం కనిపించని దుస్థితి. సాయంత్రం 5 గంటలకే చీకట్లు కమ్ముకుంటాయి. రాత్రి 7 గంటలకు తండాలన్నీ గాఢ నిద్రలో జోగుతుంటాయి. విష సర్పాలు, అడవి జంతువుల భయం ఎలానూ ఉంటుంది.
ఇలాంటి వారికి విద్యుత్ వెలుగులందించాలన్న లక్ష్యంతో తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ప్రయత్నిస్తోంది. తరిగిపోని ఇంధన వనరైన సౌర శక్తిద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, గిరిపల్లెల్లో వెలుగులు నింపే చర్యల్ని ముమ్మరం చేస్తోంది. తొలిసారిగా అప్పటి సీఎండీ నదీంఅహ్మద్ హయాంలో గిరిపల్లెల్లో సౌర విద్యుత్ వ్యవస్థను కేంద్రప్రభుత్వం సాయంతో ఏర్పాటు చేశారు. కేంద్రం 90 శాతం వ్యయాన్ని, మిగిలిన 10 శాతాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ యోజన పథకంలో భాగంగా ఈపీడీసీఎల్ భరించేలా ప్రతిపాదించారు.
తొలి విడతతో రూ.16.9 కోట్లతో 2,225 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొయ్యూరు, జి.మాడుగుల, చింతపల్లి, అనంతగిరి, అరకు, పాడేరు, ముంచింగిపుట్టు, హుకుంపేట, జీకే వీధి మండలాల్లోని పలు పల్లెల్లో ఇప్పటికే రూ.45 కోట్లతో చేపట్టిన సౌర విద్యుత్ వ్యవస్థ నడుస్తోంది. ఒక్కో పల్లెలో 2 కేవీ నుంచి 12 కేవీ సామర్థ్యంతో ప్యానెళ్లు ఏర్పాటు చేశారు.
తండాల్లోని ప్రతి ఇంటికీ ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు 100 వాట్ల మేరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు సీఎఫ్‌ఎన్ బల్బులతో విద్యుత్ వెలుగులందిస్తున్నారు. మరో రూ.59 కోట్ల వ్యయంతో కొత్తగా మరిన్ని గ్రామాల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.
వ్యక్తిగత వినియోగదారులకూ రాయితీ
సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా 3ఫేజ్ సర్వీసు వినియోగదారులతోపాటు సింగిల్ ఫేజ్(వ్యక్తిగత) వినియోగదారులకూ 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు సీఎండీ తెలిపారు. నెట్ మీటరింగ్ విధానంలో 3 కిలోవాట్ సామర్థ్యమున్న సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటుతో మిగులు విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించే అవకాశాన్నీ కల్పిస్తున్నామన్నారు. వచ్చే మార్చి నెలాఖరులోగా ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకే ఇది వర్తిస్తుందని సీఎండీ తెలిపారు. డీ సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరేషన్(డీసీడీజీ) విధానంలో ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా సౌర విద్యుత్ వెలుగులకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10 చ.మీ./100 చ.అ.ల విస్తీర్ణంలో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. నాబార్డ్‌లో భాగంగా కొన్ని జాతీయ బ్యాంకులు కూడా వినియోగదారుల వాటా 50 శాతానికి రుణ సదుపాయానికి ముందుకు వస్తున్నట్టు పేర్కొంటున్నారు.
తండాల్లో సౌర వెలుగులు!
Published Mon, Nov 18 2013 4:32 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement