రాకలే...పోకల్లేవు | Entry requirements for tax | Sakshi
Sakshi News home page

రాకలే...పోకల్లేవు

Published Wed, Apr 1 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

రాకలే...పోకల్లేవు

రాకలే...పోకల్లేవు

మూడు నెలల పన్ను చెల్లిస్తేనే   తెలంగాణలోకి ప్రవేశం
భారమేనంటున్న {sావెల్స్ యజమానులు
కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్న వైనం

తెలంగాణ ఎంట్రీ ట్యాక్స్‌తో ఆగిపోయిన 350 ప్రయివేట్ బస్సులు
 
విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎంట్రీ ట్యాక్స్ విధానం మంగళవారం జిల్లాలో తీవ్ర గందరగోళం సృష్టించింది. తెలంగాణ నుంచి వచ్చే ప్రయివేటు వాహనాలే తప్ప.. మన రాష్ర్టం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాల ఎంట్రీ ట్యాక్స్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచి చెల్లించాల్సి ఉండటంతో మన జిల్లాలో ఎక్కడిక్కడే ప్రయివేట్ వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రయివేట్ ట్రావెల్స్‌కు చెందిన వందలాది బస్సు లు, సరుకులు, ఇతర నిత్యావసరాలను రవాణా చేసే కమర్షియల్ లారీలు ఆగిపోయాయి. దీంతో పాటు లైట్ వెహికల్ మొదలుకుని హెవీ వెహికల్స్ వరకు అన్నింటికీ ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తామని బోర్డర్ టోల్‌గేట్ వద్ద అక్కడి రవాణా శాఖ అధికారులు స్పష్టం చేయటంతో జిల్లా రవాణా వ్యవస్థలో తీవ్ర గందరగోళం నెలకొంది.
 
ఎంట్రీ ట్యాక్స్ తప్పనిసరే..

జిల్లా నుంచి నిత్యం సుమారు నాలుగు వేలకుపైగా లారీలు, 650కు పైగా ప్రయివేట్ బస్సులు, సుమారు 50 టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాలు తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో విజయవాడ నగరం నుంచి రోజుకు 350 వరకు ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. అలాగే, జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఇతర ప్రాంతాల నుంచి మరో 50 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వివిధ వాణిజ్య ఉత్పత్తులతో నిత్యం నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి రవాణా శాఖ ట్యాక్స్‌లను మార్పులు చేస్తున్నట్లు ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది. మనజిల్లా సరిహద్దులోని గరికపాడు, తిరువూరు సమీపంలోని గంపలగూడెంలో తెలంగాణ రాష్ట్ర రవాణా పన్నుల కేంద్రాలను ఏర్పాటుచేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వెళ్లే ప్రతి వాహనం ఇకపై బోర్డర్‌లో ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇక ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులు, లారీల పర్మిట్ల విషయంలో ఎక్కువ చార్జీలు ఉండటంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అయితే, తెలంగాణ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు ప్రస్తుతం ఎలాంటి ట్యాక్స్‌లు విధించటం లేదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చాక నిర్ణయం తీసుకుని ట్యాక్స్ విషయంపై ప్రకటన చేయనున్నారు. అప్పటివరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. జిల్లా నుంచి సిమెంట్, బియ్యం, ఇతర నిత్యావసరాలు, వివిధ లోడ్లతో వెళ్లే లారీలకు ట్యాక్స్ పెంపు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ ప్రభావంతో ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 
ప్రయివేట్ ట్రావెల్స్ బంద్

మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత హైదరాబాద్ వెళ్లాలంటే ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులు మూడు నెలల ట్యాక్స్‌ను, బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద ఎంట్రీ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రయివేటు ఆపరేటర్లు రవాణా శాఖ మంత్రి, కార్యదర్శికి విన్నవించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో ప్రయివేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు ఎంట్రీ ట్యాక్స్‌పై ఎలాంటి  స్పష్టత రాకపోవటంతో మంగళవారం నుంచి తెలంగాణకు నడిపే బస్సుల్ని నిలిపివేస్తున్నారు. ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ మినహా మిగిలిన అన్ని ప్రయివేట్ ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సుల్ని నిలిపివేశారు.

టూరిస్ట్ బస్సులకూ తప్పని ట్యాక్స్ భారం

 జిల్లాలో టూరిస్ట్ బస్సులు 200 వరకు ఉన్నాయి. వీటిలో విజయవాడలో 150 ఉన్నాయి. ఈ బస్సులు తెలంగాణ రాష్ట్రంలోకి ఒకరోజు వెళ్లాలన్నా వారం రోజుల ట్యాక్స్ చెల్లించాల్సిందే. గతంలో కోదాడకు పంపే బస్సుకు రానుపోనూ కలిపి రూ.12వేలు తీసుకునేవారు. ఇప్పుడు ఒక్కరోజు పర్మిట్‌కే రూ.14వేలు చెల్లించటం అంటే ఎలా సాధ్యమవుతుందని, బస్సులు మాట్లాడుకునే వారు అంత మొత్తం ఎలా చెల్లిస్తారని టూరిస్ట్ బస్సు ఆపరేటర్ రవీంద్ర ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులంతా హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
 
రూ.7,200 ట్యాక్స్ అంటే కష్టం

23 జిల్లాలు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు ఒక్కో బస్సుకు రూ.3,200 ట్యాక్స్ చెల్లించేవాళ్లం. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 13 జిల్లాలతో ఒక రాష్ట్రం, 10 జిల్లాలతో ఇంకో రాష్ట్రం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు కలిసి ట్యాక్స్‌పై ఒక నిర్ణయం తీసుకుని రూ.3,200 ట్యాక్స్‌ను పంచుకుంటే బాగుంటుంది. అలాకాకుండా డబుల్ ట్యాక్స్‌లా రూ.7,200 అంటే చాలా కష్టం. అసలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని విభజన సమయంలో కేంద్రం ప్రకటించినప్పుడు ట్యాక్స్ వేయటం సరికాదు.
 - శ్రీనివాస్, మార్నింగ్ స్టార్ట్ ట్రావెల్స్ యజయాని
 
రవాణా చార్జీలు పెరుగుతాయి..

ట్యాక్స్‌ల వల్ల రవాణా రంగం తీవ్రంగా నష్టపోతుంది. ముఖ్యంగా నిత్యం జిల్లా నుంచి దాదాపు వెయ్యికిపైగా లారీలు తెలంగాణకు వెళ్తున్నాయి. రెండు ట్యాక్స్‌లు కట్టాలంటే భారం పెరుగుతుంది. దీనిపై మేము ప్రభుత్వానికి విన్నవించటానికి హైదరాబాద్‌లో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రవాణా రంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
 - కేవీ రమేష్,
 లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement