
రోడ్డెక్కని బస్సులు
- డిపోల్లో నిలిచిపోయిన 728 బస్సులు
- రూ.70లక్షల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ బంద్ నిర్వహించిన నేపథ్యం లో జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. నల్లగొండ రీజియన్‌లో 728 బస్సులు ఆయా డిపోల్లోనే నిలిచి పోయాయి. జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల పరిధిలో బస్సులు నిత్యం 2.85 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి.
బంద్ వల్ల బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ఆర్టీసీ దాదా పు రూ. 70లక్షల రోజువారీ ఆదాయం కోల్పోయింది. బంద్‌కు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించడంతో డిపోల నుంచి బస్సులను బయటికి తీయాలనే ప్రయత్నం కూడా జరగలేదు. బంద్ నిర్వాహకులు తెల్లవారుజామునే డిపోలకు చేరుకుని ప్రధాన గేట్ల ఎదుట ఆందోళనకు దిగారు. రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్‌ల కార్యాలయాల సిబ్బంది, ఆర్టీసీ ఇతర కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్లన్నీ వెలవెలబోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో అన్ని రూట్లలో రాకపోకలకు ఆటంకమేర్పడింది.