నష్టాల బాటలో ఆర్టీసీ
అక్టోబర్‌లో నష్టం రూ.111 కోట్లు
గత ఏడు నెలల్లో రూ. 687 కోట్లు...
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక శ్రద్ధతో నిత్యం పర్యవేక్షిస్తేతప్ప నష్టాల నియంత్రణ సాధ్యం కానీ ఆర్టీసీలో ఇప్పుడు అయోమయం రాజ్యమేలుతుండటంతో సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దారితప్పుతోంది. రాష్ట్రం విడిపోయినా ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతుండటం.. అధికారులు రెండు ప్రాంతాలుగా విడిపోయి ఎడమొహం పెడమొహంగా ఉండటం.. ఓ ప్రాంతానికి చెందిన అధికారులు మరో ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించని పరిస్థితి నెలకొనడంతో పాలన పూర్తిగా పడకేసింది.
దీంతో పర్యవేక్షణ దాదాపు శూన్యంగా మారటంతో సంస్థ నష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అక్టోబర్ నెల లాభనష్టాల వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ఒక్క నెలకు సంబంధించే ఆర్టీసీకి రూ.111.13 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. ఇందులో తెలంగాణ వాటా రూ.41.45 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటాలో రూ.69.68 కోట్లున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలలకు సంస్థ నష్టాలు రూ.687 కోట్లకు పైగా చేరుకున్నాయని తెలుస్తోంది.
తెలంగాణలోనూ పెరిగిన నష్టాలు
గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని జోన్లతో పోలిస్తే తెలంగాణలో నష్టాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రెంటి నష్టాలు దాదాపు ఒకేరకంగా నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ జోన్‌లో నష్టాలు పెద్దగా ఉండవు. అయితే అక్టోబర్ నెలకు సంబంధించి ఇక్కడా మిగతా జోన్ల మాదిరిగానే నమోదయ్యాయి. అయితే జూన్ నెలలో సిటీ జోన్ రూ.7 కోట్ల మేర లాభాలు సాధించటం విశేషం. ఏపీ యథాప్రకారం నష్టాల్లో ముందుంది. ఏపీలోని విజయవాడ, విజ యనగరం, కడప, నెల్లూరు జోన్లు తెలంగాణలోని జోన్ల కంటే ఎక్కువ నష్టాలు మూటగట్టుకున్నాయి. గత ఏడాది కాలంగా నష్టాలు పెరిగినప్పటికీ.. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు. విభజన హడావుడిలో మునిగిన రెండు ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు.
స్టేజి క్యారియర్లుగా మారిన ప్రైవేటు వాహనాలను నియంత్రించనున్నట్టు ప్రకటించినా తెలంగాణ ప్రభుత్వం దాన్ని పకడ్బందీగా నిర్వహించలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణ అంతంతమాత్రం గానే ఉండటంతో నష్టాలు పెరిగిపోతున్నాయి. కనీసం ఈ విషయంపై అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిం చటం లేదు. ఏ ప్రభుత్వానికి బాధ్యత వహించాలో స్పష్టత లేకపోవటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.