రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం
Published Tue, Nov 26 2013 1:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. మెట్రోరైలు, బస్సులకు కలిపి ఒకే స్మార్ట్ కార్డును ప్రవేశపెడతామన్నారు. సోమవారం పండిత్ పంత్ మార్గ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ నగరాన్ని గ్రీన్ క్యాపిటల్‌గా చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో ప్రైవేటు వాహనాల సంఖ్యను అదు పు చేయవచ్చన్నారు. ‘మేం హామీ ఇస్తున్నాం.
చౌకైన, అత్యంత సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రజలు తమ కార్లు, స్కూటర్లు వాడడం పక్కనపెట్టేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తామ’న్నారు. ఢిల్లీ మెట్రోరైలు వ్యవస్థను సైతం బీజేపీ ప్రభుత్వ హయాం లోనే ఢిల్లీలో ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఢిల్లీపరిసర ప్రాంతాలకు మెట్రోరైలు వ్యవస్థను మరింత విస్తరిస్తామన్నారు. ఫీడర్ బస్సుల సంఖ్య పెంచడం తోపాటు ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలు ప్రతి మెట్రోస్టేషన్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. కాలం చెల్లిన వాహనాల లెసైన్స్‌లు వెంటనే రద్దు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వ వాహనాలు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement