న్యూఢిల్లీ: డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట శాఖ నూతన అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి పదవీబాధ్యతలనైనా అవలీలగా నిర్వర్తించగలడనే అపార నమ్మకంతోనే బీజేపీ అధిష్టానం ఆయనను కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకుంది. మరికొద్ది నెలల్లోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. విజయ్‌గోయల్ తర్వాత గత ఏడాది ఆయనను బీజేపీ అధిష్టానం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించిన సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావించింది. అయితే ఈసారి యువకుడికి ఈ బాధ్యతలను అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని తెలియవచ్చింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీ కమల దళానికి బలమైన నాయకుడిని అధిపతిగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసిన తరువాత ఈ దిశగా చర్చలు జరిగే అవకాశముంది. నూతన అధ్యక్షుడు వీలైనంత త్వరగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక అనేది వ్యవస్థాగతమైన మార్పులకు కూడా దారితీస్తుందని వారంతా ఆశిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువస్థానాలను గెలుచుకునేందుకు వీలుంటుందనేది వారి భావనగా కనిపిస్తోంది. కాగా ఈ పదవి కోసం అనేకమంది పోటీ పడే అవకాశముంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైతం హర్షవర్ధన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మేమంతా కలసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అంతకంటే ముందు వర్క్ ఆడిట్ కూడా చేయాల్సి ఉంది. వర్క్ ఆడిట్ ద్వారా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని గుర్తించి మంచి పదవులను కేటాయించాల్సి ఉంది. అవసరమైన సమయంలో కొన్ని వ్యవస్థాగతమైన మార్పులు కూడా చేపడతాం’ అని ఆయన చెప్పారు.
ఇదిలాఉంచితే త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు అప్పగించే అవకాశముందని వారంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యరీతిలో ఫలితాలు వచ్చిన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతోందని బీజేపీ భావిస్తోంది. స్పష్టమైన మెజారిటీ రావొచ్చని ఆశిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. గత ఎన్నికల్లో ఏయే ప్రాంతాల్లో తమ పార్టీకి ఎక్కువ ఓట్లు రాలేదో అక్కడ సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందువల్ల ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపడం అత్యంత సులువవుతుందన్నారు. ఈ అంశాన్నే తాము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు.
కేబినెట్‌లోకి హర్షవర్ధన్ కొత్త సారథి ఎవరో?
Published Wed, May 28 2014 10:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement