ఆప్ ది అవకాశవాదమే
Published Thu, Jan 9 2014 10:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ అనుసరిస్తున్న ప్రజా, జాతీయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం రాజ్‌ఘాట్‌లో ధర్నా చేయనున్నట్లు బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో గోయల్‌తోపాటు మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా పాల్గొన్నారు. కాశ్మీర్ సమస్యపై అనుచిత వ్యాఖ్యలు, బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం, ప్రస్తుతం అవినీతి పరులైన కాంగ్రెస్ నాయకులను వెనకేసుకురావడం ఆమ్‌ఆద్మీపార్టీ అవకాశవాదానికి తార్కాణమన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మాజీ మంత్రుల అవినీతిపై కాగ్ నివేదికలు, లోకాయుక్త వంటి ఎన్నో సంస్థలు ఆధారాలు చూపినా ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని వారు ప్రశ్నించారు.
ఆమ్‌ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకే షీలాదీక్షిత్‌పై దర్యాప్తును ఆయన అటకెక్కించారని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌లోని పెద్ద చేపలను పట్టుకునేందుకు కేజ్రీవాల్ జంకుతున్నాడు. అతడికి చిత్తశుద్ధి ఉంటే ముందు అలాంటివారి అవినీతిపై స్పందించాలి. ఎవరో ఒకరు ఆధారాలు ఇచ్చేవరకు ఆగాల్సిన పనేం ఉంది. ఆప్ సర్కార్ ఏర్పడి పది రోజులవుతోంది. అయినా చర్యల్లోకి ఎందుకు వె ళ్లడం లేదు’అంటూ గోయల్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలను అదుపు చేయడం, సీఎన్‌జీ రేట్లు తగ్గించడం వంటి అనేక వాగ్దానాలు నెరవేర్చడంలో ఆప్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఆప్ సర్కార్‌లోని మంత్రులు సైతం ఎంతో గర్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వీఐపీ సంస్కృతిని పోగొడతామని గొప్పలు చెప్పిన ఆప్ మంత్రులు ఒక్కొక్కటిగా ప్రభుత్వ సదుపాయాలు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement