ఆప్ ప్రజలను మోసం చేసింది: బీజేపీ
Published Tue, Dec 24 2013 1:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: అవినీతి పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆప్ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. అవినీతిని అంతమొందిస్తామంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పార్టీ ఇప్పుడు తన మౌలిక సిద్ధాంతాలతోనే రాజీపడుతోందని విమర్శించింది. ప్రజల విశ్వాసాన్నీ వమ్ము చేసిందని మండిపడింది. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌తో ఆప్ జట్టుకట్టడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను వంచించారని ఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకుడు హర్షవర్ధన్ మీడియాతో సోమవారం అన్నారు. అయినా కొత్త ప్రభుత్వానికి తమ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆప్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. అయితే కాంగ్రెస్ మద్దతు ఇస్తానని చెప్పినా ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు సంశయించడాన్ని బీజేపీ ఇది వరకే విమర్శించింది. ఈ ఎన్నికల్లో 31 సీట్లు సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం తెలిసిందే.
Advertisement
Advertisement