మళ్లీ పోరుకే సై
మళ్లీ పోరుకే సై
Published Wed, Dec 11 2013 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మళ్లీ ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఒక అకాలీదళ్ సభ్యుడు, 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సుముఖత చూపడం లేదు. ఇక్కడ సర్కార్‌ని ఏర్పాటుచేయాలంటే 36 మేజిక్ ఫిగర్ ఉండాలి. అయితే బీజేపీ 31, దాని మిత్రపక్షమైన అకాలీదళ్ పార్టీ సభ్యుడితో కలిసి మొత్తం 32 స్థానాలున్నాయి. అయినా అధికార పీఠమెక్కాలంటే మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక్కడే చిక్కుముడి వచ్చి పడింది.
ఢిల్లీవాసులు తమ మీద నమ్మకం ఉంచి నిజాయితీతో కూడిన పాలన అందిస్తారని అధిక సంఖ్యలో స్థానాలు ఇచ్చారని, అలాంటి వారి ముందు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకు తెరలేపి అభాసుపాలవటం కన్నా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 28 స్థానాలతో రెండోస్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోమని, ఎవరికీ మద్దతును కూడా ఇవ్వమని ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ఎన్నికల సంగ్రామంలోకి దిగడమే మేలని యోచిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఇవే మాటలు వినబడుతున్నాయి.
అసెంబ్లీ పక్ష నేతగా హర్షవర్ధన్
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అసెంబ్లీ పక్ష నేతగా డాక్టర్ హర్షవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల అనంతరం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. 31 మంది బీజేపీ, ఒక అకాలీదళ్ శాసనసభ్యుడు మద్దతు పలికారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
ఈ సందర్భంగా హర్షవర్ధన్ విలేకరులతో మాట్లాడారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యా బలం లేకపోవడం వల్ల తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. అవసరమైతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించినా మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఈ అనిశ్చితి నెలకొందన్నారు. అయితే అధికారం కోసం అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆత్రుతపడడం లేదన్నారు. అసలు ఆ దిశగా ప్రయత్నమే చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసినా చేయకపోయినా, ప్రజలకు సేవచేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.
కాగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. మెజారిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుచేయకూడదని నిర్ణయించామన్నారు. దొడ్డిదారిన వెళ్లి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తాము ప్రయత్నించడం లేదన్నారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సంతోషిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతూ కోరడం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో కూర్చోవడానికి, లేకపోతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. మళ్లీ ఎన్నికలు జరిగితే తమ పార్టీ పూర్తి మెజారిటీతో మరోమారు అధిక స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కాగా, అంశాల ప్రాతిపదికన బీజేపీకి మద్ధతిస్తామన్న ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమైనవా? వారి పార్టీ అభిప్రాయమా? అన్న దానిపై స్పష్టత లేదన్నారు. అలాంటి ప్రతిపాదనలపై తామెలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.ఏఏపీ నేతలు తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చుకోకుండా చూసుకోవల్సిన అవసరముందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కోలీపై లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ సంగతి వారు చూసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కారీ, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు కూడా సోమవారం అరవింద్ కేజ్రీవాల్‌ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement