న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి చేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ పేర్కొన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీతో చర్చించే తొలి డిమాండ్ ఇదేనని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. ‘ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల అధికారులు ఎదుర్కొంటున్న బహుళ సమస్యలను అధిగమించే అవకాశముంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పాలన సజావుగా సాగేందుకు వీలవుతుంది. వివిధ సంస్థల మధ్య సమన్వయం సాధించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ అధికారాలు రావడం వల్ల నగరాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయ’ని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తోందని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని హర్షవర్ధన్ వివరించారు. ‘ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీనిచ్చింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో సుమారు లక్షకు పైగా నుంచి 2.6 లక్షల ఆధిక్యంతో బీజేపీ సభ్యులు గెలిచారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు రుణం తీర్చుకుంటామ’ని ధీమాను వ్యక్తం చేశారు.
ఎన్‌డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదాకు సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సూచించిన రిజర్వేషన్లను అనుసరించే పార్లమెంటరీ కమిటీ ముందుకు ఆ బిల్లును తీసుకెళ్లాం. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏకు అధికారం దక్కలేదు. అయితే అధికార పగ్గాలు చేపట్టిన యూపీఏ ప్రభుత్వం ఆ బిల్లును అసలు పట్టించుకోలేదని హర్షవర్ధన్ ఆరోపించారు. అయితే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దృష్టికి ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీసుకెళతామన్నారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021కు సంబంధించి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లకు సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ఢిల్లీలో తాగునీరే ప్రధాన సమస్యగా మారిందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం నగరానికి 1,100 ఎంజీడీ(రోజుకు మిలియన్ గ్యాలన్ల) నీరు అవసరముండగా, ఢిల్లీ జల్ బోర్డు కేవలం 800 ఎంజీడీల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. 2017లో 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేవరకు 1,400 ఎంజీడీల వరకు నీటి డిమాండ్ పెరగొచ్చు.
ఈ తాగునీరు గురించి ఢిల్లీ ఎక్కువగా పొరుగురాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌లపై ఆధారపడుతోందని హర్షవర్ధన్ చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థల్లోనూ సంస్కరణలు తీసుకురావాలని, మూడు మున్సిపల్ కార్పొరేషన్‌ల రోజువారీ విధులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రతిపక్షం బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన 2012లో షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు విభాగాలుగా విభజించిందన్నారు. పట్టణ అభివృద్ధి సమస్యలపైనే దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపారు. మోడీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నానని హర్షవర్ధన్ చెప్పారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 33.07 ఉంటే, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 46.1 శాతానికి చేరుకుంద’న్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తప్పుకోవడంతో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి ఫిబ్రవరి 17 నుంచి కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.
సంపూర్ణ రాష్ట్ర హోదా
Published Sun, May 25 2014 10:03 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement