న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా, మరోవైపు ఢిల్లీ విధానసభకు తాజా ఎన్నికలపై బీజేపీ రాష్ర్ట శాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరిలో విధానసభ ఎన్నికలు జరిగే అవకాశముంది. మొన్నటికి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం, ఆ తర్వాత మహారాష్ర్ట, హర్యానా శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ నాయకులకు ఎనలేని ధీమానిచ్చాయి. ఒకవేళ ఢిల్లీ విధానసభకు ఎన్నికలు జరిగితే తగినంత మెజారిటీ దక్కుతుందనే ధీమాతో తమ పార్టీ అధిష్టానం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటూ రాష్ర్ట శాఖ నాయకులకు అధిష్టానం పెద్దలు సూచించారు. ‘పెట్రోల్ ధరలను ఇటీవల తగ్గించడం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశమైన పాకిస్థాన్ విషయంలో వ్యవహరించిన తీరు దేశవాసులపై ఎనలేని ప్రభావం చూపాయి. ఓట్ల కోసం మేము ప్రజల్లోకి వెళ్లినపుడు ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని నాయకుడొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో తామే అధికారంలోనే ఉన్నామని, శాసనసభ ఎన్నికల్లో చక్కని ఫలితాలొచ్చాయని అన్నారు.
జాతిజనుల మనోగమనానికి ఇది సూచిక అని, దీని ప్రభావం ఢిల్లీ విధానసభ ఎన్నికలపైనా తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాతీయ రాజధానిలో ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తాజా ఎన్నికలపై కమలం దృష్టి
Published Sun, Nov 2 2014 11:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement