న్యూఢిల్లీ: గత ఎన్నికలకు భిన్నంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ...విధానసభ ఎన్నికల బరిలోకి దిగనుంది. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో 35కు పైగా సీట్లను దక్కించుకునే విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రభావంపైనే పూర్తిగా ఆధారపడనుంది. డిసెంబర్ 20 నాటి జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికలు ముగిసిన కొద్ది సమయం విరామం తర్వాత ఢిల్లీ విధానసభకు ఎన్నికలు జరిగితే బాగుంటుందని బీజేపీ భావిస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారం బరిలోకి మోదీని దింపాలని భావించడమే. అలా జరగాలంటే మోదీకి తగినంత సమయం కావాలి. జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికలతర్వాత అయితే మోదీకి తగినంత సమయం ఉంటుందని, ఆవిధంగానే ముందుకుసాగాలని కమలం భావిస్తోంది.
జార్ఖండ్, కాశ్మీర్ తర్వాతే ఢిల్లీ విధానసభ ఎన్నికలు జరగాలని ఎందుకు ఆశిస్తున్నారంటూ ఆ పార్టీ వర్గాలను ప్రశ్నించగా నవంబర్, 25వ తేదీనుంచి ఈ రెండు రాష్ట్రాలకు ఐదు దశలుగా ఎన్నికలు జరుగుతాయని, వచ్చే నెల 20వ తేదీన అవి ముగుస్తాయని , ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ తలమునకలయ్యారని, ఇక ఢిల్లీ విధానసభ ఎన్నికలు కూడా వాటితోపాటే ప్రధానికి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేంత తీరిక, సమయం ఎక్కడుంటాయని అంటున్నాయి. తగినంత మెజారిటీ లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన కమలదళం... మోదీ నాయకత్వంలోనే విధానసభ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. నిరుడు జరిగిన విధానసభ ఎన్నికల్లో బీజేపీకి 32 స్థానాలొచ్చాయి. మరో నాలుగు సీట్లు వచ్చి ఉంటే అధికార పగ్గాలను చేపట్టేందుకు మార్గం సుగమమయ్యేది. అయితే కేవలం ఈ కారణంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ 49 రోజులపాటే కొనసాగిన సంగతి విదితమే. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కమలం ఆశలన్నీ మోదీపైనే!
Published Wed, Nov 5 2014 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement