Urban population
-
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరంగా ఢిల్లీ
హైదరాబాద్: 1950 లో ప్రపంచంలోనే అతి పెద్ద నగరం న్యూయార్క్. కానీ ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఏదంటారా? జపాన్ రాజధాని టోక్యో. అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా టోక్యో స్థానం సంపాదించింది. ఇప్పుడు సరే 2030 నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోంది? టోక్యో ప్రపంచంలోనే మరో అతిపెద్ద మహానగరంగా అవతరించనుంది. అయితే ఈ కోవలో న్యూఢిల్లీ కూడా చేరబోతోంది. టోక్యో తర్వాత న్యూఢిల్లీ రెండో స్థానంలో నిలువనుంది. అంటే... టోక్యో నగరం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఢిల్లీ అవతరించబోతోందన్న మాట. 65 ఏళ్ల కిందట న్యూయార్క్ సిటీ 1.2 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా ఉండింది. ఆ తర్వాత కాలంలో ఆ స్థానాన్ని టోక్యో ఆక్రమించింది. అలాగే వచ్చే 14 ఏళ్లలో టోక్యో జనాభా అనూహ్యంగా పెరగనుందని అంచనా. వలసలు, జనాభా పెరుగుదల రేటు, విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద నగరాలపై 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' అంచనా వేసింది. ఆ అంచనా మేరకు వచ్చే 14 ఏళ్లలో అంటే 2030 నాటికి టోక్యో జనాభా 3.7 కోట్లకు చేరనుంది. ఆయా దేశాల జనాభా మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఒక్క టోక్యో నగరమే ప్రపంచ దేశాల జాబితాలో 55 స్థానంలో నిలుస్తుంది. "యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్, 2014 రివిజన్ " నివేదిక ప్రకారం 2030 నాటికి జపాన్ కు చెందిన టోక్యో జనాభా 3.72 కోట్లకు చేరుతుంది. ఆ తర్వాత 3.61 కోట్ల జనాభాతో ఢిల్లీ రెండో అతిపెద్ద నగరంగా అవతరించనుంది. 1970 లో ఢిల్లీ జనాభా ఎంతో గమనిస్తే ఆ నగరంలో పెరుగుతున్న తీరు ఆశ్చరమేస్తుంది. ఎందుకంటే 1970 లో ఢిల్లీ జనాభా కేవలం 35 లక్షలు మాత్రమే. ఇలా ప్రపంచంలోని పది అతిపెద్ద నగరాల్లో టోక్యో, ఢిల్లీల తర్వాత షాంఘై, ముంబై, బీజింగ్, ఢాకా, కరాచీ, ఖైరో, లగోస్, మెక్సికో సిటీలు ఆక్రమించనున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఆనాటి పెద్ద నగరాలేంటివి? 1950 నాటి కాలంతో పోల్చితే ప్రపంచ వ్యాప్తంగా మహానగరాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 1950 లో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న న్యూయార్క్ 2030 నాటికి 30 వ స్థానంలోకి పడిపోనుంది. అప్పట్లో కేవలం 1.24 కోట్ల జనాభాతో న్యూయార్క్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా అవతరించగా, ఆ తర్వాత స్థానాల్లో టోక్యో, లండన్, ఒసాకా, ప్యారిస్, మాస్కో, బ్యూనస్ ఎయిర్స్, చికాగో, కోల్ కతా, షాంఘై నగరాలున్నాయి. 1950 నుంచి ప్రపంచ వ్యాప్తంగా పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అప్పట్లో పట్టణాల జనాభా 750 మిలియన్లు కాగా 2014 నాటికి ఆ జనాభా కాస్తా 3.9 బిలియన్లకు చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని మిగతా ఖండాలతో పోల్చితే ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోందని తెలియజేసింది. -
జనభారతం
జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 720 కోట్లు దాటింది. ప్రపంచ జనాభాలో 37 శాతం కేవలం చైనా, భారత్‌లలోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనసంఖ్యలో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలూ ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఖండాల వారీగా చూసుకుంటే, ప్రపంచ జనాభాలో 60 శాతం ఆసియాలోనే ఉంది. అయితే, ఆసియాలో జపాన్ మినహా అభివృద్ధి చెందిన దేశమేదీ లేదు. అధిక జనాభా కారణంగానే ఆసియా దేశాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోతున్నాయనే వాదనలు లేకపోలేదు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి భారత్ జనసంఖ్యలో చైనాను అధిగమిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో గడచిన రెండు శతాబ్దాల కాలంలోనే విపరీతమైన పెరుగుదల నమోదైంది. మరణాల రేటును మించి జననాల రేటు నమోదు కావడం, అధునాతన వైద్య సౌకర్యాలు విరివిగా అందుబాటులోకి రావడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అయితే, జనాభా ఎంతగా పెరిగినా భూ విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. అందుకే జనాభా పెరుగుతున్న కొద్దీ భూగోళం ఇరుకుగా మారుతోందనిపించే అవకాశాలు లేకపోలేదు. పెరుగుతున్న జనాభాకు తగినంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. ఇప్పటికైనా అధిక జనాభా గల దేశాలు మెలకువ తెచ్చుకుని జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో అనేక సామాజిక అసమతుల్యతలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జనాభా పెరుగుదల తీరుతెన్నులు, దానివల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినంగా ప్రకటించింది. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా 1987 జూలై 11న యూఎన్డీపీ 5 బిలియన్ డేగా ప్రకటించింది. అయితే, 1989న జూలై 11న మొదటిసారిగా ప్రపంచ జనాభా దినం జరుపుకోవడం ప్రారంభమైంది. దాదాపు రెండువందల దేశాలు అప్పటి నుంచి ఏటా జనాభా దినాన్ని పాటిస్తున్నాయి. ఈ వారంలో జరుపుకోనున్న ప్రపంచ జనాభా దినం సందర్భంగా ప్రపంచ జనాభా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలుయువతరంలో భారత్ నం:1 మొత్తం జనాభాలో భారత్ రెండో స్థానంలోనే ఉన్నా, యువతరం జనాభాలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10-24 ఏళ్ల లోపు యువతరం జనాభా 180 కోట్లు దాటింది. భారత్‌లో వీరి జనాభా 35.6 కోట్లు ఉండగా, చైనాలో 26.9 కోట్లు, ఇండోనేసియాలో 6.7 కోట్లు, అమెరికాలో 6.5 కోట్లు, పాకిస్థాన్‌లో 5.9 కోట్లు, నైజీరియాలో 5.7 కోట్లు, బ్రెజిల్లో 5.1 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.8 కోట్లు ఉన్నట్లు యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్‌పీఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. యువతరం జనాభా ఎక్కువగా ఉండి, జననాల రేటు అదుపులో ఉన్న దేశాలు శరవేగంగా ఆర్థిక పురోగతి సాధించగలవని యూఎన్‌పీఎఫ్ చెబుతోంది. ఆ లెక్కన జననాల రేటును నియంత్రించే చర్యలు తీసుకోగలిగితే, త్వరలోనే ఆర్థికశక్తిగా అవతరించే అవకాశాలు భారత్‌కు మెరుగుపడతాయి.పెరిగిన పట్టణ జనాభా గడచిన ఆరు దశాబ్దాల్లో ప్రపంచంలో పట్టణ జనాభా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1950 నాటికి పట్టణ జనాభా దాదాపు 74 కోట్లు ఉంటే, 2014 నాటికి 390 కోట్లకు చేరుకుంది. ప్రపంచ పట్టణ జనాభా 2045 నాటికి 600 కోట్లకు మించుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 2050 నాటికి పట్టణ జనాభా భారత్‌లో అత్యధికంగా 40.4 కోట్లు, చైనాలో 29.2 కోట్లు, నైజీరియాలో 21.2 కోట్లకు చేరుకుంటుందని కూడా అంచనా వేస్తోంది. పారిశ్రామికీకరణ, మెరుగైన ఉపాధి అవకాశాలు, పల్లెల్లో వ్యవసాయం కుదేలవడం, కుటీర పరిశ్రమలు కుంటుపడటం వంటి కారణాల వల్ల చాలామంది పల్లెలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారు. వలస వచ్చిన పల్లె జనాలు గత్యంతరం లేక పట్టణాల్లోనే స్థిరపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతోంది. -
పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్‌లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు. స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది. వివిధ నివేదికలు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్‌లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది. చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్‌లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్ 2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్‌లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది. జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది. పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్డ ఎక్స్పర్ట కమిటీ పేర్కొంది. రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్వర్క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్‌ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది. పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు. 1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల. 2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం. 3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. 4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల 5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం. 6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్