ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరంగా ఢిల్లీ
హైదరాబాద్:
1950 లో ప్రపంచంలోనే అతి పెద్ద నగరం న్యూయార్క్. కానీ ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఏదంటారా? జపాన్ రాజధాని టోక్యో. అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా టోక్యో స్థానం సంపాదించింది. ఇప్పుడు సరే 2030 నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోంది? టోక్యో ప్రపంచంలోనే మరో అతిపెద్ద మహానగరంగా అవతరించనుంది. అయితే ఈ కోవలో న్యూఢిల్లీ కూడా చేరబోతోంది. టోక్యో తర్వాత న్యూఢిల్లీ రెండో స్థానంలో నిలువనుంది. అంటే... టోక్యో నగరం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఢిల్లీ అవతరించబోతోందన్న మాట.
65 ఏళ్ల కిందట న్యూయార్క్ సిటీ 1.2 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా ఉండింది. ఆ తర్వాత కాలంలో ఆ స్థానాన్ని టోక్యో ఆక్రమించింది. అలాగే వచ్చే 14 ఏళ్లలో టోక్యో జనాభా అనూహ్యంగా పెరగనుందని అంచనా. వలసలు, జనాభా పెరుగుదల రేటు, విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద నగరాలపై 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' అంచనా వేసింది. ఆ అంచనా మేరకు వచ్చే 14 ఏళ్లలో అంటే 2030 నాటికి టోక్యో జనాభా 3.7 కోట్లకు చేరనుంది. ఆయా దేశాల జనాభా మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఒక్క టోక్యో నగరమే ప్రపంచ దేశాల జాబితాలో 55 స్థానంలో నిలుస్తుంది.
"యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్, 2014 రివిజన్ " నివేదిక ప్రకారం 2030 నాటికి జపాన్ కు చెందిన టోక్యో జనాభా 3.72 కోట్లకు చేరుతుంది. ఆ తర్వాత 3.61 కోట్ల జనాభాతో ఢిల్లీ రెండో అతిపెద్ద నగరంగా అవతరించనుంది. 1970 లో ఢిల్లీ జనాభా ఎంతో గమనిస్తే ఆ నగరంలో పెరుగుతున్న తీరు ఆశ్చరమేస్తుంది. ఎందుకంటే 1970 లో ఢిల్లీ జనాభా కేవలం 35 లక్షలు మాత్రమే. ఇలా ప్రపంచంలోని పది అతిపెద్ద నగరాల్లో టోక్యో, ఢిల్లీల తర్వాత షాంఘై, ముంబై, బీజింగ్, ఢాకా, కరాచీ, ఖైరో, లగోస్, మెక్సికో సిటీలు ఆక్రమించనున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.
ఆనాటి పెద్ద నగరాలేంటివి?
1950 నాటి కాలంతో పోల్చితే ప్రపంచ వ్యాప్తంగా మహానగరాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 1950 లో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న న్యూయార్క్ 2030 నాటికి 30 వ స్థానంలోకి పడిపోనుంది. అప్పట్లో కేవలం 1.24 కోట్ల జనాభాతో న్యూయార్క్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా అవతరించగా, ఆ తర్వాత స్థానాల్లో టోక్యో, లండన్, ఒసాకా, ప్యారిస్, మాస్కో, బ్యూనస్ ఎయిర్స్, చికాగో, కోల్ కతా, షాంఘై నగరాలున్నాయి.
1950 నుంచి ప్రపంచ వ్యాప్తంగా పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అప్పట్లో పట్టణాల జనాభా 750 మిలియన్లు కాగా 2014 నాటికి ఆ జనాభా కాస్తా 3.9 బిలియన్లకు చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని మిగతా ఖండాలతో పోల్చితే ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోందని తెలియజేసింది.