ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్
దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో.. కీలకపాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతోంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)! ఈ సర్వీస్‌కు ఎంపికకావడం ద్వారా ఉన్నత కెరీర్‌తో పాటు దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుంది. తాజాగా యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం...
మొత్తం ఖాళీలు అంచనా 110
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 27, 2016
అఖిల భారత సర్వీసుల్లో భాగంగా కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష వీలుకల్పిస్తుంది. ఐఎఫ్‌ఎస్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కేడర్ కంట్రోలింగ్ అథారిటీగా వ్యవహరిస్తోంది.
అర్హత
* యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ. (లేదా)
* అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
వయసు
2016, ఆగస్టు 1 నాటికి కనీస వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 32 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ.
* గతంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రిలిమినరీ రాత పరీక్షను యూపీఎస్సీ ప్రత్యేకంగా నిర్వహించేది. ప్రస్తుతం సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా నిర్వహిస్తోంది. అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లోని మెయిన్స్‌కు ఎంపిక కావాలంటే ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాలి.
* ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ ప్రత్యేకంగా మెయిన్స్‌కు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు సాధారణంగా ఖాళీల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్
ఇందులో రెండు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. పేపర్‌కు రెండు గంటలు సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ పేపర్లలో నెగిటివ్ మార్కులుంటాయి. ప్రశ్నపత్రాలు హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి.
విజయానికి సూచనలు
* బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలను ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేస్తూ, పట్టుసాధించాలి.
* తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుకల్పించే మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.
* పరీక్ష విధానం, అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
* జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలి.
* ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్‌ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి.
మెయిన్స్‌కు కూడా ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పేపర్లను ప్రిపేర్‌కావాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకుంటే విస్తృత అధ్యయనం అవసరం. సివిల్స్‌కు, ఐఎఫ్‌ఎస్‌కు ఒకే ప్రిలిమ్స్ పరీక్ష అయినప్పటికీ, కటాఫ్ మార్కులు ఐఎఫ్‌ఎస్‌కు ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.
- గుంటుపల్లి వరుణ్, ఐఎఫ్‌ఎస్ నాలుగో ర్యాంకు (2014)
మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్)
పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 300 మార్కులు
పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 300 మార్కులు
పేపర్-3 పేపర్-4 పేపర్-5 పేపర్-6 (ఆప్షనల్ పేపర్లు. అభ్యర్థులు రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు)
ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్
సర్వీసుకు సంబంధించిన విధులను నిర్వర్తించే సామర్థ్యం అభ్యర్థికి ఏ మేరకు ఉందో పర్సనాలిటీ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. దీనికి 300 మార్కులు కేటాయించారు.