సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్ | graduates Special for Police career | Sakshi
Sakshi News home page

సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్

Published Wed, Jun 8 2016 1:25 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్ - Sakshi

సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్

గ్రాడ్యుయేట్స్ స్పెషల్
సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బృహత్తర బాధ్యత పోలీసులది. పోలీసులు  లేకుంటే ప్రజలకు భద్రత కరువవుతుంది. సమాజంలో నేరాలను, నేర ప్రవృత్తిని అరికట్టే బాధ్యతాయుత ఉద్యోగం.. పోలీస్! నేరాలు ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో పోలీసుల అవసరం మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో పోలీసు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటనలు వెలువడి భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల ప్రకటనల నేపథ్యంలో పోలీస్ కెరీర్‌పై ప్రత్యేక కథనం..

 
ఉద్యోగావకాశాలు
* రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖలో ప్రాథమికంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. రాత పరీక్ష, శారీరక దారుఢ్య, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. తర్వాత ప్రమోషన్ల ద్వారా పై స్థాయికి వెళ్లొచ్చు.
* అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించొచ్చు.
* యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం ద్వారా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) ఉద్యోగం సాధించొచ్చు. ఇందుకోసం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
* ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డయ్యూ అండ్ డామన్, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ, పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాంతాల్లో పోలీసు నియామకాలు చేపడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
* సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో సబ్ ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో ఇన్‌స్పెక్టర్లు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)లో సబ్ ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లో ఇన్‌స్పెక్టర్ పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈ పోస్టులను దక్కించుకోవచ్చు.
* సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ)లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. రాత, శారీరక, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
పోలీసు విభాగాలు
సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు విభాగాలు ఉంటాయి. ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో మళ్లీ ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్, టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్), క్రైంబ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) తదితర విభాగాలుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఛండీగఢ్, పాండిచ్చేరి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోలీసు విభాగాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. సీబీఐ, ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు ఉంటారు.
 
పారా మిలటరీ దళాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్‌ఎస్‌బీ)లు ప్రత్యేక సాయుధ దళాలు. నిర్ణీత విధుల కోసం వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుగుబాట్లను ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులకు ఇవి సహకరిస్తాయి. సైన్యం తరహాలో వీటి నిర్మాణం ఉన్నందువల్ల వీటిని పారా మిలటరీ దళాలు అంటారు.
 
పోలీసు విధులు
అంతర్గత భద్రతను పరిరక్షించడం.
రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జిలు తదితర ప్రజల ఆస్తులు, ప్రఖ్యాత భవనాలు, కట్టడాలకు రక్షణ కల్పించడం.
ప్జల ప్రాణాలకు రక్షణ కల్పించడం.
నిందితులను విచారించడం, స్టేట్‌మెంట్లు నమోదు చేయడం.
క్రైం రిపోర్టులను పరిశీలించడం.
అభియోగాలను నమోదు చేయడం. వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, కోర్టుకు సమర్పించడం.
రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించడం.
అత్యవసర సమయాల్లో స్పందించడం.
ట్రాఫిక్/సమూహాన్ని నియంత్రించడం.
ఉద్రిక్తతల సమయంలో అందరూ శాంతియుతంగా ఉండేలా చూడటం
 
పని వేళలు
పోలీసులకు ప్రత్యేకించి పనివేళలు అంటూ ఏమీ ఉండవు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉంటారు. అవసరమైతే అర్ధరాత్రయినా వెళ్లి నేరస్తులను అరెస్టు చేయాలి. నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించడం వీరి బాధ్యత. పండగల సమయంలో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
 
కావాల్సిన నైపుణ్యాలు
పరిణతితో వ్యవహరించాలి.
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి.
విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదుర్కోగలగాలి.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం.
సునిశిత పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం ఉండాలి.
 
పాజిటివ్స్
ప్రజలకు నేరుగా రక్షణ కల్పించే అవకాశం లభిస్తుంది.
ఆయా నేరాలకు సంబంధించిన చిక్కుముళ్లను ఛేదించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవచ్చు.
పోలీసులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది.
ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు.
 
నెగటివ్స్
పోలీసులకు నిర్ణీత పనివేళలు ఉండవు. వారు 24 గంటలు డ్యూటీలో ఉంటారు.
పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా అవసరమైతే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది.
వృత్తి పరంగా అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి.
ఉగ్రవాద, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి రావడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement