Special graduates
-
సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బృహత్తర బాధ్యత పోలీసులది. పోలీసులు లేకుంటే ప్రజలకు భద్రత కరువవుతుంది. సమాజంలో నేరాలను, నేర ప్రవృత్తిని అరికట్టే బాధ్యతాయుత ఉద్యోగం.. పోలీస్! నేరాలు ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో పోలీసుల అవసరం మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో పోలీసు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటనలు వెలువడి భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల ప్రకటనల నేపథ్యంలో పోలీస్ కెరీర్‌పై ప్రత్యేక కథనం.. ఉద్యోగావకాశాలు * రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖలో ప్రాథమికంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. రాత పరీక్ష, శారీరక దారుఢ్య, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. తర్వాత ప్రమోషన్ల ద్వారా పై స్థాయికి వెళ్లొచ్చు. * అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించొచ్చు. * యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం ద్వారా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) ఉద్యోగం సాధించొచ్చు. ఇందుకోసం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. * ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డయ్యూ అండ్ డామన్, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ, పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాంతాల్లో పోలీసు నియామకాలు చేపడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో ఇన్స్పెక్టర్లు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లో ఇన్స్పెక్టర్ పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈ పోస్టులను దక్కించుకోవచ్చు. * సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ)లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. రాత, శారీరక, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాలు సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు విభాగాలు ఉంటాయి. ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో మళ్లీ ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్, టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్), క్రైంబ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) తదితర విభాగాలుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఛండీగఢ్, పాండిచ్చేరి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోలీసు విభాగాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. సీబీఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు ఉంటారు. పారా మిలటరీ దళాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ)లు ప్రత్యేక సాయుధ దళాలు. నిర్ణీత విధుల కోసం వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుగుబాట్లను ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులకు ఇవి సహకరిస్తాయి. సైన్యం తరహాలో వీటి నిర్మాణం ఉన్నందువల్ల వీటిని పారా మిలటరీ దళాలు అంటారు. పోలీసు విధులు ⇒ అంతర్గత భద్రతను పరిరక్షించడం. ⇒ రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జిలు తదితర ప్రజల ఆస్తులు, ప్రఖ్యాత భవనాలు, కట్టడాలకు రక్షణ కల్పించడం. ⇒ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం. ⇒ నిందితులను విచారించడం, స్టేట్మెంట్లు నమోదు చేయడం. ⇒ క్రైం రిపోర్టులను పరిశీలించడం. ⇒ అభియోగాలను నమోదు చేయడం. వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, కోర్టుకు సమర్పించడం. ⇒ రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించడం. ⇒ అత్యవసర సమయాల్లో స్పందించడం. ⇒ ట్రాఫిక్/సమూహాన్ని నియంత్రించడం. ⇒ ఉద్రిక్తతల సమయంలో అందరూ శాంతియుతంగా ఉండేలా చూడటం పని వేళలు పోలీసులకు ప్రత్యేకించి పనివేళలు అంటూ ఏమీ ఉండవు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉంటారు. అవసరమైతే అర్ధరాత్రయినా వెళ్లి నేరస్తులను అరెస్టు చేయాలి. నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించడం వీరి బాధ్యత. పండగల సమయంలో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు ⇒ పరిణతితో వ్యవహరించాలి. ⇒ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. ⇒ విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదుర్కోగలగాలి. ⇒ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ⇒ సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం. ⇒ సునిశిత పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం ఉండాలి. పాజిటివ్స్ ⇒ ప్రజలకు నేరుగా రక్షణ కల్పించే అవకాశం లభిస్తుంది. ⇒ ఆయా నేరాలకు సంబంధించిన చిక్కుముళ్లను ఛేదించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవచ్చు. ⇒ పోలీసులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. నెగటివ్స్ ⇒ పోలీసులకు నిర్ణీత పనివేళలు ఉండవు. వారు 24 గంటలు డ్యూటీలో ఉంటారు. ⇒ పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా అవసరమైతే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ⇒ మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ⇒ వృత్తి పరంగా అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ⇒ ఉగ్రవాద, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి రావడం. -
నాటా - 2016
గరిష్టంగా ఐదుసార్లు గ్రాడ్యుయేట్స్ స్పెషల్ ఎన్నో అందమైన, ఎత్తై భవనాలకు చక్కటి రూపమిచ్చేది ఆర్కిటెక్ట్‌లే. అలాంటి సృజనాత్మక ఆర్కిటెక్టులుగా రూపొందాలంటే రాయాల్సిన పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). దీన్ని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. నాటా స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)లో చేరొచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 1న మొదలైంది. ఆగస్టు 20 వరకు రాయవచ్చు. ఈ ఏడాది నుంచి నాటాలో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి వివరాలు... నాటా-2016 మార్పులు.. * ఈ ఏడాది నుంచి ఐదుసార్లకు మించి పరీక్ష రాయడానికి వీల్లేదు. అది కూడా మొదటిసారి పరీక్ష రాసిననాటి నుంచి రెండేళ్లలోపు వరకు మాత్రమే వర్తిస్తుంది. * నాటా పరీక్ష ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఆగస్టు 20 వరకు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. * అభ్యర్థులు గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాసుకోవచ్చు కాబట్టి వీటిలో ఉత్తమ స్కోర్‌ను ‘బెస్ట్ స్కోర్’గా పరిగణిస్తారు. * నాటా స్కోర్‌కు పరీక్ష రాసిన నాటి (ఏప్రిల్ 1, 2016) నుంచి రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 2016కు ముందు పరీక్ష రాసినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. * నాటా ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష రాసే ప్రతిసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా రాసిన ప్రతిసారి పరీక్ష ఫీజు చెల్లించాలి. * పరీక్ష తర్వాత ప్రకటించే మార్కుల జాబితాలో అంతకుముందు రాసిన పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కులు కూడా ఉంటాయి. * నాటా-2016కు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఇంతకుముందు రాసిన నాటా వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. * గతంలో నాటాకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాయనివారు, రాసినా ఆ వివరాలు తెలపనివారి ప్రీవియస్ నాటా స్కోర్లన్నీ రద్దవుతాయి. వారు మళ్లీ పరీక్ష రాయడానికి అనర్హులు. నాటా-2016 సమాచారం అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: ఐదేళ్లు పరీక్ష విధానం.. ఈ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. డ్రాయింగ్ టెస్ట్: అభ్యర్థిలోని సృజనాత్మకతను పరీక్షించే విధంగా డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్ణీత ఆకారం లేదా వస్తువును అభ్యర్థి ముందుంచి.. దాని ఆధారంగా ఊహాశక్తితో డ్రాయింగ్ వేయమంటారు. ఒక వస్తువును పలు కోణాల్లో చిత్రించమన డం, నిర్ణీత ఆకారానికి ఆకట్టుకునే రంగులు వేయడం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నిజజీవితంలో ఎదురైన సంఘటనలను ఊహించుకుంటూ.. వాటికి సంబంధించిన చిత్రాలను గీయమని కూడా అడుగుతుంటారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. నాటాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం కల్పిస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్- జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏయూ, వైజాగ్. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ - హైదరాబాద్ ఎస్ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్-అగిరిపల్లి, కృష్ణాజిల్లా. వివరాలకు: http://www.nata.in రిజిస్ట్రేషన్ ఆగస్టు 18 వరకు www.nata.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1,250 డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో 40 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. అభ్యర్థిలోని పరిశీలనాత్మక, సృజ నాత్మక శక్తి, భావ వ్యక్తీకరణ, ఆలోచనా శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. -
బ్యాచిలర్ డిగ్రీతో బెటర్ ఫ్యూచర్!!
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపే! ప్రొఫెషనల్ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ కోర్సులకూ జాబ్ మార్కెట్లో ఏమాత్రం వన్నె తగ్గలేదంటున్నారు నిపుణులు. కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, కంపెనీలకు వివిధ నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో కెరీర్ స్కోప్.. కాంపిటీషన్ కింగ్.. బీఏ పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు ఉపయోగపడే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలోనే చదివుండటం వల్ల ప్రిపరేషన్లో ఎంతో కలిసొస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు సైతం సివిల్స్‌లో సోషల్‌సెన్సైస్ సబ్జెక్టులు ఎంచుకుని విజయాలు సాధిస్తున్నారంటేనే ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. బీఏలో చేరిన మొదట్నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తే తేలికగా విజయం సాధించొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ వర్సిటీలందించే పీజీ కోర్సుల్లో చేరి ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషల్వర్క, ఫారెన్ లాంగ్వేజెస్, పాలిటీ వంటి కోర్సులు అభ్యసిస్తే మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ చేసినవారికి ఉద్యోగాలెన్నో! హిస్టరీ విద్యార్థులు ఆర్కియాలజీ విభాగాల్లో పనిచేయొచ్చు. పాలిటీ చదివితే వివిధ పత్రికలు, న్యూస్ చానెళ్లు, పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. లాంగ్వేజెస్ చేసినవారు వివిధ రాయబార కార్యాలయాల్లో, కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయొచ్చు. కెరీర్ షైనింగ్.. కామర్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా బీకాంలో ఈ-కామర్స్; ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; కార్పొరేట్ సెక్రటరీషిప్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణకు కామర్స్ పట్టభద్రులు తప్పనిసరి. వివిధ దేశీయ, విదేశీ సంస్థలు ఒక మాదిరి పట్టణాల్లో సైతం తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ఖాతాల నిర్వహణ వంటి విభాగాల్లో బీకాం విద్యార్థుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి డిగ్రీలో బీకాం, బీకాం(కంప్యూటర్స్ విద్యార్థులు)లు అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాలీ వంటి కోర్సులను నేర్చుకోవడంతోపాటు, స్పోకెన్ ఇంగ్లిష్‌పై దృష్టిపెడితే ప్రారంభంలోనే ఐదెంకెల వేతనాలు ఖాయం. ఇక చార్టర్‌డ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలు కోకొల్లలు. భావి శాస్త్రవేత్తలకు... బీఎస్సీ ‘దేశవ్యాప్తంగా పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి కుంటుపడటం ఖాయం’. ఇది దేశంలోని మేధావులు, నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన! ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. నిష్ణాతులైన శాస్త్రవేత్తల అవసరం ఎంతో. డిగ్రీలో కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కోర్సులను దీర్ఘకాలిక దృష్టితో చదవాలి. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుతూ.. ఇష్టమైన అంశంపై పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సీఎస్ఐఆర్ నెట్లో జేఆర్ఎఫ్ సాధిస్తే ప్రతినెలా ఫెలోషిప్ పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో పీహెచ్డీ కూడా చేయొచ్చు. తర్వాత పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ ఆకర్షణీయ జీతాలూ పొందొచ్చు. డిగ్రీ కోర్సులకు.. పూర్వ వైభవం మూడేళ్ల నుంచి సంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిని బీఏ బాగా ఆకర్షిస్తోంది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో బీఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బీకాంలో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు. సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్, సీఎస్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి బీకాం సరైన మార్గం. కార్పొరేట్ సంస్థలు సైతం డిగ్రీ ఉత్తీర్ణులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గత నెలలో 40 మందికి పైగా సైన్స్ విద్యార్థులను రూ.15 వేలతో కంపెనీలు నియమించుకున్నాయి. - ప్రొ. టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో.. కీలకపాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతోంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)! ఈ సర్వీస్‌కు ఎంపికకావడం ద్వారా ఉన్నత కెరీర్‌తో పాటు దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుంది. తాజాగా యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం... మొత్తం ఖాళీలు అంచనా 110 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 27, 2016 అఖిల భారత సర్వీసుల్లో భాగంగా కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష వీలుకల్పిస్తుంది. ఐఎఫ్ఎస్కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కేడర్ కంట్రోలింగ్ అథారిటీగా వ్యవహరిస్తోంది. అర్హత * యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ. (లేదా) * అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. వయసు 2016, ఆగస్టు 1 నాటికి కనీస వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 32 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం * ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ. * గతంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రిలిమినరీ రాత పరీక్షను యూపీఎస్సీ ప్రత్యేకంగా నిర్వహించేది. ప్రస్తుతం సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా నిర్వహిస్తోంది. అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లోని మెయిన్స్‌కు ఎంపిక కావాలంటే ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాలి. * ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ ప్రత్యేకంగా మెయిన్స్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు సాధారణంగా ఖాళీల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఇందులో రెండు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. పేపర్‌కు రెండు గంటలు సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ పేపర్లలో నెగిటివ్ మార్కులుంటాయి. ప్రశ్నపత్రాలు హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి. విజయానికి సూచనలు * బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలను ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేస్తూ, పట్టుసాధించాలి. * తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుకల్పించే మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. * పరీక్ష విధానం, అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. * జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలి. * ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. మెయిన్స్‌కు కూడా ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పేపర్లను ప్రిపేర్‌కావాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకుంటే విస్తృత అధ్యయనం అవసరం. సివిల్స్‌కు, ఐఎఫ్ఎస్కు ఒకే ప్రిలిమ్స్ పరీక్ష అయినప్పటికీ, కటాఫ్ మార్కులు ఐఎఫ్ఎస్కు ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. - గుంటుపల్లి వరుణ్, ఐఎఫ్ఎస్ నాలుగో ర్యాంకు (2014) మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్) పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 300 మార్కులు పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 300 మార్కులు పేపర్-3 పేపర్-4 పేపర్-5 పేపర్-6 (ఆప్షనల్ పేపర్లు. అభ్యర్థులు రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు) ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ సర్వీసుకు సంబంధించిన విధులను నిర్వర్తించే సామర్థ్యం అభ్యర్థికి ఏ మేరకు ఉందో పర్సనాలిటీ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. దీనికి 300 మార్కులు కేటాయించారు.