గుంటూరులో ఘనంగా ‘భవిత’ ఆవిష్కరణ సభ
తెలుగు పత్రికారంగ చరిత్రలో సువర్ణాధ్యాయానికి ‘సాక్షి’ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రతి గురువారం ఇస్తున్న ‘భవిత’ అనుబంధాన్ని ఇకపై మెయిన్ ఎడిషన్‌లో ప్రతిరోజూ పాఠకులకు అందించేందుకు మరో ముందడుగు వేసింది. సాహసోపేతమైన నిర్ణయాన్ని అనుకున్నదే తడవుగా అమల్లోకి తెచ్చింది. విద్యార్థులు, పోటీ పరీక్షల శిక్షణార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన సమాచారంతో ముస్తాబైన సాక్షి ‘భవిత’ మెయిన్ ఎడిషన్ కాపీలను గుంటూరు నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల ప్రాంగణంలో బుధవారం ఆవిష్కరించారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ‘భవిత’ కాపీలను ఆవిష్కరించారు.
- గుంటూరు ఎడ్యుకేషన్
‘భవిత’తో ఉజ్వల భవిత
విద్యార్థులు, ఉద్యోగార్థులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్న ‘భవిత’ ఇకపై ప్రతిరోజూ వెలువడటం ఎంతో ప్రయోజనకరమని హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ డాక్టర్ డీఎన్ రెడ్డి పేర్కొన్నారు. కోర్సు ఏదైనప్పటికీ ఎంపిక దశలోనే అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘భవిత’లో నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలతో విద్యార్థులు ఉజ్వల భవితను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి అభిరుచి ఉన్న రంగంలో ప్రోత్సహించాలని హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్ డెరైక్టర్ ఆర్‌సీ రెడ్డి సూచించారు. ఇంజనీరింగ్, ఐఐటీలే జీవితంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు తమకు ఆసక్తి గల ఇతర రంగాలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. టీఎంఐ నెట్‌వర్క్ చైర్మన్ టి.మురళీధరన్ మాట్లాడుతూ...లక్ష్యం ఏదైనా సరే, దాన్ని సాధించేందుకు కఠోర శ్రమ, ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని స్పష్టం చేశారు.
నూతన ఒరవడికి ‘సాక్షి’ నాంది
తెలుగు పత్రికారంగ చరిత్రలో నూతన ఒరవడికి ‘సాక్షి’ నాంది పలికిందని ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు విద్య, ఉద్యోగ సమాచారాన్ని అం దించేందుకు ‘భవిత’ను వారానికోసారి మార్కెట్‌లోకి తీసుకురావడాన్ని పెద్దయజ్ఞంగా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మెయిన్ ఎడిషన్‌లో ప్రతి రో జూ 2 పేజీ లను ‘భవిత’కే కేటాయించడం సాహసోపేతమని చెప్పా రు. లక్షలాది మంది పాఠకుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ శ్రీకారం
గత ఎనిమిదేళ్లలో తెలుగు పత్రికారంగంలో ‘సాక్షి’ ఎన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిందని ‘సాక్షి’ రెసిడెంట్ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షల శిక్షణార్థుల ప్రయోజనార్థం ‘భవిత’ ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తోందని చెప్పారు. పోటీ పరీక్షలు జరిగిన మరునాడే సమాధానాల ‘కీ’ని విడుదల చేయడమనే ఒరవడిని ‘సాక్షి’ ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల నిపుణులు డాక్టర్ బీజేబీ కృపాదానం, సీటీవో జయకృష్ణ, ‘సాక్షి’ డెరైక్టర్ పీవీకే ప్రసాద్, హెచ్‌ఆర్ వైస్‌ప్రెసిడెంట్ రాంప్రసాద్, విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్‌చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రిన్సిపాల్ పాతూరి రాధిక, విద్యార్థులు, పోటీ పరీక్షల శిక్షణార్థులు పాల్గొన్నారు.
‘సాక్షి’ది గొప్ప ప్రయత్నం
‘సాక్షి’ యాజమాన్యం ఎంతో శ్రమతో కూడిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకుందని డాక్టర్ లావు రత్తయ్య ప్రశంసించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా ‘భవిత’ను తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదన్నారు. వారానికి ఒకసారి వచ్చే ‘భవిత’ను ఇకపై ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్‌లో రెండు పేజీలు ఇవ్వనుండడం గొప్ప ప్రయత్నమన్నారు. ఇది ఓ సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. విద్యారంగ నిపుణులు, సబ్జెక్ట్ నిపుణులు అందించే సలహాలు, సూచనలు, సబ్జెక్ట్ మెటీరియల్‌తో పాఠకులను ఆకట్టుకునే విధంగా ‘సాక్షి’ ముందడుగు వేసిందని అభినందించారు. పాఠశాల స్థాయిలోనే ఐఐటీ కోచింగ్ అందిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి శిక్షణ పొందాలనే అంశాలపై విద్యార్థులు, యువతరాన్ని చైతన్యపరుస్తూ తల్లిదండ్రులను అప్రమత్తంగా చేసేవిధంగా ‘సాక్షి’ భవిత రూపుదిద్దుకోవడం మంచి పరిణామమని రత్తయ్య కొనియాడారు.
తెలుగు పత్రికారంగ చరిత్రలో కొత్త అధ్యాయం
Published Thu, Apr 28 2016 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Advertisement