ప్రపంచంలో తొలిసారిగా 1907లో ప్లాస్టిక్‌ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే, భారీ స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి 1952 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పర్యావరణానికి బెడదగా మారింది.
ఇటీవలి కాలంలో ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 80 లక్షల టన్నులు. ఇవే పరిస్థితులు కొనసాగితే, 2040 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు 2.90 కోట్ల టన్నులకు చేరుకోగలవని శాస్త్రవేత్తల అంచనా.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. 1952 నాటితో పోల్చుకుంటే, ప్లాస్టిక్ వినియోగం రెండువందల రెట్లు పెరిగింది.
సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తిదారు. అమెరికా ఏటా 4,2 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తోంది. చైనా, యూరోపియన్ దేశాల్లో ఏటా జరిగే ప్లాస్టిక్ ఉత్పత్తి కంటే, అమెరికా చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువవ. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోలు.
ప్లాస్టిక్ నేలలోను, నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పోగుపడి కాలుష్యానికి కారణమవుతోంది. ప్లాస్టిక్ నేరుగా మన పొట్టల్లోకే చేరేటంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి మనిషి పొట్టలోకి వారానికి సగటున ఐదు గ్రాముల ప్లాస్టిక్ చేరుతోంది.
ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్
ఎక్స్‌పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్‌గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్‌మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్‌ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు.
జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్‌ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్‌ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్‌ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment