ప్లాస్టిక్‌ కవర్లలో వేడి ఛాయ్‌! పొట్ట కింద ‘టైర్లు’! అలారం మోగుతోంది.. వినబడుతోందా? | Pudami Sakshiga: Food Wastage Know Significance Of Reduce Reuse Recycle | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కవర్లలో వేడి వేడి ఛాయ్‌! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా?

Published Tue, Jan 24 2023 12:12 PM | Last Updated on Tue, Jan 24 2023 1:05 PM

Pudami Sakshiga: Food Wastage Know Significance Of Reduce Reuse Recycle

ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు.. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? మార్కెట్‌కు వెళ్లి చికెన్‌ కొందామనుకున్నాం. కోడి కాస్తా చికెన్‌గా మారే ప్రక్రియలో 30% వేస్ట్‌గా మారుతుంది. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కోటికి పైగా జనాభా ఉండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో ఎన్ని టన్నుల చికెన్‌ వేస్టేజ్‌ను ఏం చేస్తున్నారు?

వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్‌ కవర్లలో
మనకు నీట్‌గా ప్లాస్టిక్‌ కవర్లలో చికెన్‌ ప్యాక్‌ చేసిస్తారు సరే, వేస్టేజ్‌ అంతా ఎక్కడికి పంపుతున్నారు? స్టేషన్‌ దగ్గర హోటల్‌ ఉంది. కర్రీ ప్యాకింగ్‌ కోసం వస్తున్నారు. అందరికీ వేడి కర్రీలను ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేస్తున్నారు.

అంతెందుకు గిన్నెలో మరిగే వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్‌ కవర్లలో కట్టిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కారదట. అది సరే, కవర్లలో అంత వేడి పదార్థాలను పోస్తుంటే దాన్నుంచి ఏమీ వెలువడవా? అందులోని పదార్థాలను తిన్నా, తాగినా ఏమీ కాదా?

తెలిసిన వాళ్లలో బాగా ఉన్న వాళ్లొకరున్నారు. చాలాసార్లు పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను. ఆశ్చర్యం.. ఇల్లంతా ఏసీ. బాత్‌రూంలో కూడా చల్లదనమే. అడిగితే ఇదే మాకు అలవాటన్నారు. ఏడాదంతా వాళ్లు ఏసీలోనే ఉంటారు.

ఎండ ఉన్నా, వేడి నీళ్లతోనే స్నానం
మరో విషయం. ఎంత ఎండ ఉన్నా, వాళ్లు వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా వీళ్లు మారిపోయారా? చలికాలంలో వేడి నీళ్లు సరే, ఎండాకాలంలో కూడా చన్నీళ్లను భరించలేని స్థితికి మారిపోయారా? ప్రతిరోజూ సీల్‌ విప్పిన ప్లాస్టిక్‌ బాటిల్‌ నీళ్లను మాత్రమే ఎందుకు తాగుతారు? స్టేటస్‌ సింబల్‌ సరే, ఇలాంటి వాళ్లు చేసే పని వల్ల పుడమిపై ఎంత భారం పడుతుంది?

కడుపులో కుక్కేయాలా?
మా ఊరి నుంచి పెద్దాయన కబురు పెట్టాడు. సిటీలోనే ఆయన కూతురు పెళ్లి. తప్పదు కాబట్టి వెళ్లాం. పేద్ద కన్వెన్షన్‌ హాల్‌. వేలల్లో అతిథులు ఉంటారు. భోజనాల దగ్గర జాతరలా ఉంది. తిన్నా, తినకపోయినా ప్లేట్ల నిండా అక్కరకు మించి మాంసం ముక్కలు వేసేసుకుంటున్నారు. అందులో సగం కూడా తినట్లేదు.

అడ్డంగా పారేస్తున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ పారేస్తున్నారు. ఇలా చెత్తబుట్టల్లో వేసిన విలువైన ఆహారం సంగతేంటీ? భూమిలో వేస్తారా? లేక ఇంకేమైనా చేస్తారా? మనది కాదు కాబట్టి.. మళ్లీ మళ్లీ దొరకదు కాబట్టి కడుపులో కుక్కేయాలా?

మిగిలిపోతోంది
చిన్న కుటుంబం. సగటు జీవితం. అయినా తేడా కొడుతోంది. నిజానికి మంచి శాలరీనే వస్తోంది. అయినా సరిపోవట్లేదు, పైగా అప్పులు. నలుగురి కోసం లెక్క వేసుకుంటున్నాం కానీ.. భోజనం పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు తినాల్సినంత మిగిలిపోతోంది. తెల్లవారికల్లా చద్దన్నం. ఆకలి తగ్గిందా? లేదు లేదు మరింత పెరిగింది. అందుకే ఆర్డర్ల మీద ఆర్డర్లు. యాప్‌ నొక్కగానే వస్తున్నాయి.

పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి
జంక్‌ఫుడ్‌ కమ్మగా ఉంటే ఇంట్లో వండింది ఎందుకు తింటాం? ఎందుకు బయటి తిండే రుచికరంగా అనిపిస్తోంది? అవును.. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి. తెలియకుండానే దుస్తులు టైట్‌ అవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు వంద. మనిషి ఆలోచనల్లో ఎక్కడో తేడా కొడుతుంది. బతికే పద్ధతి పక్కదారి పడుతోంది.

నేను బతకాలి నుంచి నేనే బతకాలి అన్నంత వరకు వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి దొరికినంత తినాలి, తిరగాలి, ఎంజాయ్‌ చేయాలి. ఉన్న ఒక్క జీవితం అనుభవించడానికేనా? దొరికిందంతా మనమే అనుభవిస్తే.. వచ్చే తరానికి మిగిలేదేంటీ?

అప్పటి నుంచి విప్లవం
మన సైన్స్‌ లెక్కల ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల కింద పుట్టింది. సకల ప్రాణుల్లో ఒకరిగా మనిషి అనే రూపం కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపం– అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, 2 లక్షల ఏళ్ల కింద అవతరించింది. 6 వేల ఏళ్ల నుంచి నాగరికత మొదలయింది. ఎప్పుడయితే మనిషి నిప్పును కనుగొన్నాడో అప్పటి నుంచి విప్లవం వచ్చింది.

200 ఏళ్ల కింద పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ వచ్చింది. అంటే 450 కోట్ల పుడమిని అంతకు ముందెన్నడూ లేని రీతిలో 200 ఏళ్లలో మనిషి దెబ్బతీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ధాటికి సర్వం కాలుష్యం. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది.. ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వస్తువులను పుడమి నుంచి తయారు చేసుకుని వాటిని వ్యర్థాలుగా మార్చి మళ్లీ భూమిలో కలిపేస్తున్నారు.

ఇంకెన్నాళ్లో ఉండదు
ఒక్క భూమి మాత్రమేనా? ఇప్పటికే సముద్రాలన్నింటిలో చెత్త, రసాయనాలు నింపేసి విషపూరితంగా మార్చేస్తున్నాడు. పైగా అహంకారం ఒకటి. ఇంకొకడు వాడింది నేను ముట్టుకోనంతే అంటాడు. ఏంటో మరి. నాకన్నీ కొత్తవి, బ్రాండ్‌ న్యూ వస్తువులు కావాలంటున్నారు. ఇలా ఎవరికి వాళ్లు నచ్చినవన్నీ వాడేసుకుంటూ పోతే.. వ్యర్థాలన్నీ నింపుకుంటూ వెళ్తే.. ఈ భూమి ఇంకెన్నాళ్లో ఉండదు.

అందుకే రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్‌ చేయాలి. ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ చేయాలి? చెత్త కుప్పలు కాదు కొండలు లేని దేశంగా, పుడమిగా మారాలి. పర్యావరణాన్ని తద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవ్వాళ మీరు తీసుకునే జాగ్రత్తలు, వేసే చిన్న చిన్న అడుగులే అందమైన భవిష్యత్తుకు దారిస్తాయి, పుడమిని కాపాడతాయి.


-శ్రీనాథ్‌ గొల్లపల్లి

చదవండి: Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
అమెరికాలో ఒమిక్రాన్‌ కొత్త సబ్‌ వేరియెంట్‌!! మనమెందుకు పట్టించుకోవాలంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement