junkfood
-
ఎంత చెబుతున్నా వినరు.. ఆసక్తికర గణాంకాలు!
పిల్లలకు చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. పిల్లలే కాదు పెద్దల్లోనూ ఆ అలవాటు ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా జంక్ ఫుడ్ సేల్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. తాజాగా యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (ఏటీఎన్ఐ) రిపోర్ట్ ప్రకారం జంక్‌ఫుడ్ సేల్స్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీల సేల్స్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాటా పెరుగుతోంది. దేశంలో ప్రముఖ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీలు తయారుచేస్తున్న 1,901 ప్రొడక్టుల్లో కేవలం 24 శాతం మాత్రమే ఆరోగ్యకరమైనవి. ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో ఈ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. మొత్తం ఏడు కేటగిరీల్లో 58 ఇండికేటర్లను వాడి కంపెనీలను విశ్లేషించామని ఏటీఎన్ఐ వెల్లడించింది. ప్రొడక్ట్ వివరాలు, గవర్నెన్స్, మార్కెటింగ్, లేబులింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏటీఎన్ఐ కంపెనీలకు హెల్తీనెస్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఐటీసీ టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాత స్థానాల్లో హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, కోకకోలా ఇండియా ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్‌లో 3.5 కంటే ఎక్కువ స్టార్స్ పొందిన ప్రొడక్ట్‌లను హెల్తీ ప్రొడక్ట్‌లుగా ఏటీఎన్ఐ వర్గీకరించింది. ఇందులో పండ్లు, కూరగాయలు, ఫైబర్, కంట్రోలింగ్ స్థాయిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్, షుగర్ ఉన్నాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో చాలా వాటికి చెందిన ప్రొడక్ట్‌ల రేటింగ్ 3.5 కంటే తక్కువ ఉందని ఏటీఎన్ఏ రిపోర్ట్ వెల్లడించింది. టాప్ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రొడక్ట్‌ల యావరేజ్ రేటింగ్ 1.9 ఉందని తెలిపింది. సగానికి పైగా (55.6 శాతం) కంపెనీల ప్రొడక్ట్‌ల రేటింగ్ ఐదుకు 1.5గా ఉందని, కేవలం 12 శాతం ప్రొడక్ట్‌లు చిన్న పిల్లలు తినేందుకు అర్హత పొందాయని వెల్లడించింది. ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్ ఎస్ గారెట్ అన్నారు. డైట్, న్యూట్రిషన్, హెల్త్ వంటి అంశాలపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక! ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు, షుగర్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వాటాను హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, పెప్సికో వంటి కంపెనీలు వేగంగా తగ్గిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో తయారైన ప్రొడక్ట్‌లను హిందుస్తాన్ యునిలీవర్, ఐటీసీలు తయారుచేస్తున్నాయి. కానీ అందులోనూ చాలా సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హెల్తీ ఫుడ్ అంటే ఏంటో తెలియజేయడానికి ప్రామాణిక నిర్వచనం ఏమీ లేదని గుర్తు చేసింది. కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ‘హెల్తీఫుడ్’ పేరుతో ఉత్పత్తులు తయారుచేస్తున్నాయని తెలిపింది. కానీ అవి అంతర్జాతీయ ప్రయాణాలకు తగినట్లు గుర్తింపు పొందడం లేదని చెప్పింది. -
ప్లాస్టిక్ కవర్లలో వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’! అలారం మోగుతోంది.. వినబడుతోందా?
ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు.. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? మార్కెట్‌కు వెళ్లి చికెన్ కొందామనుకున్నాం. కోడి కాస్తా చికెన్‌గా మారే ప్రక్రియలో 30% వేస్ట్‌గా మారుతుంది. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కోటికి పైగా జనాభా ఉండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో ఎన్ని టన్నుల చికెన్ వేస్టేజ్‌ను ఏం చేస్తున్నారు? వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో మనకు నీట్‌గా ప్లాస్టిక్ కవర్లలో చికెన్ ప్యాక్ చేసిస్తారు సరే, వేస్టేజ్ అంతా ఎక్కడికి పంపుతున్నారు? స్టేషన్ దగ్గర హోటల్ ఉంది. కర్రీ ప్యాకింగ్ కోసం వస్తున్నారు. అందరికీ వేడి కర్రీలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. అంతెందుకు గిన్నెలో మరిగే వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో కట్టిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కారదట. అది సరే, కవర్లలో అంత వేడి పదార్థాలను పోస్తుంటే దాన్నుంచి ఏమీ వెలువడవా? అందులోని పదార్థాలను తిన్నా, తాగినా ఏమీ కాదా? తెలిసిన వాళ్లలో బాగా ఉన్న వాళ్లొకరున్నారు. చాలాసార్లు పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను. ఆశ్చర్యం.. ఇల్లంతా ఏసీ. బాత్రూంలో కూడా చల్లదనమే. అడిగితే ఇదే మాకు అలవాటన్నారు. ఏడాదంతా వాళ్లు ఏసీలోనే ఉంటారు. ఎండ ఉన్నా, వేడి నీళ్లతోనే స్నానం మరో విషయం. ఎంత ఎండ ఉన్నా, వాళ్లు వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా వీళ్లు మారిపోయారా? చలికాలంలో వేడి నీళ్లు సరే, ఎండాకాలంలో కూడా చన్నీళ్లను భరించలేని స్థితికి మారిపోయారా? ప్రతిరోజూ సీల్ విప్పిన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను మాత్రమే ఎందుకు తాగుతారు? స్టేటస్ సింబల్ సరే, ఇలాంటి వాళ్లు చేసే పని వల్ల పుడమిపై ఎంత భారం పడుతుంది? కడుపులో కుక్కేయాలా? మా ఊరి నుంచి పెద్దాయన కబురు పెట్టాడు. సిటీలోనే ఆయన కూతురు పెళ్లి. తప్పదు కాబట్టి వెళ్లాం. పేద్ద కన్వెన్షన్ హాల్. వేలల్లో అతిథులు ఉంటారు. భోజనాల దగ్గర జాతరలా ఉంది. తిన్నా, తినకపోయినా ప్లేట్ల నిండా అక్కరకు మించి మాంసం ముక్కలు వేసేసుకుంటున్నారు. అందులో సగం కూడా తినట్లేదు. అడ్డంగా పారేస్తున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ పారేస్తున్నారు. ఇలా చెత్తబుట్టల్లో వేసిన విలువైన ఆహారం సంగతేంటీ? భూమిలో వేస్తారా? లేక ఇంకేమైనా చేస్తారా? మనది కాదు కాబట్టి.. మళ్లీ మళ్లీ దొరకదు కాబట్టి కడుపులో కుక్కేయాలా? మిగిలిపోతోంది చిన్న కుటుంబం. సగటు జీవితం. అయినా తేడా కొడుతోంది. నిజానికి మంచి శాలరీనే వస్తోంది. అయినా సరిపోవట్లేదు, పైగా అప్పులు. నలుగురి కోసం లెక్క వేసుకుంటున్నాం కానీ.. భోజనం పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు తినాల్సినంత మిగిలిపోతోంది. తెల్లవారికల్లా చద్దన్నం. ఆకలి తగ్గిందా? లేదు లేదు మరింత పెరిగింది. అందుకే ఆర్డర్ల మీద ఆర్డర్లు. యాప్ నొక్కగానే వస్తున్నాయి. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి జంక్‌ఫుడ్ కమ్మగా ఉంటే ఇంట్లో వండింది ఎందుకు తింటాం? ఎందుకు బయటి తిండే రుచికరంగా అనిపిస్తోంది? అవును.. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి. తెలియకుండానే దుస్తులు టైట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు వంద. మనిషి ఆలోచనల్లో ఎక్కడో తేడా కొడుతుంది. బతికే పద్ధతి పక్కదారి పడుతోంది. నేను బతకాలి నుంచి నేనే బతకాలి అన్నంత వరకు వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి దొరికినంత తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్న ఒక్క జీవితం అనుభవించడానికేనా? దొరికిందంతా మనమే అనుభవిస్తే.. వచ్చే తరానికి మిగిలేదేంటీ? అప్పటి నుంచి విప్లవం మన సైన్స్ లెక్కల ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల కింద పుట్టింది. సకల ప్రాణుల్లో ఒకరిగా మనిషి అనే రూపం కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపం– అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, 2 లక్షల ఏళ్ల కింద అవతరించింది. 6 వేల ఏళ్ల నుంచి నాగరికత మొదలయింది. ఎప్పుడయితే మనిషి నిప్పును కనుగొన్నాడో అప్పటి నుంచి విప్లవం వచ్చింది. 200 ఏళ్ల కింద పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ వచ్చింది. అంటే 450 కోట్ల పుడమిని అంతకు ముందెన్నడూ లేని రీతిలో 200 ఏళ్లలో మనిషి దెబ్బతీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ధాటికి సర్వం కాలుష్యం. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది.. ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వస్తువులను పుడమి నుంచి తయారు చేసుకుని వాటిని వ్యర్థాలుగా మార్చి మళ్లీ భూమిలో కలిపేస్తున్నారు. ఇంకెన్నాళ్లో ఉండదు ఒక్క భూమి మాత్రమేనా? ఇప్పటికే సముద్రాలన్నింటిలో చెత్త, రసాయనాలు నింపేసి విషపూరితంగా మార్చేస్తున్నాడు. పైగా అహంకారం ఒకటి. ఇంకొకడు వాడింది నేను ముట్టుకోనంతే అంటాడు. ఏంటో మరి. నాకన్నీ కొత్తవి, బ్రాండ్ న్యూ వస్తువులు కావాలంటున్నారు. ఇలా ఎవరికి వాళ్లు నచ్చినవన్నీ వాడేసుకుంటూ పోతే.. వ్యర్థాలన్నీ నింపుకుంటూ వెళ్తే.. ఈ భూమి ఇంకెన్నాళ్లో ఉండదు. అందుకే రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ చేయాలి? చెత్త కుప్పలు కాదు కొండలు లేని దేశంగా, పుడమిగా మారాలి. పర్యావరణాన్ని తద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవ్వాళ మీరు తీసుకునే జాగ్రత్తలు, వేసే చిన్న చిన్న అడుగులే అందమైన భవిష్యత్తుకు దారిస్తాయి, పుడమిని కాపాడతాయి. -శ్రీనాథ్ గొల్లపల్లి చదవండి: Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే? -
మీ ఆహారపు అలవాట్లు సరియైనవేనా...!
మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. మంచి ఇమ్యూనిటీ రావడం తప్పక జరుగుతుంది. అయితే ఒకవేళ మన ఆహారపు అలవాట్లు అంతగా బాగా లేవనుకోండి. వాటి ప్రతికూల ప్రభావాలు తక్షణం కనిపిస్తాయి. ఇటీవల మనలో చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే ఉబ్బుగా మారి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం చూస్తుంటాం. అది ఆహారపు అలవాట్లలో తేడా వల్ల చాలామందిలో కనిపించే తొలి లక్షణం. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మంచితో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుని, ఆ మేరకు మంచి ఆహారపు అలవాట్లును అనుసరించడం ఎందుకు అవసరమో తెలిపే కథనం ఇది. మనకు చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొందరు పొద్దున్నే లేచీ లేవగానే కాఫీ తాగేస్తారు. అదీ పరగడుపున. అలా చేస్తేగానీ వాళ్లల్లో కొన్ని జీవక్రియలు మొదలుకావు. అలా కాఫీ తాగందే పొద్దున్నే టాయెలెట్ వెళ్లాల్సిన ప్రక్రియ సజావుగా జరగదని చాలామంది అంటుంటారు. ఇదే సూత్రాన్ని కొందరు సిగరెట్ విషయంలో వల్లిస్తుంటారు. నిజానికి పొద్దున్నే పరగడుపున కాఫీ తాగడమే ఒక ఆహారపరమైన దురలవాటు అనుకుంటే.. సిగరెట్ అంతకంటే చెడు అలవాటు. కానీ ఈ రెండింటినీ అనుసరించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. సిగరెట్‌ను డైట్ (ఆహారపు) అలవాటుగా పరిగణించకపోయినా... అలవాట్ల గురించి చెప్పేందుకు అదో ఉదాహరణ. నిజానికి పొద్దున్న లేవగానే కాఫీ తాగడానికి బదులుగా మంచినీళ్లు తాగడం ఓ మంచి అలవాటు. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉండటం సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు మేలు చేసే కొన్ని మంచి ఆహారపు అలవాట్లును చూద్దాం. మంచి ఆహారపు అలవాట్లు ఇవి... పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకపోవడం : పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకపోవడం మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. పగటివేళ మనం పొద్దున్న లేచాక... కనీసం ఐదు లేదా ఆరు గంటలు వ్యవధిలో ఆహారం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి జీవక్రియలకు అవసరమైన ఇంధనం అందుతూ ఉంటుంది. కానీ... మనమందరం సగటున దాదాపు ఎనిమిది గంటల పాటు నిద్రపోతుంటాం. నిద్రకు ఉపక్రమించే ముందర కనీసం గంట ముందుగా భోజనం చేస్తామనుకుంటే.. అలాగే నిద్రలేచాక మరో గంట తర్వాత తింటామనుకుంటే... దాదాపు 10 గంటల పాటు జీర్ణవ్యవస్థకు ఆహారం అందదు. అందుకే మన దేహ అవసరాలకూ, జీవక్రియలకూ భోజనం అందించాల్సినందున ‘బ్రేక్‌ఫాస్ట్’ తప్పనిసరి. పైగా ఉదయం మన రోజుమొదలు కాగానే ఆరోజంతా కావాల్సిన శక్తి (ఎనర్జీ)కి ప్రధాన వనరు ‘బ్రేక్‌ఫాస్ట్’. కాబట్టి ఇతర ఏ పూట భోజనంతో పోల్చినప్పటికీ ‘బ్రేక్‌ఫాస్ట్’ మాత్రం తప్పక తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఓ సామెత కూడా ఉంది. ‘‘బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు’’ అని నానుడి. పోషకాలన్నీ లభ్యమయ్యే సమతుల ఆహారం : మన భోజనంలో ప్రధానంగా అన్ని రకాల పోషకాలు ఉండాలి. అంటే... తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, కణాలూ కణజాలాలలను రిపేర్ చేసి, వాటిని నిర్మించే ప్రోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతోపాటు, విటమిన్లు, మినరల్స్ (ఖనిజ లవణాలు... మళ్లీ ఇందులోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు)... ఇవన్నీ ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమపాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్డ్) అంటారు. ఇవన్నీ ఉండాలంటే మన భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ప్రోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతో పాటు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను సమకూర్చే తాజాపండ్లు తీసుకోవాలి. చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం : మనం తినే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. అంటే ఉదయపు ఉపాహారం(బ్రేక్ ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్), సాయంత్రపు పలహారం (ఈవినింగ్ శ్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం అన్నది జీర్ణవ్యవస్థపై భారం పడనివ్వదు. ఎప్పుడూ శరీరానికి అవసరమైన శక్తి క్రమబద్ధమైన రీతిలో అందుతుంది. కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు. చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని చేయవచ్చునని అనుకోవడం వల్లనో కొందరు రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినేవారిలో పొట్ట ఉబ్బరంగా ఉండటం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే ఎంతో అసౌకర్యమైన రీతిలో పొట్ట ఉబ్బిపోవడం, తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉందన్న భావన, ఛాతీలో మంట, కడుపులో అసౌకర్యమైన రీతిలో నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం చాలా సాధారణం. దీనితో పాటు ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం కూడా మంచి ఆహారపు అలవాట్లలో ఒకటి. నీళ్లు ఎక్కువగా తాగడం: మన శరీరంలోని 75 శాతం కేవలం నీటినే కలిగి ఉంటుంది. మనలోని ద్రవాలను కోల్పోవడం అన్నది ఒక్కోసారి ప్రాణానికే అపాయం. ఇలా జరగడాన్ని ‘డీ–హైడ్రేషన్’గా చెప్పవచ్చు. వేసవికాలంలో ఈ పరిణామం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అందుకే మనం ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగడం అవసరం. పైగా మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలు చేరడం అన్నది నీళ్లలో ఉండే లవణాల ద్వారానే సాధ్యం. ఇందుకోసమైన పుష్కలంగా నీళ్లు తాగుతుండటం అవసరం. చెడు ఆహారపు అలవాట్లివి... మంచి ఆహారపు అలవాట్లుగా పైన పేర్కొన్న వాటిని అనుసరించకపోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువ పరిమాణంలో తక్కువ తినడం, తాజాపండ్లు తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే దీనికి తోడు మరికొన్ని అంశాలు కూడా ఇటీవలి ఆధునిక జీవనశైలిలో మనకు అలవాడుతున్నాయి. ఉదాహరణకు... జంక్‌ఫుడ్ తినడం : మార్కెట్లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం అన్నది చెడు అలవాట్లలో ముఖ్యమైనది. వాటిల్లో ఉండే రిఫైన్డ్ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్‌ను పెంచడానికి వాడే కొన్ని అనారోగ్యకరమైన నూనెలు, ఆహారపదార్థాలను ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాడే కొన్ని రంగుల వల్ల ఇలాంటి జంక్‌ఫుడ్ కారణంగా అనేక క్యాన్సర్లు కూడా వస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. మితిమీరి తీపిపదార్థాలు తినడం : మనం తీసుకునే పదార్థాలలో తీపిని అందరూ ఇష్టపడతారు. ఐతే వీటిని మరీ మితిమీరి తినడం వల్ల నోటిలో నుంచే నష్టాలు మొదలవుతాయి. పళ్లు పాడైపోవడం, నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెరగడం వంటి నష్టాలు సంభవిస్తాయి. అంతేకాదు... క్యాన్సర్ కణాలకు తీపి పదార్థాలంటే చాలా మక్కువ. అందుకే మితిమీరి తీపిపదార్థాలు తినడం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఆహారాల్లో తీపి పదార్థాలను చాలా ఎక్కువగానూ / మరీ మితిమీరి గానీ తినడం సరికాదు. ఇక కొంతమంది తమ ఆహారపు అలవాట్లలో టీ, కాఫీలు మితిమీరి తాగుతుంటారు. ఇలా రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి, మితిమీరి కాఫీ, టీలు తాగడం తాగడం ఒక అనర్థమైతే... అందులో ఉండే తీపి వల్ల కూడా మన ఆరోగ్యానికి మరింత చేటు జరుగుతుంది. ఇక తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న తర్వాత అరగంట పాటు గానీ టీ తాగకూడదు. ఎందుకంటే దీనివల్ల మనం తిన్న ఆహారంలో ఉన్న ఐరన్ ఒంటికి పట్టదు. కూల్ బీవరేజెస్ : మనలో చాలామంది కోలా డ్రింకులు, శీతల పానియాలను తాగుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఇక రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులోని కెఫిన్ నిద్రాభంగం కలిగిస్తుంది. దీనివల్ల మళ్లీ అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక వీటిలోని చక్కెరల వల్ల... ముందుగా పేర్కొన్నట్లు మితిమీరిన తీపిపదార్థాల వల్ల కలిగే అనర్థాలన్నీ కలుగుతాయి. పైన పేర్కొన్న అలవాట్లలో మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకుని, చెడ్డవాటిని దూరం చేసుకుంటే చాలా కాలం ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆల్కహాలిజమ్ అతి పెద్ద చెడు అలవాటు ఆల్కహాల్ ఎలాగూ చాలా చాలా ప్రమాదకరమైన ఆహారపు అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్‌తో పాటు కోలా డ్రింకులు కలుపుకోవడం చేస్తుంటారు. ఈ రెండింటి దుష్ఫలితాలు కలిసి రెట్టింపుగా పరిణమిస్తాయి. ఆల్కహాల్ తాగిన సమయంలో వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వేపుళ్లు ఎలాగూ మంచి ఆహారపు అలవాటు కాదు. పైగా ఆల్కహాల్ వల్ల కడుపులోని లైనింగ్స్ దెబ్బతినడం మరో ప్రమాదం. దాంతో మళ్లీ అసిడిటీ, అల్సర్లు వస్తాయి. ఆల్కహాల్ లివర్‌ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే అస్తవ్యస్తం చేస్తుంది. అందుకే ఆల్కహాల్ అలవాటును పూర్తిగా వదిలేయాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ మెడిసిన్ స్పెషలిస్ట్ -
పిల్లలు విపరీతంగా బరువు పెరుగుతున్నారా?
ఇటీవల పిల్లలు జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. టీనేజ్‌లో ఉన్న సమయంలోనే పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లల్లో వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా గమనించాలి. ముందుగా వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. ►స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది ►వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు ►పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు ►తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది ►పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది ►పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. -
జంక్‌ఫుడ్ ఎందుకు తినకూడదంటే..?
టీనేజీ పిల్లల క్రేజ్ అంతా జంక్‌ఫుడ్డే. అలా నిలబడి త్వరత్వరగా తినడానికి అది అనువుగా ఉంటుంది. చేతికేమీ అంటకుండా ఫ్రెండ్స్ అంతా కలిసి తినేయడానికి వీలుగానూ ఉంటుంది. అందుకే టీనేజీ పిల్లలు వాటిని ఎగబడి తింటుంటారు. పిజ్జా, బర్గర్, పఫ్స్ వంటివాటికి ప్రాణం పెడుతుంటారు. కానీ వాటి గురించి టీనేజ్ పిల్లలకు కాస్త అవగాహన కల్పిస్తే వారు వీటికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆ వయసు లో వారిలో శారీరకంగా ఎదుగుదల కనిపిస్తుంది. మానసిక వికాసం చోటు చేసుకుంటూ ఉంటుంది. వారికి వ్యక్తిత్వ నిర్మాణమూ కొనసాగుతుంటుంది. వీటన్నింటినీ జంక్‌ఫుడ్ దెబ్బకొడుతుంది. జంక్‌ఫుడ్‌తో అనర్థాలివే... బేకరీ ఐటమ్స్, పిజ్జా, బర్గర్, బాగా పాలిష్ చేసిన ధాన్యాలతో తయారు చేసే పదార్థాలు వంటి జంక్‌ఫుడ్ ఎందుకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయో తెలుసుకుంటే, వాటి నుంచి దూరంగా ఎందుకుండాలో కూడా తెలుస్తుంది. ఫైబర్ చాలా తక్కువ : జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో పీచుపదార్థాల (ఫైబర్) భూమిక ఎంతో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, క్యాన్సర్‌ను నివారించడం, మలబద్దకాన్ని దూరం చేయడానికి పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. అయితే జంక్‌ఫుడ్‌లో మాత్రం ఆహారాన్ని పేగుల్లో సాఫీగా కదిలేలా చేసే పీచుపదార్థాలు చాలా తక్కువగా ఉంటుంది. ∙హానికారక ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ: జంక్‌ఫుడ్ చాలా కాలం పాటు నిల్వ ఉండటానికి వీలుగా వాటి తయారీకి హైడ్రోజెనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కాని వాటి వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ∙చెడు కొవ్వులూ ఎక్కువే : రుచి పెరగడానికి వాడే కొన్ని కొవ్వు పదార్థాల వల్ల... ఈ ఆహారం కారణంగా ఒంట్లో చాలా త్వరగా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పేరుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ ∙దీర్ఘకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉప్పు ఎక్కువగా వాడతారు. అది భవిష్యత్తులో హైపర్‌టెన్షన్ (హైబీపీ) వంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. -
జంక్‌ఫుడ్ తింటే నో.. ఉయ్యాల జంపాల!
జంక్‌ఫుడ్ తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. సాధారణంగా జంక్‌ఫుడ్ వల్ల తలెత్తే స్థూలకాయం, డయాబెటిస్ వంటి నానా సమస్యలకు ఆడా మగా తేడా లేదు. ఈ సమస్యలు జంక్‌ఫుడ్ తినే వారందరిలోనూ కనిపిస్తాయి. అయితే వారానికి నాలుగుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు జంక్‌ఫుడ్ తినే అలవాటు ఉన్న మహిళలకు గర్భందాల్చే అవకాశాలు చాలావరకు సన్నగిల్లిపోతాయని తాజా పరిశోధనలో తేలింది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆడిలాయిడ్కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్లారీ రాబర్ట్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన ఐదువేల మందికి పైగా గర్భిణుల ఆహారపు అలవాట్లపై కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని ప్రొఫెసర్ క్లారీ రాబర్ట్స్ నేతృత్వంలోని బృందం చెబుతోంది. చిరుతిండిగా పండ్లు, గింజలకు బదులుగా ఫాస్ట్‌ఫుడ్ తినే మహిళల్లో గర్భధారణ అవకాశాలు దాదాపు 16 శాతం మేరకు తగ్గుతాయని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఎండిన పొట్టలు.. బాగా నిండిన పొట్టలు!
ఒక పొట్ట.. రెండు సమస్యలు.. ఒక దేశం.. రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులు.. ఓవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.. అదే సమయంలో అధిక బరువుతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. జంక్‌ఫుడ్ అనేసరికి అమెరికన్లు వాళ్లు ఎక్కువగా తింటారు.. అందుకే వారంతా లావుగా ఉంటారు.. అని అనుకుంటుంటాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే మన దేశంలో ఊబకాయంతో బాధపడే చిన్నారుల సంఖ్య అమెరికాను దాటిపోయిందట. ఈ జాబితాలో చైనా తొలిస్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. లాన్సెట్ జర్నల్ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 1975–2016 మధ్య 200 దేశాల్లో బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) ట్రెండ్స్‌పై ఈ సర్వే నిర్వహించారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఊబకాయంతో బాధపడే బాలికల సంఖ్య గత 40 ఏళ్ల కాలంలో 50 లక్షల నుంచి 5 కోట్లకు పెరిగింది. ఇదే వయసు కలిగిన బాలుర సంఖ్య 60 లక్షల నుంచి 7.4 కోట్లకు చేరింది. ఇక పోషకాహారలోపాన్ని ఊబకాయంతో పోల్చి చూస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు పోషకాహారలోపం.. ఇటు ఊబకాయం దేశంపై దాదాపు సమానస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్య గత పదేళ్లలో మూడింట ఒక వంతు శాతం తగ్గినా.. ఇప్పటికీ దేశంలో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్న, వయసుకు తగ్గ ఎత్తు లేని, పోషకాహార లోపం కలిగిన చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏ ఇతర దేశాలతో పోల్చి చూసినా ఈ సంఖ్య ఎక్కువే. అయితే, నిరుపేద ఆఫ్రికా దేశాల కంటే ఈ విషయంలో భారత్ వెనకబడి ఉండటానికి అధిక జనాభానే కారణం. మనకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కూడా ప్రజలకు ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ విషయంలో మనం వెనుకబడి ఉండటం గమనార్హం. దేశంలో ఊబకాయం కలిగి ఉన్న వారి సంఖ్య ఎక్కువున్న జిల్లాలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. పోషకాహారలోపం ఉన్నవారు ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య మధ్య భారతంలో అధికం. ఒబేసిటీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంటే.. పోషకాహారలోపం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. -
సన్నగా ఉన్నా జంక్‌ఫుడ్‌తో రిస్కే!
జంక్‌ఫుడ్‌తో లావెక్కిపోతారనేది కొంత నిజమే! బొద్దుగా ఉన్నవాళ్లు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని చాలామంది సలహా ఇస్తుంటారు. అలాగని ఏం తిన్నా సన్నగా ఉండేవాళ్లు జంక్‌ఫుడ్ తింటే ఫర్వాలేదనుకుంటే అదంతా ఉత్త భ్రమేనని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జంక్‌ఫుడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్య స్థూలకాయం ఒక్కటే కాదని, దాంతో నానా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. జంక్‌ఫుడ్‌తో డయాబెటిస్, హైబీపీలు మాత్రమే కాకుండా, క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లావుగా లేమనే ధీమాతో ఎడాపెడా జంక్‌ఫుడ్ తింటూ పోయేవారికి ఇతరులతో పోలిస్తే క్యాన్సర్ సోకే అవకాశాలు దాదాపు పది శాతం ఎక్కువగా ఉంటాయని అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. జంక్‌ఫుడ్ తినేవారిలో ముఖ్యంగా జీర్ణాశయానికి, పేగులకు, కిడ్నీలకు, పాంక్రియాస్‌కు, రొమ్ములకు, గర్భాశయానికి క్యాన్సర్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.