సన్నగా ఉన్నా జంక్‌ఫుడ్‌తో రిస్కే!
జంక్‌ఫుడ్‌తో లావెక్కిపోతారనేది కొంత నిజమే! బొద్దుగా ఉన్నవాళ్లు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని చాలామంది సలహా ఇస్తుంటారు. అలాగని ఏం తిన్నా సన్నగా ఉండేవాళ్లు జంక్‌ఫుడ్ తింటే ఫర్వాలేదనుకుంటే అదంతా ఉత్త భ్రమేనని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జంక్‌ఫుడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్య స్థూలకాయం ఒక్కటే కాదని, దాంతో నానా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
జంక్‌ఫుడ్‌తో డయాబెటిస్, హైబీపీలు మాత్రమే కాకుండా, క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లావుగా లేమనే ధీమాతో ఎడాపెడా జంక్‌ఫుడ్ తింటూ పోయేవారికి ఇతరులతో పోలిస్తే క్యాన్సర్ సోకే అవకాశాలు దాదాపు పది శాతం ఎక్కువగా ఉంటాయని అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. జంక్‌ఫుడ్ తినేవారిలో ముఖ్యంగా జీర్ణాశయానికి, పేగులకు, కిడ్నీలకు, పాంక్రియాస్‌కు, రొమ్ములకు, గర్భాశయానికి క్యాన్సర్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.