
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు పామర్తి శంకర్‌ను కార్టూనిస్టు కంబాలపల్లి శేఖర్ స్మారక అవార్డు వరించింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కూడిన నలుగురు సభ్యుల జ్యూరీ బృందం శంకర్‌ను 2018కి గాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. త్వరలో ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డు ప్రదానం చేయనున్నారు. 20 ఏళ్లుగా శంకర్ పలు దినపత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. కార్టూన్లకు ఆస్కార్ అనదగ్గ వరల్డ్ ప్రెస్ గ్రాండ్ ఫిక్స్ అవార్డుతో పాటు అనేక ఇతర అవార్డులను ఆయన అందుకున్నారు.
సామాన్యుడి పక్షం వహించి మతోన్మాదం, అవినీతి, నీచ రాజకీయాలు, సామాజిక వివక్ష, అసమానత, ఆర్థిక సంస్కరణలపై కలం కుంచెతో జీవితాంతం పోరాటం చేసిన చరిత్ర కార్టూనిస్టు శేఖర్‌ది. ఆయన పేరిట నవ తెలంగాణ దినపత్రిక స్మారక అవార్డును 2016లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ఎంపిక జ్యూరీ కమిటీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్, తెలంగాణ టుడే ఎడిటర్ కె. శ్రీనివాస్‌రెడ్డి, ది హిందూ కార్టూనిస్టు సురేంద్రలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment