పదో తరగతి తర్వాత.. | After Tenth Class...?? | Sakshi
Sakshi News home page

పదో తరగతి తర్వాత..

Published Sun, Jun 19 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

పదో తరగతి తర్వాత..

పదో తరగతి తర్వాత..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేస్తున్నారు. తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఏ గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలి? ఆయా గ్రూప్‌లు/కోర్సులతో ఎలాంటి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఉంటాయి? ఆయా కోర్సులు ఎంచుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? పదో తరగతి, ఇంటర్మీడియెట్‌తో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలేవి? స్వయం ఉపాధి దిశగా అవకాశాలున్నాయా? దూరవిద్య విధానంలో కోర్సులు అభ్యసించొచ్చా?

ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై విద్యార్థులకొచ్చే సందేహాలకు నిపుణుల సమాధానాలు..

 

ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూప్‌ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి?
బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అంటే.. ఎంబీబీఎస్‌లో చేరడానికి మాత్రమే అనే అభిప్రాయముంది. కానీ బైపీసీతో ఎంబీబీఎస్‌తోపాటు అనేక అవకాశాలు అందుకోవచ్చు. పరిశోధనల పట్ల ఆసక్తి, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులపై ఇష్టం, ప్రకృతి పరిశీలన, జంతువులు.. వాటి జీవన శైలి వంటి వాటిపై సహజమైన ఆసక్తి ఉన్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ. వీటన్నిటికంటే ముఖ్యంగా బైపీసీ ఎంచుకునే విద్యార్థికి కావాల్సిన లక్షణం కష్టించే తత్వం. కారణం.. బైపీసీ సబ్జెక్ట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉండే గ్రూప్ కూడా ఇదే. కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత సైతం అవసరం.
 
నేను పదో తరగతి పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి?
మ్యాథ్స్‌పై ఆసక్తి, సమస్యలు-పరిష్కారాలు-వివరణలు ఇవ్వడం, భౌతిక, రసాయన శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రయోగాలంటే ఇష్టపడేవారు మ్యాథ్‌‌స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ గ్రూప్)ను ఎంపిక చేసుకోవచ్చు. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న గ్రూప్.. ఎంపీసీ. ఆయా సబ్జెక్టుల్లో ఎప్పటికప్పడు పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. నిరంతర అధ్యయనం, కొత్త టెక్నాలజీలను అవగాహన చేసుకోవడం, వాటిలో నైపుణ్యం సాధించడం అనే సహజ లక్షణాలు ఎంపీసీ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు చాలా అవసరం.

ఎంపీసీలో ప్రథమ భాషగా తెలుగు లేదా సంస్కృతం, ద్వితీయ భాషగా ఇంగ్లిష్, గ్రూప్ సబ్జెక్టులుగా.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉంటాయి. ఎంపీసీ అంటే.. కేవలం ఇంజనీరింగ్‌లో చేరడం కోసమే అనే అభిప్రాయంతో ఈ గ్రూప్‌ను ఎంచుకుంటారు. కానీ ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సైన్స్ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి కోర్సులు చేయొచ్చు.
 
ఇంటర్మీడియెట్‌లో సీఈసీ గ్రూప్‌ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి?

సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాలపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్‌‌స (సీఈసీ). ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కామర్స్‌లో నైపుణ్యాలు పొందిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన గ్రూప్.. సీఈసీ.

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించేందుకు సీఈసీ ఎంతో అనుకూలమైన గ్రూప్. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో ఒక్కోసారి గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సహనం కోల్పోకుండా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా జరిగే చట్టాల్లో మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం కావాలి.

సీఈసీ తర్వాత చాలామంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ-కామర్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఆనర్స్ తదితర). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు.
 
ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూప్‌ను ఎంచుకోవాలంటే ఏయే స్కిల్స్ ఉండాలి?
ఇటీవల కాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పొందుతున్న గ్రూప్.. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ (ఎంఈసీ). అటు మ్యాథ్స్.. ఇటు కామర్స్.. రెండిటిని ఇష్టపడేవారికి చక్కటి గ్రూప్.. ఎంఈసీ. లెక్కలు, వ్యాపారం, గణాంకాలు, ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి అపార అవకాశాలందిస్తున్న ఈ కోర్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణలతో విస్తృత ఉద్యోగావకాశాలను ఈ గ్రూప్ ద్వారా సాధించవచ్చు. మ్యాథ్స్ అంటే ఆసక్తి, ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య శాస్త్రం పట్ల మక్కువ ఉన్నవారు ఎంఈసీని ఎంపిక చేసుకోవచ్చు.
 
ఇంటర్మీడియెట్‌లో హెచ్‌ఈసీ గ్రూప్‌ను ఎంపిక చేసుకునేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?
‘ఏ గ్రూప్‌లో సీటు రాకపోతే హెచ్‌ఈసీలో చేరతారు’.. ఇది సాధారణఅభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని తిరగ రాయాల్సిందే. ఎందుకంటే.. ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్‌ఈసీ).. సుస్థిర భవిష్యత్తుకు పునాది అని చెప్పొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల ద్వారా సివిల్స్ మొదలు గ్రూప్-4 వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు.. మేలు చేసే గ్రూప్ హెచ్‌ఈసీ. ఈ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రైటింగ్ స్కిల్స్, నిరంతర అధ్యయనం.

విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టి. సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకునే నైపుణ్యం. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్‌ఈసీ తర్వాత అవకాశాలు అనేకం. ఒకప్పుడు హెచ్‌ఈసీ తర్వాత బీఏలో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్, లిబరల్ ఆర్ట్స్ తదితర) అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌ఈసీతో (ఇంటర్మీడియెట్) ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ(ఎంఏ)లో ప్రవేశించొచ్చు.
 
ఐటీఐలో చేరడానికి అర్హత ఏమిటి? ఎంపిక ఎలా ఉంటుందో తెలియజేయండి?
పదో తరగతి తర్వాత తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే ఉద్యోగం/స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మార్గం.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ). ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో వివిధ నైపుణ్యాలు సొంతమవుతారుు. దాంతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఐటీఐ కోర్సులను పూర్తిచేసిన వారికి నేడు ఉపాధికి ఢోకాలేదు. వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ వంటి కోర్సులతోపాటు తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశాలపై ఐటీఐలు దృష్టిసారించారుు. పదో తరగతి మార్కుల ఆధారంగా వీటిలో చేరొచ్చు. జూలై/ఆగస్టుల్లో ప్రవేశాలుంటాయి.
 
ఐటీఐలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
ఐటీఐల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టెలివిజన్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్‌ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) తదితర కోర్సులు ఉన్నాయి.
 
నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్: స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్‌మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోసర్, కార్పెట్ వేవింగ్. ఈ కోర్సులే కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్/కంపెనీల అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులు, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఐటీఐలు అందిస్తున్నాయి.
 
పదో తరగతి పూర్తి చేశాను. స్వయం ఉపాధి దిశగా స్థిరపడాలంటే స్వల్పకాలిక శిక్షణ కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలపండి?
సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ టిన్‌స్విటీస్ (సెట్విన్).. యువతకు స్వయం ఉపాధి కోర్సులను అందిస్తోంది. ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎయిర్‌లైన్ టికెటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామ్, ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్, టైప్ రైటింగ్, టెలిఫోన్ ఆపరేటర్, కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులను సెట్విన్ ఆఫర్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెట్విన్ కేంద్రాలు ఉన్నాయి.

సెట్విన్ మాత్రమే కాకుండా స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్-భూదాన్ పోచంపల్లి(నల్గొండ జిల్లా), మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ)- హైదరాబాద్ వంటి సంస్థలు అటు స్వయం ఉపాధిని, ఇటు ఏదైనా ఉద్యోగాన్ని పొందేలా వివిధ కోర్సులందిస్తున్నాయి. వీటిల్లో ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి హోటల్ మేనేజ్‌మెంట్, బ్యూటీషియన్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎయిర్‌లైన్ టికెటింగ్, కాల్‌సెంటర్ ట్రైనింగ్, గోల్డ్ పాలిషింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి కోర్సును బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది.
 
పాలిటెక్నిక్ కోర్సులతో ప్రయోజనాలేమిటి? ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ రాయాలి. ఇందులో ర్యాంకు ద్వారా మూడేళ్లు/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో డిప్లొమా చేయొచ్చు. డిప్లొమా ఉత్తీర్ణులు ఈసెట్ ద్వారా బీటెక్‌లో రెండో సంవత్సరంలో ప్రవేశించొచ్చు. డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీ సూపర్‌వైజర్లుగా నియమించుకుంటున్నాయి.
 
అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సుల గురించి తెలపండి?
పదో తరగతి ఉత్తీర్ణతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పి.వి.నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సులు అందిస్తున్నాయి.

అగ్రి పాలిటెక్నిక్‌లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. హార్టికల్చర్‌లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వెటర్నరీ పాలిటెక్నిక్‌లో భాగంగా డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ, డిప్లొమా ఇన్ ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులున్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. దరఖాస్తుకు సమయం ఉంది. మరిన్ని వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్స్ చూడొచ్చు.
 
పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు తెలపండి?
సెంట్రల్ ఆర్‌‌మడ్ పోలీస్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్స్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్‌‌స  (సీఐఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ),  ఎస్‌ఎస్‌ఎఫ్, సెంట్రల్ రిజర్‌‌వ పోలీస్ ఫోర్‌‌స (సీఆర్‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్‌‌స (బీఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్‌‌స (ఐటీబీపీ)లలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మెన్‌‌స
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజుర్‌మెంట్స్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టె స్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం: వంద మార్కులకు నిర్వహించే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ ఇంటెలిజెన్‌‌స అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్‌‌జ అండ్ జనరల్ ఎవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లేదా హిందీలో నాలుగు విభాగాల నుంచి 25 మార్కుల చొప్పున 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు.
వెబ్‌సైట్స్: www.cisf.gov.in, www.ssb.nic.in, www.nia.gov.in, www.http://bsf.nic.in, http://crpf.nic.in, http://itbpolice.nic.in, www.assamrifles.gov.in
 
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు
ప్రకటన: రైల్వే ఉద్యోగాల భర్తీకి ఏడాదిలో చాలాసార్లు ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. ఈ మధ్య వివిధ రైల్వే జోన్లు ఖాళీలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాయి. ప్రకటనలు ఠీఠీఠీ.టటఛిఛ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో లేదా ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో చూడొచ్చు.

డిఫెన్స్ జాబ్స్..
ఇండియన్ నేవీలో..
పోస్టులు: మెట్రిక్ రిక్రూట్-స్టివార్డ్/కుక్స్; మ్యుజీషియన్లు.
వయోపరిమితి: 17-21 ఏళ్లు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
 
ఇండియన్ ఆర్మీలో..
పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ
అర్హత: 45 శాతం మార్కులతో దో తరగతి.
వయోపరిమితి: 171/2న్నర నుంచి 21 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, హదారుఢ్య, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా.
వెబ్‌సైట్: http://indianarmy.nic.in
 
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో..
పోస్టు: ఎయిర్‌మెన్ గ్రూప్-వై మ్యుజీషియన్ ట్రేడ్
అర్హత: పదోతరగతిలో 45 శాతం మార్కులు.
వయసు: 17 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా. సంబంధిత సంగీత పరికరంలో ప్రావీణ్యం ఉండాలి.
వెబ్‌సైట్: http://careerairforce.nic.in

ఏపీఎస్‌ఆర్‌టీసీ/టీఎస్‌ఆర్‌టీసీలో..
పోస్టు: బస్ కండక్టర్
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా..
పోస్టు: బస్ డ్రైవర్
ఇతర అర్హతలు: హెవీ మోటార్ వెహికల్ పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు నిర్దేశిత అనుభవం తప్పనిసరి.

ఆసక్తికి అనుగుణంగా ఇంటర్‌లో ఏ గ్రూపులో చేరినప్పటికీ, మొదట్నుంచి అకడమిక్‌గా ముందుండటానికి ప్రయత్నించాలి. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆయా ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో ఒక కారణం చెప్పి, సబ్జెక్టుల అధ్యయనాన్ని వాయిదా వేసే ధోరణి సగటు విద్యార్థిలో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఏ రోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేయాలి. తమ గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాల అప్లికేషన్స్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం ముఖ్యం. కాలేజీ సమయాన్ని మినహాయించి, రోజుకు 4-5 గంటలు కష్టపడి చదివినప్పుడే లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుంది.
- ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీచైతన్య విద్యాసంస్థలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement