
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను ఇంటర్ నుంచి పదవ తరగతికి ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు కనీస విద్యార్హతగా మైదాన ప్రాంతంలో ఇంటర్, గిరిజన ప్రాంతంలో పదవ తరగతిగా ఉంది. అప్పట్లో మొత్తం 1,92,964 మంది గ్రామ వలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1,83,290 మంది విధులలో చేరారు. మిగిలిన 9,674 పోస్టులను మైదాన, గిరిజన ప్రాంతం రెండింటిలోనూ పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయడానికి అనుమతి తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖాళీల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా నవంబర్ 1న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా నవంబర్ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 20 మధ్య మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 22వ తేదీ కల్లా సమాచారమిచ్చి, వారికి 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లోకి చేరాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment