ఏలూరు సిటీ :పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఁపరీక్షా*కాలం మొదలైంది. పరీక్షలు సమీపిస్తుండడంతో ఉత్తమ ఫలితాలు సాధనకు విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ప్రత్యేక దృష్టి సారించగా పిల్లలు ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. జిల్లాలో సుమారు 1,20,529 మంది టెన్‌త, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 2016 జనవరి 1 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 80 రోజులు సమయం ఉంటే, ఇంటర్‌కు అతితక్కువ సమయం ఉంది. ఫిబ్రవరి 4 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 2 నుంచి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో పశ్చిమ విద్య కుసుమాలు వికసించటంతో ఈ సారి అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే సత్తా చాటాలని విద్యాధికారులు గట్టి ప్రణాళికలు రూపొందించారు.
పదిలో ఒకటికి ప్రయత్నం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత విద్యా సంవత్సరంలో 52160మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయగా 95.15 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో పశ్చిమ 3వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 51009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 49262 మంది, 1747 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. బాలురు 24465 మంది, బాలికలు 24797 మంది రెగ్యులర్‌లో, ప్రైవేటు అభ్యర్థులుగా 1109 మంది బాలురు, 638 మంది బాలికలు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇక ఇంటర్‌లోనూ ఉత్తమ ఫలితాల సాధనకు ఇంటర్ విద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇంటర్ ఫలితాల్లో జిల్లా గత ఏడాది 4వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 69520 మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం 35910 మంది, ద్వితీయ సంవత్సరం 33610 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు.
గత ఏడాది 103 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ఈసారి
107 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది.
విజయానికి పక్కా ప్లాన్
టెన్త్‌లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తున్నాం. అష్టాంగ మార్గాలు, బడిలో బస, విద్యార్థులను దత్తత తీసుకుని వారిని పాస్ అయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వటం వంటి ఏర్పాట్లు చేశాం. పశ్చిమ ఆణి ముత్యాలు, వజ్రాలు, బంగారాలు, ఆశాజ్యోతులుగా విభజించి శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో 8 వేల మంది ఆశాజ్యోతులు ఉన్నట్టు గుర్తించి వారిపై దృష్టి సారించాం. సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థుల కోసం సబ్జెక్టు నిపుణులతో కూడిన మార్గదర్శక బృందాలు 48 ఏర్పాటు చేశాం. ఉదయం, సాయంత్రం గంటపాటు అదనపు తరగతులు నిర్వహించటం చేస్తున్నాం. జనవరి 2 నుంచి జిల్లాలో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తాం.
- డి.మధుసూదనరావు, డీఈవో
పరీక్షలొచ్చేస్తున్నాయ్..
Published Thu, Dec 31 2015 12:50 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement