క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు కీలకం.. ఇంటర్న్‌షిప్స్ | Engineering Special-Internships | Sakshi
Sakshi News home page

క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు కీలకం.. ఇంటర్న్‌షిప్స్

Published Thu, Dec 5 2013 4:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Engineering Special-Internships

ఎం.చంద్రశేఖర్,

ప్రొఫెసర్,

ఎన్ఐటీ-వరంగల్

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి డిగ్రీలతో బయటికి వస్తున్న విద్యార్థులు జాబ్ రెడీగా ఉండాలని పరిశ్రమలు ఆశిస్తున్నాయి. పుస్తకావగాహన కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్ద పీట వేస్తున్నాయి.. అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విషయంలో ఏమేరకు సామర్థ్యం కలిగి ఉన్నారు? అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి.. పని చేయాల్సిన రంగంపై కనీస అవగాహన ఉండాలని భావిస్తున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థికి ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్ ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.. విద్యార్థుల్లో ఈ విధమైన ప్రాక్టీకల్ అప్రోచ్ పెంపొందించుకోవడానికి, క్షేత్ర స్థారుు

 అవగాహనకు ఇంటర్న్‌షిప్స్ ఎంతో తోడ్పాటునందిస్తాయి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్

 విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రాముఖ్యత, సంబంధిత అంశాలపై సూచనలు..

 

 ఇంజనీరింగ్ విద్యార్థులు థియరీ కంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి కెరీర్ సరైన దిశలో సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు కూడా ఈ విషయానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచే కార్యకలాపాలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్‌షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్, టెక్నికల్ కాంపిటీషన్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి ఈ కోవలోకి వస్తాయి.

 

 మూడో సంవత్సరంలో:

 సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సులో మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ (ఇండస్ట్రీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్) ఉంటుంది. కొన్ని యుూనివర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్ కరిక్యులంలో ఇంటర్న్‌షిప్ భాగంగా లేనప్పటికీ ప్రొఫెషనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడంలో ఇంటర్న్‌షిప్స్‌ను వినియోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లు సాధారణంగా రెండు విధాలుగా అందుబాటులో ఉంటాయి. అవి.. అకడమిక్‌గా తప్పనిసరిగా చేయాల్సినవి. కొన్ని కంపెనీలు ఆఫర్ చేసే సమ్మర్ ఇంటర్న్‌షిప్స్.

 

 సమ్మర్ ఇంటర్న్‌షిప్స్:

 ఇంటర్న్‌షిప్స్‌లో కీలకమైనవి.. సమ్మర్ ఇంటర్న్‌షిప్స్. పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ ఒక ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడతాయి. వీటిని వేసవి సెలవుల్లో నిర్వహిస్తారు. సాధారణంగా వీటి వ్యవధి ఐదు నుంచి పది వారాల పాటు ఉంటుంది. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా.. ఇటువంటి ఇంటర్న్‌షిప్స్ ద్వారా విలువైన పని అనుభవాన్ని (వర్క్‌ఎక్స్‌పీరియెన్స్) పొందొచ్చు. సమ్మర్ ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థులకు రెండు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. అవి.. ఒకటి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. రెండోది, చదువుతున్న బ్రాంచ్‌కు సంబంధించి మార్కెట్లోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందడం. ఒక్కోసారి కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు అలవెన్స్‌ను కూడా చెల్లిస్తున్నాయి. మల్టినేషనల్ కంపెనీల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ప్రపంచ స్థాయి కంపెనీల పని వాతావరణం, వర్కింగ్ మెథడాలజీపై ఒక అవగాహన ఏర్పడుతుంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులకు మిగతా విద్యార్థులతో పోల్చితే కెరీర్ పరంగా చక్కని అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.

 

 ఇంటర్న్ టు జాబ్:

 ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాన్ని ఆఫర్ చేసేందుకు కూడా వెనకాడటం (కోర్సు పూర్తయిన తర్వాత) లేదు. ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ను ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ (పీపీఓ) రూపంలో అందిస్తున్నాయి. అంతేకాకుండా విద్యార్థి భావి కెరీర్ దిశగా.. కీలకమైన వర్క్ ఎన్విరాన్‌మెంట్‌పై అవగాహన పొందొచ్చు. బృందంగా పని చేయడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ మ్యాన్, పరిశోధన ఆధారంగా పని చేయడం (రీసెర్చ్ బేస్డ్ వర్క్) వంటి నైపుణ్యాలు అలవడతాయి. సంబంధిత రంగంలోని అనుభవజ్ఞుల ద్వారా.. ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశంపై విలువైన సూచనలను పొందొచ్చు.

 

 ఆసక్తి ఆధారంగా:

 చదువుతున్న బ్రాంచ్, ఎంచుకున్న పరిశ్రమను బట్టి

 ఇంటర్న్‌షిప్స్ వేర్వేరుగా ఉంటాయి. లోతైన స్వీయ విశ్లేషణ, పక్కా ప్రణాళిక ద్వారానే విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయుడం సాధ్యమవుతుంది. ఇంటర్న్‌షిప్ అంశం ఎంపికకు ముందే అన్ని కోణాల్లో విశ్లేషించాలి. ఆసక్తి ఉన్న అంశాన్ని (ఏరియాను) ఇంటర్న్‌షిప్ కోసం ఎంచుకోవాలి. ఇంటర్న్‌షిప్ ఉద్దేశాలను, ప్రతిఫలాలను తప్పకుండా బేరీజు వేసుకోవాలి. భవిష్యత్‌లో సంభవించే మార్పులను దృష్టిలో ఉంచుకుని సీనియర్లు, ప్రొఫెసర్ల సహాయంతో ఇంటర్న్‌షిప్ అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్‌లోని అన్ని విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

 

 ప్రొఫెషనల్ స్కిల్స్:

 ఇంటర్న్‌గా ఎంపికైన వారు సంబంధిత పరిశ్రమలో వారానికి నిర్దేశించిన గంటలు పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సముహం (గ్రూప్)గా లేదా వ్యక్తిగతంగా ఇంటర్న్‌షిప్‌ను చేపడతారు. భావన (కాన్సెప్ట్) చిన్నదైనా.. ఇంటర్న్‌షిప్ అనుభవం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఉండే రెండు/మూడు నెలలు విద్యార్థి ఆలోచన విధానంలో ఎంతో మార్పు తెస్తుందని చెప్పొచ్చు. విద్యార్థిగా కాకుండా ఒక ప్రొఫెషనల్‌గా వ్యవహరించే తత్వం అలవడుతుంది. పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న పద్ధతులను దగ్గరగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులోని భావనలను పరిశ్రమలో అన్వయించే విధానాన్ని నేరుగా చూడడం ద్వారా కోర్సులోని సదరు అంశాలపై పట్టు వస్తుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఇంటర్న్స్‌కు కూడా వాస్తవ పనులను అప్పగిస్తాయి. దాంతో అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థారుులో అన్వయించే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. తద్వారా విద్యార్థి పరిశ్రమ కోరుకుంటున్న విధంగా జాబ్ రెడీగా ఉంటాడు. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ విద్యార్థి ఉద్యోగ సాధనలోనూ తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌ను ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్‌గా కూడా పేర్కొనవచ్చు. ఇంటర్న్‌షిప్‌లో చక్కని ప్రతిభ చూపిన విద్యార్థులకు అకడమిక్ పరంగా ఉండే ప్రాజెక్ట్ వర్క్‌ను రియల్ టైమ్‌లో తమ కంపెనీలో చేసే అవకాశాన్ని కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి.

 

 ఎంపిక ఇలా:

 ఇంటర్న్‌షిప్ చేయాలనుకున్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంటర్న్‌షిప్ చేయాల్సిన సంస్థ ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించాలి. కెరీర్ మీట్స్, జాబ్ మేళావంటి కార్యక్రమాలకు హాజరవుతుండడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇంటర్న్‌షిప్ బ్లాగులను చూడడం, యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి కేంద్రాలను సందర్శించడం ద్వారా ఇంటర్న్‌షిప్స్ అవకాశాలను సులభంగా పొందొ చ్చు. ఇంటర్నెట్‌లో పలు వెబ్‌సైట్లు ఇంటర్న్‌షిప్ గురించిన విస్తృత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లేదా కాలేజీల్లోని ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసే కంపెనీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా సంబంధించిన పరిశ్రమల అధికారులను కలవడం ద్వారా కూడా ఇంటర్న్‌షిప్‌ను దక్కించుకోవచ్చు.

 

 కీలకం రెజ్యుమె:

 ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని దక్కించుకోవడంలో రెజ్యుమె పాత్ర కీలకం. విద్యార్థులు తమ గురించి సమగ్రంగా వివరించడానికి రెజ్యుమె నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కాబట్టి రెజ్యుమెను పకడ్బందీగా రూపొందించాలి. రెజ్యుమెలో ఎంచుకున్న రంగంపై ఉన్న ఆసక్తి, అవగాహన, భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం చేసే విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యక్తిత్వం, విద్యా ప్రవృత్తులు, ఉద్యోగ సంబంధిత సామర్థ్యాలను ప్రస్ఫుటించేలా రూపొందించుకోవాలి. ఎంప్లాయర్స్ అవసరాలు, ప్రాధాన్యతలను కూడా రెజ్యుమెలో పొందుపర్చడం మర్చిపోవద్దు. సాధారణంగా కంపెనీలు ఇంటర్న్‌షిప్స్ కోసం నిర్దిష్ట గడువును నిర్ణయిస్తాయి. కాబట్టి వీలైనంత ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు.

 

 వనరుగా:

 ఇంటర్న్‌షిప్ చేశాక,దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వన రుగా ఉపయోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో మీరు నిర్వహించిన బాధ్యతలను, ప్రాజెక్టు విజయంలో దాని పాత్రను మీ రెజ్యుమెలో పేర్కొనాలి. కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్న్‌షిప్‌లో నిర్వర్తించిన విధులను వివరించడం ద్వారా కొలువును సులువుగా సొంతం చేసుకోవచ్చు. నిపుణులైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్న్‌షిప్‌ను కంపెనీలు చక్కని వేదికగా భావిస్తున్నారుు. ఇంటర్న్‌షిప్‌నకు అకడమిక్ పరంగా కొన్ని మార్కులను కూడా కేటాయించడం జరిగింది.

 

 ప్రాముఖ్యత

 కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు.

      .............................

 అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం

 సంపాదిస్తారు.

      ............................................................

 అకడమిక్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.

      ............................................................

 ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తూ కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.

      ............................................................

 బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవర్చుకోవడానికి ఇంటర్న్‌షిప్ వేదికగా నిలుస్తుంది.

      ............................................................

 ఉద్యోగానికి ముందే తమ రంగానికి చెందిన పరిశ్రమలో వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం లభిస్తుంది.

      ...............................................

 

 

 బ్రాంచ్‌ల వారీగా ఇంటర్న్‌షిప్ కోసం

 ఎంచుకోవాల్సిన కంపెనీలు..

 మెకానికల్-ఎల్ అండ్ టీ, ఎస్‌ఆర్ స్టీల్స్, వైజాగ్ స్టీల్స్,

 బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్ మొదలైనవి.

 సివిల్ -ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు తదితరాలు.

 ఎలక్ట్రికల్- ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీ, వీటీపీఎస్, సాగర్,

 పవర్ జనరేషన్ యూనిట్స్ మొదలైనవి.

 ఈసీఈ-బీడీఎల్, హెచ్‌ఏఎల్, ఇస్రో తదితరాలు.

 సీఎస్‌ఈ-టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ తదితరాలు.

 

 తప్పనిసరి.. ఏఐసీటీఈ

 దేశంలో సాంకేతిక విద్యను పర్యవేక్షిస్తున్న ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్‌హన్‌‌సమెంట్ మిషన్ (ఎన్‌ఈఈఎం-ూఉఉక)లో భాగంగా ఏఐసీటీఈ ఈ ప్రతిపాదన చే సింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఐదు, ఆరు, ఏడో సెమిస్టర్లలో మూడు నుంచి 24 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ సంస్థలతో ఏఐసీటీఈ ఒక అవగాహన కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు కమ్యూనికేషన్స్ సంబంధింత విభాగంలో శిక్షణనిచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం చేసుకుంది.

 

 ఉపయోగకరమైన వెబ్‌సైట్స్

 www.internshala.com

 www.twenty19.com

 www.hellointern.com

 www.letsintern.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement