కొన్ని జంతువుల పాలు పసుపు రంగులో ఎందుకుంటాయి?
స్కూల్ ఎడ్యుకేషన్
గేదె పాలు తెల్లగా ఉండటాన్ని, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు కదా! ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండటానికి, మరికొన్ని జంతువుల పాలు తెల్లగా లేకపోవడానికి చాలా ముఖ్య కారణమే ఉంది. ఆవు పాలలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ పాలకు లేత పసుపు రంగు వస్తుంది. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి.
చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవుపాలు మంచివని చెప్పడానికి.. వాటిలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా, ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం కావడమే కాకుండా వాటిలోని బీటా కెరోటిన్ ‘ఎ’ విటమిన్‌గా మార్పు చెంది చిన్నారులకు బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తిలో ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో తేడాలు ఉంటాయి.