గిరగిరా తిరిగితే ఎందుకు పడిపోతాం?
స్కూల్ ఎడ్యుకేషన్
నేలపై నిలబడి మన కాళ్లమీద వృత్తాకారంలో గిరగిరా తిరిగినప్పుడు, లేదా మన తలను వృత్తాకారంలో తిప్పినప్పుడు ఆ పని చేస్తున్నంతసేపూ మనకు ఏమీ అనిపించనప్పటికీ, ఆపిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయినట్లుగా ఉంటుంది. మనం సరిగ్గా నిలబడలేక వెంటనే కూర్చుండిపోతాం. ఒక్కోసారి కిందపడిపోతాం కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే...
మన చెవుల లోపలి భాగంలో ఒక రకమైన సంచుల్లాంటి నిర్మాణాలు (కాక్లియా) కొన్ని ఉంటాయి. వీటిలో ఒక ద్రవం, ఆ ద్రవంలో కొన్ని స్ఫటికాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి మన సమతుల్యతను నియంత్రిస్తాయి. మన తలని గిరగిరా తిప్పినప్పుడు ఆ ద్రవంలోని స్ఫటికాలు కూడా అందుకు అనుగుణంగా తిరిగి, సంచుల గోడలను తాకి వాటిపై ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో వీటిని అంటిపెట్టుకుని ఉండే నాడులు ఆ సంకేతాలను మెదడుకి అందిస్తాయి.
మెదడు అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. మనం గిరగిరా తిరిగినప్పుడు మన చెవుల్లోని ద్రవపు సంచుల్లోని స్ఫటికాలు కూడా తిరుగుతాయి. అయితే మనం ఆగిపోయిన వెంటనే అవి మళ్లీ తమ పూర్వ స్థితికి చేరుకోలేవు. దాంతో కొంతసేపటిదాకా అసలేం జరుగుతుందో మన శరీర వ్యవస్థకు అర్థంకాదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం సంతులతను కోల్పోయి కిందపడతాం.