పల్లె ప్రతిభకు తార్కాణం.. మంజునాథ | success speaks-manjunatha | Sakshi
Sakshi News home page

పల్లె ప్రతిభకు తార్కాణం.. మంజునాథ

Published Thu, Dec 5 2013 4:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

పల్లె ప్రతిభకు తార్కాణం.. మంజునాథ

పల్లె ప్రతిభకు తార్కాణం.. మంజునాథ

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సానపడితే.. అద్భుతాలు సృష్టించగలరు అనే ఆశయంతో ప్రారంభమైనవే..

 గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సానపడితే.. అద్భుతాలు సృష్టించగలరు అనే ఆశయంతో ప్రారంభమైనవే.. ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలు.. ఇప్పుడు ఆ కలలను నిజం చేస్తూ.. ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.. అటువంటి విద్యార్థుల్లో ఒకరు.. మోపిరెడ్డిగారి మంజునాథ రెడ్డి. వై.ఎస్.ఆర్. కడపజిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ.. ఇటీవలి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎఫ్‌ఎంసీలో రూ. 5.2 లక్షల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. మంజునాథ విజయ గాథ అతని మాటల్లోనే..

 

 కుటుంబ నేపథ్యం:

 అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు మా స్వస్థలం. వ్యవసాయ కుటుంబం. నాన్న మోపిరెడ్డిగారి బైపరెడ్డి. అమ్మ అనసూయ. తమ్ముడు మణికంఠ రెడ్డి చిత్తూరులో బీటెక్ (మెకానికల్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అమ్మానాన్నకు చదువు విలువ తెలుసు. దాంతో మా ఇద్దర్నీ ఉన్నతంగా చదివించాలని సంకల్పించారు. మేం కూడా వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్నాం.

 

 నవోదయ టు ట్రిపుల్ ఐటీ:

 నవోదయ పరీక్షలో అర్హత సాధించడంతో ఆరు నుంచి పదో తరగతి వరకు లేపాక్షి జవహర్ నవోదయ పాఠశాలలో చదివాను. పదోతరగతిలో 464/500 మార్కులు రావటంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ఇందులో మొదటి రెండేళ్లు పీయూసీ ఉంటుంది. తర్వాత నాలుగేళ్లు ఇంజనీరింగ్ బోధిస్తారు. ఇంజనీరింగ్‌లో మెకానికల్ బ్రాంచ్‌ను ఎంచుకున్నా.

 

 నూతన విధానంలో టెక్నాలజీని ఉపయోగించుకుని వీడియో ద్వారా పాఠాలను బోధించడం వంటివి అంశాలు ఉత్సాహాన్ని కలిగించేవి. నేర్చుకోవాలనే తపనను పెంపొందించేవి. ప్రణాళిక ప్రకారంగా ఉండే ప్రయోగశాలలు, లైబ్రరీ కార్యకలాపాలు క్రమశిక్షణను అలవాటు చేశాయి. ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు ఎంతో స్ఫూర్తి నిచ్చాయి. తద్వారా అనుకున్నది సాధించగలమనే విశ్వాసం ఏర్పడింది. ముఖ్యంగా ఐఐటీ ప్రొఫెసర్ జె.ఎస్. రావు మెకానికల్ ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులను వీడియో ద్వారా వివరించడం ఎంతో ప్రభావితం చేసింది. భవిష్యత్‌లో ఏదైనా పరికరాన్ని కనుక్కోవాలన్న ఆలోచనకు బీజం వేసింది.

 

 క్షేత్ర స్థాయి అవగాహనకు:

 తరగతి గదిలో నేర్చుకున్న దానికంటే ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్కు వంటి అంశాలు ప్రాక్టికల్‌గా నాలెడ్జ్‌ను పెంచుకోవడానికి దోహదం చేశాయి. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో ఎనిమిది వారాలపాటు ఇంటర్న్‌షిప్ చేశాను. క్షేత్ర స్థాయిలోని అంశాలపై అవగాహనకు ఇంటర్న్‌షిప్ ఎంతగానో ఉపయోగపడింది. నానో టెక్నాలజీలో రాగి వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టు వర్క్ మంచి గుర్తింపునిచ్చింది.

 

 ప్రిపరేషన్ ఇలా:

 ఇంజనీరింగ్‌లో సాధించిన మార్కులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు అర్హత కల్పిస్తాయి. ఆ తర్వాత వ్యక్తిగత సామర్థ్యం, నైపుణ్యాలే ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలలో వునం ఇచ్చే రెజ్యుమె కీలక పాత్రను పోషిస్తుంది. రెజ్యుమెలో పేర్కొన్న ప్రతి అంశంపై పట్టుండాలి. ప్లేస్‌మెంట్ కోసం నెల రోజుల పాటు శిక్షణనిచ్చారు. ఇది ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాకుండా నైట్‌స్టడీస్‌లో స్నేహితులందరూ రోజూ అర గంట మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిని ప్రాక్టీస్ చేసే వాళ్లం. దాంతో కమ్యూనికేషన్‌స్కిల్స్, ఇంటర్వ్యూ అంటే భయం పోయింది. ఇవన్నీ ప్లేస్‌మెంట్‌లో విజయం సాధించేందుకు ఉపకరించాయి.

 

 విధులు:

 మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిజైనింగ్ నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్. 3-డి ప్రింటింగ్‌కు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ చేశా ను. జాబ్ ఆఫర్ ఇచ్చిన ఎఫ్‌ఎంసీ కూడా అదే విభాగంలో అవకాశం ఇచ్చింది. సముద్రంలో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు అవసరమైన మెషిన్స్‌ను డిజైన్ చేయటం, వాటిని సముద్రగర్భంలోకి తీసుకెళ్లి రోబోటిక్స్ సాయంతో అమర్చడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

 

 రైతుల కష్టాలు తీరుస్తా:

 అనంతపురం జిల్లా అంటే కరువు గుర్త్తుకొస్తుంది. వర్షాధారంగా పండే పంటలే ఇక్కడి రైతులకు ఆధారం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తు పెరిగా. బీటెక్‌లో చేరాక వాటర్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ గురించి తెలిసింది. కొన్ని దేశాల్లో కొద్దిపాటి వర్షపు నీటితో పదిరెట్లు అధికంగా దిగుబడి సాధిస్తున్నారు. అలాంటి టెక్నాలజీని రూపొందించి కరువు జిల్లాల్లో రైతుల కష్టాలు తీర్చాలనేది నా లక్ష్యం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement