
లోగుట్టు ‘పనామా’ కెరుక
ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ పన్నుల వ్యవస్థలో తేడా, విత్త వ్యూహాల అమలు కారణంగా పటిష్టమైన...
ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ పన్నుల వ్యవస్థలో తేడా, విత్త వ్యూహాల అమలు కారణంగా పటిష్టమైన విత్త వ్యవస్థ అభివృద్ధికి తగిన వాతావరణం ఏర్పడింది. పన్నుల వ్యవస్థలో సరళీకృత విధానాల అమలుతో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకు ప్రయోజనం చేకూరింది. ‘ది ట్యాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ ప్రెజర్’ అంచనా ప్రకారం ఏటా ట్యాక్స్ హెవెన్స్‌తో కూడిన పన్నుల వ్యవస్థ కారణంగా 255 బిలియన్ డాలర్లను ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి! ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రకారం ట్యాక్స్ హెవెన్స్‌లో ఏర్పాటైన విదేశీ కంపెనీల్లో 2007లో పెట్టుబడి 5000 నుంచి 7000 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా!!.
అధిక పన్నురేటు ఉన్న దేశాల్లో పన్ను ఎగవేతకు ట్యాక్స్ హెవెన్ దేశాలు ఆస్కారం కల్పిస్తున్నాయి. దీంతోపాటు ఆయా దేశాల బడ్జెటరీ రాబడులపై ప్రతికూల ప్రభావం కలిగేందుకు ట్యాక్స్ హెవెన్లు కారణమవుతున్నాయి. తద్వారా ఆయా దేశాల విత్త రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకరుల కూటమి (ఐసీఐజే) వెలువరించిన పనామా పత్రాల ప్రకారం విదేశీ సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టిన భారతీయుల సంఖ్య 500కు పైగా ఉన్నట్లు అంచనా.
భారత్‌లో పరిస్థితులు
పన్ను చెల్లించకుండా ఇతర అక్రమ మార్గాల్లో కొన్ని వేల కోట్లు సంపాదించిన వారిలో సుమారు 500 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. రిజర్వ్ బ్యాంకు మార్చి , 2013న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సరళీకృత రెమిటెన్స్ పథకం (ఎల్.ఆర్.ఎస్) కింద భారతీయులు సులభ పన్ను విధానాలుండే దేశాల్లో ఒక సంస్థను ఏర్పాటుచేయవచ్చు. అది భారత్‌లోని మరో కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు. 2016, జనవరిలో రిజర్వ్ బ్యాంకు నోటిఫికేషన్‌లో మూలధన ఖాతా, లావాదేవీల్లో విదేశీ బ్యాంకుల్లో కరెన్సీ ఖాతా తెరవటం, విదేశాల్లో ఆస్తులు, పెట్టుబడులు, అనుబంధ సంస్థలను సొంతగా ఏర్పాటుచేయటంతోపాటు జాయింట్ వెంచర్ల ఏర్పాటును చేర్చారు.
పనామా
రిపబ్లిక్ ఆఫ్ పనామాగా పిలుస్తున్న పనామా.. సెంట్రల్ అమెరికాలో ఉంది. దేశంలోని 3.9 మిలియన్ల జనాభాలో సుమారు సగం మంది రాజధాని పనామా సిటీలో నివసిస్తున్నారు. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి 2015లో 49.14 బిలియన్ డాలర్లు. ప్రామాణిక ద్రవ్యం డాలర్. పనామా ఆర్థిక వ్యవస్థకు ఫైనాన్షియల్ సర్వీసులు అత్యంత కీలకమైనవి. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తిలో పనామా కెనాల్ ద్వారా జరిగే వాణిజ్యం సుమారు 6 శాతం.
సరళతర పన్నుల వ్యవస్థ
2013లో నార్వేజియన్ సెంటర్ ఫర్ ట్యాక్సేషన్ ప్రచురించిన అకడెమిక్ అధ్యయనం ప్రకారం 1919లో ట్యాక్స్ హెవెన్‌గా పనామా చరిత్ర మొదలైంది. మద్యంపై నిషేధం ఉన్న సమయంలో.. అమెరికా ప్రయాణికుల నౌకలు తమ వినియోగదారులకు ఆల్కహాల్ అందించేందుకు పనామనియన్ రిజిస్ట్రేషన్ కారణమైంది. షిప్పింగ్‌పై విధించిన తక్కువ పన్నులు, నియంత్రణ విధానాలను పనామా తర్వాతి కాలంలో విదేశీ ఫైనాన్స్‌కు విస్తరించింది. కార్పొరేట్, వ్యక్తిగత ఆర్థిక గోప్యతను పాటించటానికి అవసరమైన చట్టాలను పనామా రూపొందించింది. కఠిన గోప్యతను పాటించే చట్టాలు, నియంత్రణలను తీసుకొచ్చింది. వీటిని ఉల్లంఘించిన వారిపై అధిక జరిమానాలను విధించింది.
* కార్పొరేట్ సంస్థ రిజిస్ట్రేషన్ సమయంలో వాటాదారుల పేర్లను కంపెనీ వెల్లడించాల్సిన అవసరం లేదు.
* పనామా కెనాల్ ద్వారా వ్యాపార అవకాశాలు పెరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య జోన్‌గా ఉండటంతో 1982 నాటికి 100 అంతర్జాతీయ బ్యాంకులు పనామా సిటీలో తమ ఆఫీసులు ప్రారంభించాయి.
* స్థానికంగా సృష్టించిన ఆదాయంపై పన్ను విధిస్తూ, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను మినహాయింపు ఇస్తుంది. 1903లో పనామా ఏర్పడినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. దేశంలో నివసించే వారి స్థానిక ఆదాయంపై.. పురోగామి పద్ధతిలో ఆదాయపు పన్ను సుమారు 46 శాతం వరకు ఉంది.
* వివిధ దేశాల కరెన్సీల వినిమయంలో స్వేచ్ఛ, ఆర్థికంగా వ్యూహాత్మక స్థానంలో ఉండటంతో 35,000 కార్పొరేషన్లు (విదేశీ కంపెనీలు అధికం) పనామాలో రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉన్నాయి. 1920వ దశకంలో రూపొందించిన చట్టాలను పునరుద్ధరించటం ద్వారా విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించింది.
* చాలా సులభంగా కంపెనీలను ఏర్పాటుచేయటంతోపాటు పన్ను రిటర్న్‌లు ఫైల్ చేయాల్సిన అవసరం, అకౌంట్స్ ఆడిట్ తప్పనిసరి అనే నిబంధనలు లేకపోవటంతో అనేకమంది పనామాలో తమ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
పనామాలో ప్రయోజనాలు
* కేంద్ర బ్యాంకు లేకపోవటం, వినిమయ రేటు విధానంపై నియంత్రణ కొరవడటం, ద్రవ్యపరమైన స్వేచ్ఛ.
* పనామా బయట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలపై ఏ విధమైన పన్ను విధించకపోవటం. విత్తపరమైన లేదా వార్షిక నివేదికలు సమర్పించాలనే నిబంధనలు లేకపోవటం.
* సాంవత్సరిక నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతోపాటు వృత్తి పరమైన సేవల అందుబాటు.
* ప్రైవసీ పరిరక్షణతోపాటు డిపాజిటర్లు కోరిన కరెన్సీ రూపంలో బేరర్ షేర్లు, నంబరుతో కూడిన బ్యాంకు అకౌంట్లను నిర్వహించటం.
* తక్కువ ప్రభుత్వ వ్యయంతో షిప్పింగ్ పరిశ్రమలో పాలుపంచుకోవటం. పూర్తి పన్ను మినహాయింపుతో కోలన్ ఫ్రీ జోన్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించటం.
ఇటీవలి పరిణామాలు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక భాగస్వామిగా ఉన్న ఐసీఐజే.. 1.15 కోట్ల రహస్య పత్రాలకు సంబంధించి 2.6 టెరాబైట్ల సమాచారాన్ని సేకరించింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు వేర్వేరు ప్రాంతాల్లో సంపాదించిన ఆదాయాన్ని వెల్లడించింది. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉండే దేశాలకు అక్రమ ఆదాయాన్ని తరలించి.. ఆయా దేశాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడులుగా మార్చడంలో కీలకంగా వ్యవహరించే సంస్థ నుంచి ఐసీఐజే సమాచారాన్ని సేకరించింది. మొత్తం నల్లధనం రూ.1550 లక్షల కోట్లుగా అంచనావేసింది. మరోవైపు రహస్య ఒప్పందాలకు తాము వ్యతిరేకమని, చట్టపరమైన సంస్థలకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించగలమని, పనామా ప్రభుత్వం ప్రకటించింది.
పన్ను స్వర్గాల్లో పెట్టుబడి వల్ల ప్రయోజనం
* పన్ను స్వర్గాల స్థానికులు, స్థానికేతరులు విదేశీ కరెన్సీ వ్యవస్థను కలిగి ఉంటారు. స్థానికులు ద్రవ్యపరమైన నియంత్రణలకు లోబడి ఉంటారు. దీంతోపాటు ఆయా దేశాల్లో డాలర్లు/ యూరో/పౌండ్ రూపంలోకి కరెన్సీని మార్చుకునే వీలుంది.
* పెద్ద కార్పొరేషన్లు తమ విదేశీ సెంటర్ల ద్వారా లబ్ధిపొందితే, వ్యక్తులు.. తమ విదేశీ బ్యాంకుల ద్వారా ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్ సమాచారాన్ని గోప్యంగా ఉంచటం, ఏ విధమైన పన్ను లేకపోవటం లేదా తక్కువ పన్ను, బ్యాంకింగ్ రంగం డిపాజిట్లను అంగీకరించటంతోపాటు రాజకీయ అనిశ్చితి, విత్త పరమైన అనిశ్చిత పరిస్థితుల్లో తగిన భద్రత.
డిసెంబరు 2012లో ఐఎంఎఫ్ విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడుల గణాంకాల ప్రకారం..
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నమోదైన కార్పొరేట్ పెట్టుబడులకు సంబంధించి ప్రతి రెండు డాలర్లలో ఒక డాలరు ట్యాక్స్ హెవెన్స్ నుంచి ఆయాదేశాల్లోకి ప్రవేశించినవే. 2009లో ఈ పెట్టుబడులు 19 శాతం. కాగా 2012, డిసెంబరు నాటికి 50 శాతానికి పెరిగాయి.
* 2011లో దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాల్లోకి ప్రవేశించిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ట్యాక్స్ హెవెన్స్ వాటా 46 శాతం. ఎగువ మధ్య, అధిక ఆదాయ దేశాల్లో ఈ వాటా 37 శాతం.
- డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.