హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు? | Gedains competitive on Indian History | Sakshi
Sakshi News home page

హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?

Published Wed, May 4 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?

హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?

కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ హిస్టరీ
గుప్తుల అనంతర యుగం (క్రీ.శ. 6వ శతాబ్దం - 8వ శతాబ్దం)
గుప్తుల తర్వాత భారతదేశం మరోసారి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఈ రాజకీయ అనైక్యత ఉత్తర భారతంలో తీవ్రంగా ఉంది. ఈ కాలంలోనే ఉత్తరాదిలో.. వల్లభి కేంద్రంగా మైత్రకులు, గౌహతి కేంద్రంగా (కామరూప రాజ్యం) - వర్మన్ వంశం, పాటలీపుత్రం కేంద్రంగా - కడపటి గుప్తులు పాలించారు. అలాగే బెంగాల్ కేంద్రంగా - గౌడ వంశం, కనౌజ్ కేంద్రంగా - మౌఖరీలు, ఒడిశా కేంద్రంగా-మాతరులు, మానవంశం, స్థానేశ్వర్ కేంద్రంగా- పుష్యభూతి వంశంవారు పాలన కొనసాగించారు.

అయితే పుష్యభూతి వంశంవారు క్రమంగా ఈ రాజ్యాలన్నింటినీ జయించి మొత్తం ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి పాలించారు. ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ గాంగులు, బాదామీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పాలిస్తున్నాయి. ఈ వంశాలు దక్షిణ భారతదేశంలో వాస్తు, శిల్ప కళలకు అమూల్యమైన సేవలను అందించాయి. గుప్తుల తర్వాత యుగంలో ఉత్తరాదిని పాలించిన రాజవంశాలన్నింటిలో ‘పుష్యభూతి వంశం’ గొప్పది.
 
పుష్యభూతి వంశం
 
పుష్యభూతి
ఇతడు తన పేరుతో పుష్యభూతి వంశాన్ని స్థాపించాడు. స్థానేశ్వర్ రాజధానిగా గుప్తుల సామంతుడిగా పరిపాలించాడు.
 
ప్రభాకర వర్థనుడు
పుష్యభూతి వంశంలో తొలి స్వతంత్ర రాజు. తన స్వతంత్ర పాలనకు గుర్తుగా ‘రాజాధిరాజ’ అనే బిరుదును ధరించాడు. ప్రభాకరుడి భార్య యశోమతి. ప్రభాకర వర్థనుడు
 క్రీ.శ. 605లో మరణించగా భార్య సతీ సహగమనాన్ని ఆచరించిందని బాణుడి గ్రంథాల ద్వారా తెలుస్తోంది.
 
రాజ్యవర్థనుడు
ప్రభాకర వర్థనుడు తన జ్యేష్ట పుత్రుడు రాజ్య వర్థనుడికి బదులు రెండో కుమారుడు హర్షుడిని రాజుగా చేయాలని సంకల్పించాడు. దీనికి హర్షుడు సమ్మతించలేదు. దీంతో రాజ్యవర్థనుడు రాజయ్యాడు. ఇతడి కాలంలో కనౌజ్‌ను గ్రహవర్మ అనే మౌకరీరాజు పాలించేవాడు. ఇతడు రాజ్యవర్థనుడి సోదరి రాజ్యశ్రీ భర్త. మగధను, మాళ్వాను పాలించే దేవగుప్తుడు.. గౌడ దేశాన్ని పాలించే శశాంకుడితో కలిసి.. గ్రహవర్మను చంపి కనౌజ్‌ను ఆక్రమించాడు. రాజ్యవర్థనుడు దేవగుప్తుడిని చంపి కనౌజ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. శశాంకుడు.. రాజ్యవర్థనుడిని హత్య చేయడంతో హర్షుడు రాజ్యానికి వచ్చాడు.
 
హర్షవర్థనుడు
హర్షవర్థనుడు గౌడ శశాంకుడి నుంచి కనౌజ్‌ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్‌కు మార్చాడు. శశాంకుడి తర్వాత గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది.

హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తోంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. పులకేశి వారసులు ఈ యుద్ధంలో పులకేశి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు.

హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి అతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు.
 
పాలనా విధానం
ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనాపద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడి పాలనా సమర్థత వల్ల గుప్తుల అనంతరం ఉత్తర భారతంలో దాదాపు 40 ఏళ్లపాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. కనౌజ్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ.. పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలుండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా పెరిగిపోయింది.

ఒక రాజుకు ఉన్న సామంతుల సంఖ్యను బట్టి అతడి గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది. హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించాడు. వీటిని ‘భుక్తి’ అని పిలిచేవారు. రాష్ట్రాలను ‘విషయ’ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. జిల్లాలను ‘పాథక’ అని విభజించారు. పాలనలో చిట్టచివరి విభాగం గ్రామం.
 
పరిపాలనలో రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారుల్లో ముఖ్యమైనవారు మంత్రి, సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులందరికీ వేతనాలను భూముల రూపంలోనే చెల్లించేవారు. కేవలం కిందిస్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణేలు కనిపిస్తాయి. నాణేల కొరతకు మరో కారణం.. ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. ఇది పంటలో ఆరో వంతుగా ఉండేది. ‘తుల్యమేయ’ అనే అమ్మకం పన్ను కూడా విధించారు.
 - కె. యాకూబ్‌బాష, సబ్జెక్టు నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement