ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం.. | Students to job seekers | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం..

Published Sun, May 15 2016 4:53 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం.. - Sakshi

ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం..

టాప్‌ స్టోరీ
ఒత్తిడి.. మూడు అక్షరాల పదం! ప్రభావం మాత్రం.. కొండంత!! నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులే! అకడమిక్ పరీక్షల్లో  మంచి గ్రేడ్ సాధించాలని ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కలల కొలువులు సొంతం చేసుకోవాలని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగార్థులు.. 24్ఠ7 పని వాతావరణం; డెడ్‌లైన్స్; డెసిషన్ మేకింగ్; ఉన్నత స్థానాలు అందుకోవాలనే తపనతో ఒత్తిడి ఎదుర్కొంటున్న కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు.. ఇలా... ఇప్పుడు క్లాస్ రూం, నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఒత్తిడి అనే మాట సర్వ  సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలు.. సూచనలు..
 
ఆత్మవిశ్వాసం ఆలంబనగా
ఒత్తిడిని జయించే క్రమంలో ఇటు విద్యార్థులైనా, అటు ఉద్యోగార్థులైనా, ఉద్యోగులైనా.. ముందుగా పెంపొందించుకోవాల్సింది ఆత్మవిశ్వాసం. ఒత్తిడికి గురవడం అనే సమస్య.. సాధారణంగా సహచరులతో పోల్చుకోవడం వల్ల, పోటీ గురించి అతిగా ఆలోచించడం వల్ల ఎదురవుతుంది. తమపై తాము నమ్మకం పెంచుకుంటే ఒత్తిడిని సగం జయించినట్లే! మెండైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతో పాటు తోటివారితో పోల్చుకోవడం, పోటీ గురించి అదేపనిగా ఆలోచించడం మానేయడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు అధిగమించొచ్చు.
 
సానుకూల జీవన శైలి
ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపకరించే మరో అంశం.. వ్యక్తిగత జీవన శైలి సరళంగా, మానవ సంబంధాలు సానుకూలంగా ఉండేలా చూసుకోవడం. దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం మేలు. కొన్ని సందర్భాల్లో అత్యంత సాధారణంగా ఉండే అంశాలు కూడా సమయాన్ని వృథా చేసి ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాల గురించి పదేపదే ఆలోచించకుండా కుటుంబ సభ్యులు, మిత్రులతో వీలైనంత గడపడం మంచిది. అలసటగా అనిపించినా.. ఆందోళనకు గురవుతున్నా కొత్త ప్రాంతాలను సందర్శించడం చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
 
ప్రాధాన్యతలను గుర్తిస్తూ
చాలామంది తాము చేయాల్సిన పనులు పూర్తి చేయలేదనే భయంతోనో లేదా వాటిని పూర్తి చేయకపోతే కలిగే ప్రభావాన్ని తలచుకొని చివరి నిమిషంలో ఎక్కువగా ఒత్తిడికి గురువుతుంటారు. ఇలాంటి వారికి ఒత్తిడిని జయించే క్రమంలో ఉపయోగపడే  మంచి సాధనం.. ముందస్తు ప్రణాళిక. విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా ఒక వారం లేదా ఒక రోజుకు సంబంధించి తాము చేయాల్సిన పనులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీలైతే వాటిని డైరీలోనో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్ క్యాలెండర్‌లోనో నోట్ చేసుకోవాలి. ఒకరోజు చదవాల్సిన అంశాల్లో ప్రాధాన్యతను గుర్తిస్తూ ముందుకు సాగాలి. తద్వారా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు.
 
ఒత్తిడికి గురిచేసే వారికి దూరంగా
ఒత్తిడిని దూరం పెట్టడంలో ఉపయోగపడే మరో చిట్కా. ‘ఒత్తిడి’కి గురిచేసే వారిని లేదా ‘నిరాశావాదు’లకు దూరంగా ఉండటం. కొంతమంది అదే పనిగా వచ్చి.. ఒక పరీక్షకు సంబంధించి ప్రతికూల అంశాలే చెబుతుంటారు. ‘ఇంత పోటీలో ఎంత చదివినా ఉపయోగం ఏంటి? నేను కూడా గతంలో ఎంతో కృషి చేశాను. కానీ ఫలితం లేదు’ అనే మాటలతో నిరుత్సాహానికి గురిచేస్తారు. అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండాలి.
 
ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్
తాము చేయాల్సిన పనులు లేదా చదవాల్సిన అంశాలను వాటి క్లిష్టత స్థాయి ఆధారంగా ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్‌గా వర్గీకరించుకోవాలి. ముందుగా ‘ఈజీ’తో మొదలుపెట్టాలి. ఇవి పూర్తయ్యాక  మోడరేట్, డిఫికల్ట్ అంశాలనుఎదుర్కొనేందుకు ముందస్తు మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇలా కాకుండా.. ఇష్టం లేకున్నా కష్టమైన అంశాలతో మొదలుపెడితే ఒత్తిడి మరింత పెరుగుతుంది.
 
రిలాక్సేషన్ టెక్నిక్స్
కొన్ని సందర్భాల్లో ఎంత వద్దనుకున్నా.. ఎంత ఏకాగ్రతతో చదవాలనుకున్నా.. ఆందోళన పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో చదువుతున్న పుస్తకాలను కొద్దిసేపు పక్కనపెట్టి మానసిక విశ్రాంతి కోసం టెక్నిక్స్ పాటించాలి. అంటే.. ఇష్టమైన సంగీతం వినడం, గార్డెనింగ్, లేదా టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ చూడటం లాంటివి చేయాలి. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
స్ట్రెస్ మేనేజ్‌మెంట్.. మరికొన్ని టిప్స్
* దినచర్యను ఇష్టమైన పనితో ప్రారంభించాలి.
* ప్రతిరోజూ కొద్దిసేపు నడక, యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేయాలి.
* ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి.
* ఇష్టమైన ప్రదేశాలు చూడాలి. అయితే వీటికోసం రోజుల తరబడి వృథా చేయకూడదు. తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్తుండాలి.
* విసుగు, కోపం, ఆవేదనకు దూరంగా ఉండాలి.
* ఇతరుల విజయాల పట్ల సానుకూల దృక్పథం అవసరం.
* ఉద్యోగులు డెడ్‌లైన్స్, లాస్ట్ మినిట్ వరకు వేచి చూడకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం.
 
అందరికీ ఒత్తిడి.. అధిగమించేందుకు ఎన్నో మార్గాలు
ప్రస్తుత పోటీ వాతావరణంలో ఒత్తిడి అనే మాట వినిపించని రంగం, ఆ మాట తలవని వ్యక్తులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని అధిగమిస్తేనే విజయం. ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మానసిక ఉపశమన ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడి ఎదురైనప్పుడు కొద్దిసేపు దానికి విరామమిచ్చి సహచరులతో బృందచర్చల్లో పాల్పంచుకోవడం, అది వీలు కాకపోతే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ఇక.. విజయం పరంగా పోటీ గురించి ఆలోచించకుండా కృషిచేస్తే ఒత్తిడి అనే మాట దరిచేరదు.
- డాక్టర్. ఎం.ఎస్.రెడ్డి,సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్
 
తల్లిదండ్రులదీ కీలక పాత్ర
17 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండి పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఆ వయసులో పిల్లలు సహచర విద్యార్థులతో పోల్చుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా వారికి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితులను తల్లిదండ్రులే గుర్తించి వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ సహచర విద్యార్థులతో పోల్చి మరింత ఒత్తిడికి గురి చేయడం సరికాదు. పోటీల్లో జయాపజయాలు సహజం. దీన్ని గుర్తించి ఫలితం ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధత పొందాలి.
- డాక్టర్. జి.కృష్ణ, క్లినికల్ సైకాలజిస్ట్, ఎన్‌ఐఎంహెచ్ - సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement