
సహోద్యోగులే స్నేహితులు!
స్కిల్ డెవలప్‌మెంట్
కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. పనిచేసే చోట స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. సహోద్యోగులను స్నేహితులుగా, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారాన్ని కనుగొనడంలో మార్గం చూపే వ్యక్తులుగా మలచుకోవాలి. అప్పుడే వృత్తిగత జీవితం వర్ధిల్లుతుంది. ఈ క్రమంలో తోటి ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు సూచనలు..
ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా కూర్చోకుండా, చొరవ తీసుకొని సహోద్యోగులతో మాట కలపాలి. టీ, లంచ్ బ్రేక్‌లో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పనిచేసే చోట కుదురుకునేందుకు వీలవుతుంది. సహచర ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. చక్కటి పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తోటి ఉద్యోగులకు దగ్గర కావొచ్చు.
వీలైనంత వరకు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదు. మంచి ఆలోచనలను పంచుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే తోటి ఉద్యోగులే మీతో స్నేహం చేయడానికి పోటీపడతారు.
బ్రేక్ సమయాల్లో లేనిపోని గొప్పలు చెప్పుకోకుండా.. వృత్తికి సంబంధించిన లేదా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై తోటి ఉద్యోగులతో చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులుగా మారడానికి దోహదం చేస్తుంది.
సాయం చేయడంలో ముందుండాలి
తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉంటే.. చొరవ తీసుకొని, సాయం చేయడంలో ముందుండాలి. ఇలా చేస్తే వారు మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోరు. చిన్న చిన్న కారణాలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు.. మీరే ముందుగా సారీ చెప్పండి. కొద్ది సేపు ఏకాంతంగా కూర్చుని, అన్ని అంశాలనూ చర్చించుకోండి.
* మీతో మంచిగా ఉంటూ.. మీ గురించి ఇతరులతో చెడుగా చెప్పేవారిని దూరం పెట్టాలి.
* మీ ఆలోచనలను కాపీ కొట్టి.. బాస్ దగ్గర మంచి పేరు కొట్టెయ్యాలనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి.
* చక్కటి పనితీరు కనబరిచే వారిపై లేనిపోని రూమర్లు పుట్టించి, వారిని పక్కదారి పట్టించాలని చూసేవారి మాటలు పట్టించుకోవద్దు.
* పని విషయంలో ఇతరులను పోటీదారులుగా భావించకుండా, బృంద స్ఫూర్తితో అడుగేయాలి.