పల్లె ప్రతిభ @ RGUKT | Rural Excellence @ RGUKT | Sakshi
Sakshi News home page

పల్లె ప్రతిభ @ RGUKT

Published Sat, May 7 2016 1:43 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

పల్లె ప్రతిభ @ RGUKT - Sakshi

పల్లె ప్రతిభ @ RGUKT

పదో తరగతితోనే బీటెక్ దిశగా ప్రవేశానికి మార్గం వేస్తోంది.. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ). పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా...  ఆర్‌జీయూకేటీ పరిధిలోని మూడు క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం లభిస్తుంది.
 
ఆర్‌జీయుకేటీ బాసర క్యాంపస్ (తెలంగాణ రాష్ట్రం)కు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేది మే 31. నూజివీడు క్యాంపస్ (ఆంధ్రప్రదేశ్), ఆర్‌కే వ్యాలీ క్యాంపస్(ఆంధ్రప్రదేశ్)లలోనూ త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ప్రవేశ ప్రక్రియ, విద్యావిధానం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం...
 
ఏపీ ట్రిపుల్ ఐటీలు.. 2008లో అప్పటి ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గ్రామీణ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైనవి. వీటి నిర్వహణ కోసం ఆర్‌జీయూకేటీ పేరుతో ప్రత్యేక యూనివర్సిటీని సైతం నెలకొల్పడం జరిగింది. గతేడాది నుంచి బాసర క్యాంపస్‌లో ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం, ఆర్‌కే వ్యాలీ(ఇడుపులపాయ, డాక్టర్ వైఎస్‌ఆర్ జిల్లా), నూజివీడు క్యాంపస్‌లలో ప్రవేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి.
 
మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సెలింగ్
ప్రకటనల ఆధారంగా ఔత్సాహిక అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అందిన దరఖాస్తులను, సదరు విద్యార్థుల జీపీఏ, రిజర్వేషన్ తదితర అంశాల ప్రాతిపదికగా మెరిట్ జాబితా రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

కోర్సు: ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్
అర్హతలు: పదో తరగతి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత (2016లోనే)
వయసు: డిసెంబర్ 31, 2016 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు 21 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
అంతా ఆన్‌లైన్‌లోనే: ఔత్సాహిక అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇందుకోసం ఏపీ ఆన్‌లైన్ లేదా మీ సేవా సెంటర్లలో నిర్దేశిత దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
 
ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్లు
తెలంగాణలోని బాసర క్యాంపస్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్‌కే వ్యాలీ, నూజివీడులలో ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్లు చొప్పున మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలోని బాసర క్యాంపస్‌లోని సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే ఏపీలోని ఆర్‌కే వ్యాలీ, నూజివీడు క్యాంపస్‌లలోని సీట్లలో 85 శాతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  విద్యార్థులకు కేటాయిస్తారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులకు, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు ఉన్నాయి.
 
ప్రతిభే కొలమానం
ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లలో ప్రవేశం పూర్తిగా విద్యార్థుల పదోతరగతి ప్రతిభ ఆధారంగానే లభిస్తుంది. పదోతరగతిలో పొందిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ),  పదో తరగతి ప్రతి సబ్జెక్ట్‌లో పొందిన గ్రేడ్ ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి అడ్మిషన్ కల్పిస్తారు. గురుకుల పాఠశాలలు మినహా జిల్లా పరిషత్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోర్‌ను కలుపుతారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ డిప్రైవేషన్ స్కోర్ విధానం అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
 
ఫీజు
బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఏటా రూ. 37 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు; రూ. రెండు లక్షలలోపు ఉన్న ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రకారం ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు పొందొచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి రాని.. ఫీజు చెల్లించలేని విద్యార్థులకు బ్యాంకులతో ఒప్పందం ద్వారా రుణ మంజూరు సదుపాయం అందించే ప్రయత్నం కూడా జరుగుతోంది.
 
బోధన, కరిక్యులంలో నిరంతరం కొత్త మార్పులు శ్రీకారం చుడుతూ నిత్యనూతన విధానాలు అమలు చేస్తున్నాం. మొత్తం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో బీటెక్ సమయంలో ఇంటర్న్‌షిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ వంటి కార్యకలాపాలు చేపడుతూ విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించే విధంగా శిక్షణ ఇస్తున్నాం.
- ప్రొఫెసర్ పి.విజయ ప్రకాశ్, ఇంఛార్జ్ వీసీ, ఆర్‌జీయూకేటీ(ఏపీ), ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్
 
 
ప్రవేశాలు, విధానాల పరంగా ఎలాంటి మార్పులు లేవు. అంతా గతేడాది మాదిరిగానే ఉంటుంది. విద్యార్థులు అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవు.
- ప్రొఫెసర్. ఎస్. సత్యనారాయణ రెడ్డి, ఇంఛార్జ్ వీసీ, ఆర్‌జీయూకేటీ బాసర
 
ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు స్వరూపం
ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఇందులో తొలి రెండేళ్లు పీయూసీ(ఇంటర్మీడియెట్)గా పరిగణిస్తారు. విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉంటాయి.  తొలి రెండేళ్ల పీయూసీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. మూడో ఏడాది నుంచి బీటెక్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. విద్యార్థులు  ఈసీఈ, కెమికల్, మెకానికల్, సివిల్, సీఎస్‌ఈ, మెటీరియల్ సైన్ అండ్ మెటలర్జికల్‌లలో తమకు ఆసక్తి ఉన్న  బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement