RGUKT Basra campus
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు అందిస్తామన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. క్యాంపస్‌కు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని తెలిపారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 10 పడకలతో కూడిన ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రపంచంతో పోటీపడే సత్తా ఉందని కొనియాడారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. అనేక స్టార్టప్‌లకు తెలంగాణ వేదికగా మారుతోందని, ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఈ కోర్సులను అర్జీయూకేటి నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. ‘వీసీ’ రాలే!
భైంసా(ముధోల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని యూనివర్సిటీలకు వీసీ (వైస్ చాన్స్‌లర్)లను నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీకి వీసీ నియామకం విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర– ఆర్జీయూకేటీ)కి మాత్రం ఇన్చార్జి వీసీ పాలనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఏళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ఇడుపులపాయ, నూజీవీడు, బాసరలో ఆర్జేయూకేటీ పేరుతో ట్రిపుల్ ఐటీలను అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. పాలనపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో ఓయూ వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన కొనసాగిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జ కొనసాగుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. బాసర ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది రెగ్యులర్ వీసీ నియామకం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ల కోర్సులో భాగంగా ఇక్కడ ఏటా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 300 మంది వరకు టీచింగ్ స్టాఫ్, వెయ్యి మంది వరకు బోధనేతర సిబ్బంది ఉంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న ఈ వర్సిటీలో ప్రవేశాలకు ఏటా పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించిన వారంతా ఇన్‌చార్జీలే కావడంతో పూర్తిస్థాయిలో సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిమితులకు లోబడే పని చేస్తున్నారు. ఇది ట్రిపుల్ఐటీ ప్రగతికి అవరోధంగా మారింది. విద్యాలయ ప్రగతికి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అలాగే యూనివర్సిటీ నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిలింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే ఇన్చార్జీ వీసీలు నిర్ణయాలు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. విద్యాలయంలో చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జి వీసీలంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో ఇక్కడికి ‘విజిటింగ్’కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర రాజధానిలో కీలకవిధి నిర్వహణలో ఉండేవారికే ఇక్కడ ఇన్చార్జి వీసీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు సైతం పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వీసీ ప్రత్యక్ష పర్యవేక్షణ కరువై పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీ నియామకంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. ► ఇక్కడ చదివే విద్యార్థులు భోజనం, వసతి, విద్యాబోధన తదితర అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ► కొంతమంది అధికారులు విద్యాలయంలో ఆధిపత్యం చెలయిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు విద్యార్థులు సైతం ఆందోళన బాటపట్టారు. ► టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌లో ఖాళీలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. చదవండి: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు ఎవరితోనైనా లేచిపో లేదంటే.. వదిన అసభ్యంగా దూషించడంతో.. -
పల్లె ప్రతిభ @ RGUKT
పదో తరగతితోనే బీటెక్ దిశగా ప్రవేశానికి మార్గం వేస్తోంది.. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ). పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా... ఆర్జీయూకేటీ పరిధిలోని మూడు క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం లభిస్తుంది. ఆర్జీయుకేటీ బాసర క్యాంపస్ (తెలంగాణ రాష్ట్రం)కు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేది మే 31. నూజివీడు క్యాంపస్ (ఆంధ్రప్రదేశ్), ఆర్కే వ్యాలీ క్యాంపస్(ఆంధ్రప్రదేశ్)లలోనూ త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్జీయూకేటీలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ప్రవేశ ప్రక్రియ, విద్యావిధానం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం... ఏపీ ట్రిపుల్ ఐటీలు.. 2008లో అప్పటి ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గ్రామీణ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైనవి. వీటి నిర్వహణ కోసం ఆర్జీయూకేటీ పేరుతో ప్రత్యేక యూనివర్సిటీని సైతం నెలకొల్పడం జరిగింది. గతేడాది నుంచి బాసర క్యాంపస్‌లో ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ, డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా), నూజివీడు క్యాంపస్‌లలో ప్రవేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సెలింగ్ ప్రకటనల ఆధారంగా ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అందిన దరఖాస్తులను, సదరు విద్యార్థుల జీపీఏ, రిజర్వేషన్ తదితర అంశాల ప్రాతిపదికగా మెరిట్ జాబితా రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కోర్సు: ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ అర్హతలు: పదో తరగతి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత (2016లోనే) వయసు: డిసెంబర్ 31, 2016 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు 21 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. అంతా ఆన్లైన్లోనే: ఔత్సాహిక అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇందుకోసం ఏపీ ఆన్లైన్ లేదా మీ సేవా సెంటర్లలో నిర్దేశిత దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్లు తెలంగాణలోని బాసర క్యాంపస్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్కే వ్యాలీ, నూజివీడులలో ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్లు చొప్పున మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలోని బాసర క్యాంపస్‌లోని సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే ఏపీలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు క్యాంపస్‌లలోని సీట్లలో 85 శాతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులకు, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు ఉన్నాయి. ప్రతిభే కొలమానం ఆర్జీయూకేటీ క్యాంపస్‌లలో ప్రవేశం పూర్తిగా విద్యార్థుల పదోతరగతి ప్రతిభ ఆధారంగానే లభిస్తుంది. పదోతరగతిలో పొందిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ), పదో తరగతి ప్రతి సబ్జెక్ట్‌లో పొందిన గ్రేడ్ ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి అడ్మిషన్ కల్పిస్తారు. గురుకుల పాఠశాలలు మినహా జిల్లా పరిషత్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోర్‌ను కలుపుతారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ డిప్రైవేషన్ స్కోర్ విధానం అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఫీజు బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఏటా రూ. 37 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు; రూ. రెండు లక్షలలోపు ఉన్న ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రకారం ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు పొందొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాని.. ఫీజు చెల్లించలేని విద్యార్థులకు బ్యాంకులతో ఒప్పందం ద్వారా రుణ మంజూరు సదుపాయం అందించే ప్రయత్నం కూడా జరుగుతోంది. బోధన, కరిక్యులంలో నిరంతరం కొత్త మార్పులు శ్రీకారం చుడుతూ నిత్యనూతన విధానాలు అమలు చేస్తున్నాం. మొత్తం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో బీటెక్ సమయంలో ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ వంటి కార్యకలాపాలు చేపడుతూ విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించే విధంగా శిక్షణ ఇస్తున్నాం. - ప్రొఫెసర్ పి.విజయ ప్రకాశ్, ఇంఛార్జ్ వీసీ, ఆర్జీయూకేటీ(ఏపీ), ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రవేశాలు, విధానాల పరంగా ఎలాంటి మార్పులు లేవు. అంతా గతేడాది మాదిరిగానే ఉంటుంది. విద్యార్థులు అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవు. - ప్రొఫెసర్. ఎస్. సత్యనారాయణ రెడ్డి, ఇంఛార్జ్ వీసీ, ఆర్జీయూకేటీ బాసర ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు స్వరూపం ఆర్జీయూకేటీ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఇందులో తొలి రెండేళ్లు పీయూసీ(ఇంటర్మీడియెట్)గా పరిగణిస్తారు. విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉంటాయి. తొలి రెండేళ్ల పీయూసీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. మూడో ఏడాది నుంచి బీటెక్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈసీఈ, కెమికల్, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, మెటీరియల్ సైన్ అండ్ మెటలర్జికల్లలో తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.