అత్యుత్తమ చదువులకు అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్
విదేశీ విద్యకు ప్రపంచంలో ఎన్నో దేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే భారతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారికి అమెరికా.. మొదటి గమ్యస్థానంగా నిలుస్తోంది. అభిరుచికి తగిన, సత్వర ఉపాధినందించే కోర్సులుండటమే ఇందుకు కారణం. అమెరికాలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య.. మార్చి-2016 నాటికి 1,94,438కి చేరుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ విద్యా విధానంలోని ప్రత్యేకతలపై ఫోకస్...
నాణ్యమైన విద్య..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య.. సులువైన నిబంధనలతో అందుబాటులో ఉంటుంది. ఇక్కడి యూనివర్సిటీల్లో మెరుగైన మౌలిక సౌకర్యాలు, పరిశోధనలకు అనువైన వాతావరణం, నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారు. గ్రాడ్యుయేట్ స్థాయిలోనే మంచి ఉపాధినందించే కోర్సులు ఉంటాయి.
లెర్నింగ్ బై డూయింగ్
లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో సమగ్ర విద్య అందుతుంది. విద్యార్థులు క్యాంపస్‌లో పనిచేసుకోవడానికి వారానికి 20 గంటలు, సెలవులతో కలిపితే 40 గంటల వరకు అవకాశం ఇస్తారు. విదేశీ విద్యార్థులకు క్యాంపస్ బయట పనిచేసుకోవడానికి అనుమతి ఉండదు. ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో పనిచేసుకునే అవకాశం పొందవచ్చు. చాలా డిగ్రీ కోర్సుల్లో 12 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దీంతో వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
అనుకూలతలు
అమెరికా విద్యా వ్యవస్థలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. కోర్సును మధ్యలో మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌లో మొదటి రెండేళ్ల తర్వాత కోర్సుపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు విద్యార్థుల అభిరుచిని బట్టి కోర్సు మారే సౌలభ్యం ఉంది. దీంతో ఇష్టంలేని కోర్సు పూర్తి చేయాల్సి వస్తుందనే బాధ ఉండదు.
టెక్నాలజీ
విద్యలో అత్యుత్తమ టెక్నాలజీని అందిస్తామని అమెరికా యూనివర్సిటీలు గర్వంగా చెప్పుకుంటాయి. సాంకేతిక పరికరాలు, వనరులను సమకూర్చడంలో ముందుంటాయి. ఆధునిక టె క్నాలజీని వినియోగించుకుని విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేలా దోహదపడతాయి.
క్యాంపస్ అనుభవం
క్యాంపస్ జీవనం అమెరికా విద్యా వ్యవస్థలోనే గొప్ప అంశం. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులు అక్కడే ఉంటారు. సానుకూల వాతావరణంలో జరిగే చర్చల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
నాణ్యతా ప్రమాణాలు ఉన్న అమెరికా విద్యకు మంచి గుర్తింపు ఉంది. విద్యా సర్టిఫికెట్లకు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ గతేడాది మార్చి నాటికి 1,48,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 1,94,438కి చేరుకుందని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పేర్కొంది.
విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లేందుకు, వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కన్సల్టెన్సీల బదులు రిప్రజెంటేటివ్స్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే కన్సల్టెన్సీలకు విదేశీ విద్యాసంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. రిప్రజెంటేటివ్స్ ఆయా ఇన్‌స్టిట్యూట్లతో నేరుగా టచ్‌లో ఉంటారు. అందువల్ల వాళ్లయితే ఖచ్చితమైన, తాజా సమాచారం చెబుతారు. బోగస్ వెబ్‌సైట్లు, కన్సల్టెన్సీల ద్వారా ప్రవేశించిన చాలా మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇటేవలే వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
- ఇంతియాజ్ బన్నూరు, ఏఈసీసీ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్