సరైన ఎంపికతోనే అమెరికాకు రావాలి! | With the right choice to come to the United States! | Sakshi
Sakshi News home page

సరైన ఎంపికతోనే అమెరికాకు రావాలి!

Published Wed, Feb 10 2016 2:58 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

సరైన ఎంపికతోనే అమెరికాకు రావాలి! - Sakshi

సరైన ఎంపికతోనే అమెరికాకు రావాలి!

యూఎస్ డిప్లొమాటిక్ మిషన్ డిప్యూటీ చీఫ్ మైకేల్ పెలిటియర్
♦ మంచి వర్సిటీని ఎంపిక చేసుకోవాలి
♦ ప్రైవేటు ఏజెన్సీలు, ఏజెంట్ల సలహాలతో సమస్యలు
♦ అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి సమాచారం తీసుకోవాలి
♦ ‘బ్లాక్‌లిస్టు’ అంటూ ఏమీ లేదు
♦ చట్టబద్ధమైన పత్రాలు, సరైన వీసా లేకుంటేనే వెనక్కి పంపుతారు
♦ అధికారుల ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాలి
♦ ప్రతి విద్యార్థి కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు
♦ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై పెద్ద బాధ్యతే ఉంటుందని భారత్‌లో అమెరికా డిప్లొమాటిక్ మిషన్ డిప్యూటీ చీఫ్ మైకేల్ పెలిటియర్ పేర్కొన్నారు. చదువు విషయంలో విద్యార్థి ఆలోచనలకు తగినట్లు వర్సిటీ ఎంపికతో పాటు కచ్చితమైన, చట్టబద్ధమైన పత్రాలు, సరైన వీసాతో అమెరికాకు వస్తే ఏ సమస్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఇక్కడి ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపిక చేసిన కొన్ని పత్రికల విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు..

విద్యార్థులను వెనక్కి పంపిన ఘటనలపై ఏం తేల్చారు?
 ప్రతి విద్యార్థి అంశం ప్రత్యేకమైనది. ఓ కేసుతో మరోదానికి పోలిక లేదు. మేం విశ్వసనీయమైన, చట్టబద్ధమైన ప్రతి విద్యార్థిని సాదరంగా ఆహ్వానిస్తాం. అమెరికాకు రావాలనుకునే విద్యార్థులు నిజంగానే అక్కడి విద్యా వనరులను వినియోగించుకోవాలి. మంచి వర్సిటీలను ఎంపిక చేసుకోవాలి. అమెరికా వెళ్లాలనే కోరికను బలపరిచే ఉద్దేశం, కచ్చితమైన పత్రాలను కలిగి ఉండాలి. యూఎస్ ఎడ్యుకేషన్ విభాగం వెబ్‌సైట్‌లో సూచించిన ‘వీసా ప్రాసెసింగ్’ ప్రక్రియను అనుసరిస్తే ఏ ఇబ్బందులూ ఉండవు. సరైన వర్సిటీ ఎంపిక కోసం అమెరికాలోని బంధువులు, స్నేహితుల సలహా తీసుకోవాలి. అమెరికాలో 9 వేల అధీకృత విద్యాసంస్థలు ‘ఐ-20’ను జారీ చేస్తున్నాయి. మీ ‘ఐ-20’ పొందాక విద్యార్థి వీసా కోసం ustraveldocs.com వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అమెరికాలో ప్రవేశం కోసం మరో దరఖాస్తు చేసుకోవాలి. విమానాశ్రయంలో దిగి అమెరికాలోకి ప్రవేశం కోసం పత్రాలను సమర్పిస్తే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరెందుకు అమెరికాలో చదవాలనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. విద్యార్థుల సమాధానాలను బలపరిచే విధంగా వీసా, ఇతర పత్రాలు ఉన్నాయా లేవా? అని పరిశీలిస్తారు. ఏదైనా కారణాలతో తప్పుడు వీసా అని భావిస్తే మాత్రం అనుమతించరు.

రెండు వర్సిటీలకు వెళ్తున్న విద్యార్థులు వెనక్కి వస్తున్నారు? వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టారని ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ చెప్పడంలో వాస్తవమెంత?
 ఆ వర్సిటీలకు విద్యార్థులు ఇంకా వెళుతూనే ఉన్నారు. బ్లాక్‌లిస్టు అంటూ ఏం లేదు. ఆ వర్సిటీలూ ‘ఐ-20’ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. బ్లాక్‌లిస్టు విషయాన్ని ఎయిర్‌లైన్స్‌నే అడగండి. సరైన పత్రాలు కలిగి ఉన్నట్లు భావిస్తే తిరిగి వచ్చిన వారెవరైనా వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సుదీర్ఘమైన, వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఎక్కడ చదవాలనుకుం టున్నారు, ఏం చదవాలనుకుంటున్నారన్న అంశాలపై మాత్రం పునరాలోచన చేసుకోవాలి. కొందరు అమెరి కాలోని  బంధువుల వద్ద ఉండాలనుకుంటారు. మరి కొందరు వేరుగా ఉండాలనుకుంటారు. కొందరు పెద్ద నగరాల్లో, మరికొందరు చిన్న పట్టణాలను ఎంపిక చేసుకుం టారు. ప్రతి విద్యార్థి సొంత వాస్తవికతను కలిగి ఉండాలి.

ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు తీసుకున్నవారు.. తిప్పిపంపడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాథమిక దశలోనే లోపాలున్న వీసా దరఖాస్తులను తిరస్కరించవచ్చు కదా?
 భారత్‌లో యూఎస్ కాన్సులేట్ ప్రతి వీసా దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తుంది. చట్టబద్ధమైన పత్రాలు గల విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి అవకాశం కల్పించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తుంది.  కాన్సులేట్ అధికారులు తమకు ఉన్న సమయంలోనే సాధ్యమైనన్ని ఎక్కువ దరఖాస్తులను పరిశీలించేందుకు.. తమ వద్ద ఉన్న సమాచారంతో సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భారత్‌లోని అమెరికన్ కాన్సులేట్‌లు 10 లక్షల వీసా దరఖాస్తులను పరిశీలించాయి.

చదువు కోసం వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని విద్యార్థులను వెనక్కి పంపారు. ఉద్యోగం చేసుకునే అవకాశమిస్తున్న వర్సిటీలపై చర్యలు ఎందుకు తీసుకోరు?
 వర్సిటీలకు ‘ఐ-20’ జారీచేసే అధికారాన్ని ఆషామాషీగా అప్పగించరు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా ఆ వర్సిటీల పనితీరును సమీక్షిస్తుంటారు కూడా. అంతేకాదు అమెరికాలోని అన్ని వర్సిటీలకు ఈ అవకాశం ఇవ్వలేదు. అయితే వీసా నిబంధనలు పాటించడం విద్యార్థి బాధ్యత. నిబంధనలు పాటిస్తే అక్కడి వర్సిటీలకు, తిరిగి వచ్చాక స్వదేశానికి ఎంతో మేలు చేయగలుగుతారు.

వర్సిటీల సమాచారం కోసం ఏ ఏజెన్సీలను సంప్రదించాలి?
 మేం ఏ ప్రైవేటు ఏజెన్సీ, ఏజెంట్లకు మద్దతు తెలపం. విద్యా సంబంధిత సలహాల కోసం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్educationusa.state.govలో వర్సిటీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. ఎవరైనా ఉచితంగా పొందవచ్చు.
 
తమకు బేడీలు వేశారని, నిర్బంధించారని తిరిగొచ్చిన విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులేమైనా నేరం చేశారా?

 అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరిస్తే సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లేందుకు తదుపరి విమానం కోసం వేచిచూడక తప్పదు. ఒక్కో విమానాశ్రయంలో ఒక్కో విధమైన వెయిటింగ్ సదుపాయాలుంటాయి. ఎక్కడెక్కడ ఎలాంటి సదుపాయాలున్నాయో చెప్పలేను. అయితే ప్రతి విద్యార్థితో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వృత్తి నియమావళికి అనుగుణంగా ఇమిగ్రేషన్ అధికారులు నడుచుకుంటారు.
 
 అమెరికాకు వెళుతున్న విద్యార్థులను తిప్పి పంపుతున్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు?
 మైకెల్: భారత్ నుంచి ప్రత్యేకంగా తెలంగాణ, ఏపీల నుంచి అమెరికా వస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్  గతేడాది వీసా దరఖాస్తుల్లో 50 శాతం పెరుగుదలను చూసింది. మా దేశానికి విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తాం. అయితే విద్యార్థులను ఎందుకు వెనక్కి పంపారో తెలుసుకోవడానికి భారత విదేశాంగ శాఖ, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లు ప్రయత్నించాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరుల్లో ‘యూఎస్ విద్య సలహా కేంద్రా’లను ఏర్పాటు చేశాం. అమెరికా చదువులకు ఉపయోగపడే 800 ఫోన్ నంబర్లు, వివిధ వెబ్‌సైట్లు వివరాలు వాటిల్లో అందుబాటులో ఉంచాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement