వచ్చే వారం నుంచి మీ భవితలో..
నేటి పోటీ ప్రపంచంలో ప్రతి పరీక్షలోనూ కనిపించే విభాగం గణితశాస్త్రం. గణితంలో ఎన్నో కాన్సెప్ట్‌లు, మరెన్నో అప్లికేషన్లు. వాటిపై విద్యార్థుల్లో ఎన్నో భయాందోళనలు. ఇంకెన్నో అపోహలు. గణితం అంటే విద్యార్థుల్లోని భయాలను పోగొట్టి లెక్కలపై మక్కువ పెరిగేలా ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా పేరొందిన చుక్కా రామయ్య మాస్టారు.. వచ్చే వారం నుంచి మీ భవితలో గణిత పాఠాలను వినూత్న విధానంలో అందించనున్నారు.
రామయ్య సర్ అందించే ఈ గణిత పాఠాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను, విశ్లేషణ నైపుణ్యాలను వెలికితీసేలా ఉంటాయి. అంతేకాకుండా నేటి పోటీ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ థింకింగ్‌ను పెంపొందించడం.. నలుగురితో కలసి పనిచేయాల్సిన బృంద సంస్కృతిలో ఇమిడిపోయేలా సమస్యను మరికొంతమందితో కలిసి సమష్టిగా సాధించేలా ప్రోత్సహించడం రామయ్య మాస్టారు గణిత పాఠాల ముఖ్య ఉద్దేశం.
తొమ్మిది, పది తరగతుల విద్యార్థులను ఉద్దేశించిన ఈ పాఠాలు ప్రధానంగా ప్రాబ్లమ్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. అంటే.. కాన్సెప్ట్ ఆధారంగా ఒక సమస్యను సాధించడం బదులు.. ఒక సమస్య పరిష్కార సాధన క్రమాన్ని వివరిస్తారు. పాఠ్యపుస్తకంలో ఒక సూత్రం లేదా సిద్ధాంతం ఆధారంగా ఉండే ఒకట్రెండు సమస్యలకు పరిమితమైతే లభించే పరిజ్ఞానం కొంతమేరకే. కానీ ప్రాక్టికల్‌గా ఒక ప్రాబ్లమ్‌ను సాధించే క్రమంలో మరెన్నో కొత్త విధానాలు, అప్లికేషన్లు తెలుసుకోవచ్చు.
ఈ ప్రక్రియలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయదలిచాం. ఇందుకోసం ప్రతి వారం ఒక ప్రాబ్లమ్‌ను ఇస్తాం. వాటికి విద్యార్థులు జవాబులు పంపించొచ్చు. కొత్త పద్ధతిలో ఆవిష్కృతమైన పరిష్కారాలను భవితలో విద్యార్థి పేరు సహా ప్రచురిస్తాం.