చిక్కు వీడితే.. లెక్క తేలికే..
విద్యార్థులు గణితం అంటే భయపడుతుంటారు. కానీ అర్థం చేసుకుంటే దానంత∙సులువుగా మరో సబ్జెక్ట్ ఉండదు. లెక్కలను భయంతో కాకుండా ఆసక్తితో నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గణితంలో రారాజు.. తమిళనాడుకు చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు..
వినూత్న పద్ధతిలో బోధన
సాక్షి, దౌల్తాబాద్(దుబ్బాక): ఆయనకు గణితం అంటే ఎంతో ప్రేమ. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అంటే ఎంతో అభిమానం. అంతటితో ఆగి పోలేదు గణిత బోధనలో వినూత్నమైన కృత్యాదార పద్ధతులను అవలంభిస్తూ విద్యార్థులకు గణితం అంటే ఆసక్తి కలిగేలా బోధిస్తూ ముందుకు సాగుతున్నాడు. దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లి మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కొత్త రామానుజం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గట్లపల్లెపల్లి గ్రామానికి చెందిన ఈయన చిన్న నాటి నుంచి గణితం పట్ల అమితమైన ఆసక్తితో ముందుకు సాగుతున్నాడు. రామానుజం పదో తరగతిలో గణితంలో మాత్రమే 91మార్కులు సాధించారు. ఇంటర్లో 150మార్కులకు 150మార్కులు సాధించి తనకు గణితం పట్ల ఉన్న ఆసక్తిని చాటి చెప్పాడు. గణితం పట్ల ఉన్న ఆసక్తితో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ గణిత బోధనలో కృత్యాదార పద్ధతులను పాటిస్తూ అనేక మంది విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాన్ని దూరం చేశారు. చదవండి:లెక్కల ‘అంతు’ తేల్చినవాడు
చదువే పరమావధిగా ముందుకు పాగిన రామానుజం ఎన్నో అవమానాలు ఎదురైనా పట్టువదలకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన గురుకులాలో పీజీటీ మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగం సంపాధించాడు. అంతే కాకుండా శ్రీనివాస రామానుజన్ చిత్రంతో ఉన్న ఆయన జీవిత చరిత్ర వివరాల కాపీలను, ఆయన సాధించిన గణితం అంశాలను ప్రతీ విద్యార్థికీ అందజేస్తారు. గణిత శాస్త్రవేత్తగా శ్రీనివాస రామానుజన్ గణితంలో సాధించిన సున్నాను సున్నాతో భాగిస్తే ఏమి వస్తుందన్న అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలను సంధించి వారి చేత సమాధానం రాబడుతుంటారు. గణితం అంటే విద్యార్థులు ఎంతో భయపడుతుంటారని, ఆ భయం పోగొట్టేందుకు గణితం ఎంతో సులభం అని విద్యార్థులకు అవగాహన కలిగించేలా చేయడమే తన లక్ష్యం అని కొత్త రామానుజం వివరించారు.
90 శాతం వినికిడి సమస్యతో చదువులో నేను ముందుకు వెళ్తుంటే ఎంతో మంది నన్ను చూసి నవ్వుకునే వారు. ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినబడక ఎంతో ఇబ్బంది పడ్డాను. సొంతంగా చదువుకుని ఉద్యోగం సాధించాలని ముందుకు సాగి విజయం సాధించాను. రామానుజన్ జన్మదినాన్ని గణిత దినోత్సవంగా కాకుండా జీఎఎన్ఐటీ వీక్ గా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈ జీఎఎన్ఐటీ అనగా సంఖ్యా శాస్త్రంలోని అమరికలపై విద్యార్థులకు ఆసక్తిని పెంచుటకు శిక్షణ ఇచ్చుట.
– రామానుజం, గణిత ఉపాధ్యాయుడు
అన్నింటికీ మూలం.. గణితం
నర్సాపూర్: సమాజంలో అన్నింటికి గణితం మూలమని నర్సాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు సామ్యానాయక్ చెప్పారు. మనిషి నిత్య జీవితం గణితంతో ముడి పడి ఉంటుందని, ప్రతి ఘడియ, ప్రతి కదలికలో గణితం ఉంటుందన్నారు. తమకు తెలియకుండానే మనుషులు తమ దిన చర్యలో గణితాన్ని వాడుతారని ఆయన చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు గణితంతో ముడిపడి ఉంటాయని ఆయన చెప్పారు. కాగా గణితానికి ప్రాధాన్యత తరగనిదన్నారు. గణితంలో చురుకుగా ఉండే వారు ఇతర అన్ని సబ్జెక్టులలో చురుకుగా ఉంటారన్నారు. శాస్త్రవేత్తలు చేపట్టే ప్రయోగాలలో గణితానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలు, సాధారణ వ్యక్తులతో పాటు అన్ని రంగాల వ్యక్తుల దినచర్య గణితంతో ముడిపడి ఉంటుందని సామ్యానాయక్ చెప్పారు. గణితం లేనిదే అభివృద్ధి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
– సామ్యానాయక్, మ్యాథ్స్ టీచర్, నర్సాపూర్
ప్రత్యేక శైలితో, విభిన్న రీతిలో..
సిద్దిపేటలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి అంటే ఆ పాఠశాల విద్యార్థులకు చాలా ఇష్టం. ఎందుకంటే గణితం అంటే భయం ఉండే విద్యార్థుల్లో ఈ ఉపాధ్యాయుడు ఇట్టే భయం పొగోట్టేస్తాడు. వారితోనే సమస్యలకు సాధనలు సాధించేలా చేస్తాడు. కేవలం బోర్డు పైనే కాకుండా విద్యార్థులను మౌఖికంగా గణితం నేర్చుకునేలా చేయడంలో కృషి చేస్తున్నాడు. ఈ పాఠశాల నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో అధిక మంది విద్యార్థులకు గణితంలో 10 జీపీఏ సాధించటంలో లక్ష్మారెడ్డిది కీలక పాత్ర. కరోనా వైరస్ నేప«థ్యంలో ఆన్లైన్ లో విద్యార్థులకు గణిత పాఠాలు చెబుతున్నారు. వీరి సేవలను గుర్తించిన రాష్ట్ర ఆర్థికశాఖ మాత్యులు హరీశ్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా సాక్షి పలుకరించగా..ముందుగా గణితం అంటే భయం ఉండకూడదని అంటారు. విద్యార్థులతో మిత్రుల వలే ఉంటు వారికి భోధన చేయాలంటారు. ముఖ్యంగా మనం నిత్యం గృహల్లో చేసే లెక్కలను మౌఖికంగా విద్యార్థులచే చేయించాలి. ఇదే విధంగా సులువు నుంచి∙ఘటువు వరకు రావాలి. దీంతో విద్యార్థుల్లో భయం అనేది ఉండదంటారు.
భయంతో కాదు.. ఇష్టంగా చేయాలి
గణితం అనేది చేయడం ద్వారా నేర్చుకునేది. పూర్ణభావనలపై ఆధారపడి ఉండడం వలన చాలామంది విద్యార్థులు ఈ గణితం అంటే భయపడుతున్నారు. గణిత భావనలను కృత్యాల ద్వారా, వీడియోస్ ద్వారా, డిజిటల్ కంటెంట్ ద్వారా నేర్చుకుంటే సులువుగా అర్థమవుతుంది. ముఖ్యంగా గణిత కృత్యాలు, ఫజిల్లు, ముఖ్యమైన ప్యాటర్న్లు, సుత్రాలు, ఆవిష్కరణల గురించి ముందుగా నేర్చుకుంటే గణితం ఇట్టే అర్థమవుతుంది. ఉపాధ్యాయులు ఉత్తమంగా బోధిస్తే..విద్యార్థికి మంచి సాధన ఉండాలి. ఈ విధంగా ఉంటే విద్యార్థులు గణితంలో అధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
– అజయ్‌కుమార్‌రెడ్డి, గణిత ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూకునూరుపల్లి
ఉపాధ్యాయుల సహకారంతో..
ఉపాధ్యాయుల సహకారంతో మండల, జిల్లా స్థాయి గణిత పోటీలలో పాల్గొన్నాను. ట్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించడానికి ఈ అనుభవం ఎంతగానో తోడ్పడింది. ఉపాధ్యాయులు చెప్పే అంశాల పట్ల శ్రద్ధ వహించడం వలన ఎలాంటి విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు అందించిన సహకారం వలనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.
– కార్తీక్, ట్రిపుల్ ఐటీ బాసర (మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థి)
శాస్త్రాలన్నింటికీ ఆధారం..
దౌల్తాబాద్(దుబ్బాక): నెమళ్ళకు శిఖల వలే, పాములకు మనుల వలే, వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సు గణితం. 20వ శతాబ్దపు గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ అగ్రగణ్యుడు. రామానుజన్‌కు గురువు, దైవం, మిత్రులు సర్వం గణితంగానే భావించి జీవించారు. గణిత శాస్త్రంలో వీరు చేసిన కృషికి గాను 2012వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రామానుజన్ జన్మదినాన్ని జాతీయ గణితశాస్త్ర∙దినోత్సవంగా ప్రకటించారు. గణిత శాస్త్ర అభ్యాసనం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, ఏకాగ్రత, వేగం, కచ్ఛితత్వం, మానసిక క్రమశిక్షణ కలుగుతాయి. గణితంపై విద్యార్థులకు ఆసక్తి పెంచడానికి గణిత దినోత్సవం ఎంతగానో తోడ్పడుతుంది. గణితా క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు, నాటకాలు ప్రదర్శించి విద్యార్థులు గణితంపై అభిమానాన్ని చాటుకుంటారు.
– సత్యప్రమోద్, పీజీటీ మ్యాథ్స్, మోడల్ స్కూల్ దౌల్తాబాద్
రేఖా గణితం, గ్రాఫ్‌లపై శ్రద్ధ వహించాలి
బెజ్జంకి(సిద్దిపేట): ప్రశ్న: మ్యాథ్స్‌లో మంచి మార్కులు ఎలా సాధించాలి?
జవాబు: కరోనా నేపథ్యంలో తగ్గించిన సిలబస్‌పైన అవగాహన అవసరం. ప్రశ్నాపత్రాన్ని అధ్యయనం చేసి ప్రశ్నల సరళిని గమనించాలి. ముఖ్యంగా గ్రాఫ్ సమస్యలు, రేఖా గణితంలోని నిర్మాణాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
ప్రశ్న: గణితానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?
జవాబు: భవిష్యత్తులో గణితానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి కాంపిటీషన్ పరీక్షలలోను గణితం తప్పనిసరి. అరిథమేటిక్స్, జనరల్ ఇంటెల్లిజెన్స్, మెంటల్ ఎబిలిటీ, డేటా ఎనాలసిస్లాంటి అనేక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. గణితంలో రాణిస్తే అన్ని రంగాలలో విజయం సాధించవచ్చు.
– హరికృష్ణ, మ్యాథ్స్ టీచర్, వడ్లరు బేగంపేట పాఠశాల
భయం పోగొట్టాలి
వట్పల్లి(అందోల్): ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు గణితంపై భయం లేకుండా చేయాలి. అందుకు చతుర్విత ప్రక్రియల్లో కృత్యాల ద్వారా బోధన చేయాలి. పరిసరాల్లో లభించే వస్తువులను టీఎల్ఎంగా ఎంపిక చేసుకొని విద్యార్థి స్వేచ్ఛగా నేర్చుకునేలా ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడిగా ఉంటూ బోధన చేయాలి.
– నవీన, గణిత ఉపాధ్యాయురాలు, వట్పల్లి
గణితం.. నిత్య జీవితంలో భాగమే
కొండాపూర్(సంగారెడ్డి): గణిత అభ్యసనాన్ని కేవలం మార్కులు తెచ్చుకోవడమే కాకుండా పాఠశాల బయట, నిజజీవితంలో ఎన్నో సందర్భాల్లో గణితం ఉపయోగపడేలా బోధన చేయాలన్నారు. గణిత బోధన కేవలం మూస పద్ధతిలో కాకుండా ప్రయోగాత్మకంగా బోధన చేయడం ద్వారా విద్యార్థులకు గణితంపై ఆసక్తి కలుగుతుంది. ప్రాథమిక భావనలు, సూత్రాలపై అవగాహన చేసుకొని వాటిపై పట్టు సాధించడంతో మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫజిల్స్, క్విజ్లు, ఒలంపియాడ్‌లు వంటి పోటీలలో పాల్గొనే విధంగా గణిత ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. దీంతో గణితం అంటే భయం పోవడంతో పాటు ఆసక్తిగా గణితం సబ్జెక్టును ఇష్టపడతారు.
– రామానుజన్, గణిత ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్ఎస్ ఘనాపూర్
గణిత క్లబ్ నిర్వహణ వల్లే..
మా పాఠశాలలో నిర్వహించిన గణిత క్లబ్ మూలంగా నాకు గణితంపై ఆసక్తి ఏర్పడింది. ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా లభిస్తుంది. మా ఉపాధ్యాయులు నిరంతరం గణిత అభ్యాసనం పట్ల ఆసక్తిని పెంచేలా బోధించడం వలన గణితం అంటే భయం తొలగిపోయింది. ఇప్పుడు ఎలాంటి విషయాన్నైనా అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నాను.
– శివాణి, 9వ తరగతి విద్యార్థిని మోడల్‌స్కూల్
గణితంపై ఇష్టం పెరిగింది..
మొదటి నుంచి మా పాఠశాలలో ఉపాధ్యాయులు గణితాన్ని సులువుగా అర్థమయ్యేలా బోధించేవారు. ఫజిల్స్, క్విజ్, టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించడం వలన గణితంపైన భయం పోయి ఇష్టం పెరిగింది. ఉపాధ్యాయులు చెప్పిన విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల పదో తరగతిలో 10 జీపీఏ సాధించడమే కాకుండా పాలిటెక్నిక్‌లో రాష్ట్ర స్థాయిలో 600 ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మకమైన మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీఈలో సీటు సాధించాను. ఇవే కాకుండా అగ్రికల్చర్ పాలిసెట్, ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలోను మంచి ర్యాంకు సాధించాను. ఇవన్నీ గణితం పైన ఇష్టం వల్లనే సాధ్యమయ్యాయి.
– చిప్ప సాత్విక, ఈసీఈ, మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల