![In Maharashtra A Teacher Insert Wooden Cane Into A 2nd Class Student Throat - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/14/exam.jpg.webp?itok=pjHcvJFd)
అహ్మద్‌నగర్, ముంబై : లెక్కలు సరిగా చేయలేదనే ఆగ్రహంతో విద్యార్థి గొంతులో కర్ర ముక్క (బెత్తం) ను దూర్చాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన మహారాష్ట్ర కర్జత్ జిల్లాలోని పింపల్‌గాన్ జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. రోహన్ డీ జంజీర్(8) జిల్లా పరిషత్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో లెక్కల మాష్టారుగా పని చేస్తున్న చంద్రకాంత్ సోపాన్ షిండే ఓ లెక్క చేయమని రోహన్‌కు ఇచ్చాడు. కానీ రోహన్ ఆ లెక్కను చేయలేకపోయాడు.
దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చంద్రకాంత్.. రోహన్ నోటిలోకి కర్రను దూర్చాడు. దాంతో రోహన్ ఆహార, వాయు నాళాలు దెబ్బతిన్నాయి. నొప్పిని తట్టుకోలేని రోహన్ నేలమీద పడిపోయాడు. విద్యార్థి నోటి నుంచి రక్తం కారసాగింది. ఇది చూసిన పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడ కింది పడివున్న రోహన్‌ని స్కూల్ యాజమాన్యం హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆస్పత్రి వారు రోహన్‌ని పూణేకి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
ప్రస్తుతం అతడు పూణెలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. రోహన్ తల్లి సునితా జంజీరే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఉపాధ్యాయుడిని అరెస్టు చేయలేదు. రోహన్ కోలుకున్నాక అతని వాంగ్మూలాన్ని తీసుకుని, ఆ తర్వాత ఉపాధ్యాయుడిని అరెస్టు చేస్తామని కర్జత్ పోలీసు స్టేషన్ అధికారి ఎస్‌బీ మిత్రే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment