
థానె: హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు తీయమని విద్యార్థిని ఆదేశించిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానె జిల్లాలోని మీరా రోడ్డు ఏరియా శాంతినగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక థానె జిల్లా పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఆమె తన ట్యూషన్ టీచర్ ఇచ్చిన హోంవర్క్‌ను పూర్తి చేయలేకపోయింది. దీంతో టీచర్ ఆ విద్యార్థినిని ఏకంగా 450 గుంజీలు తీయమని ఆదేశించింది. బాలిక సరిగ్గా నడవలేకపోతుండటంతో పాటుగా రెండు కాళ్లు వాచిపోయి ఉండటాన్ని తల్లి గుర్తించింది. దీంతో ఆమె తల్లి పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం టీచర్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోహెల్ పఠాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment