ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
విద్య, నైపుణ్యాలపై భారత్ - ఆస్ట్రేలియా ఒప్పందం
విద్య, నైపుణ్యాల రంగంలో సహకరించుకునేందుకు భారత్ - ఆస్ట్రేలియాలు నవంబర్ 29న న్యూఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ బెర్నార్డ్ ఫిలిప్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఎం.ఎం. పల్లంరాజు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఏర్పాటైన భారత్ - ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి అన్ని స్థాయిల్లో కార్యాచరణను రూపొందిస్తుంది.
2022 నాటికి భారత్ 500 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చే దశాబ్దాల్లో ప్రతి ఏటా 12 నుంచి 15 మిలియన్ల మంది మానవ వనరులను భారత్ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నాణ్యతతో కూడిన శిక్షణ, ప్రమాణాలను ఆస్ట్రేలియా అందిస్తుందని బెర్నార్డ్ ఫిలిప్ తెలిపారు. ఈ సంఖ్య 2011లో 2.3 మిలియన్లు.
యునిసెఫ్ రాయబారిగా టెండ్కూలర్
క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నియమితులయ్యారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో యునిసెఫ్ ప్రచార కార్యకర్తగా సచిన్ వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రంపై యునిసెఫ్ దక్షిణాసియా ప్రాంతీయ డెరైక్టర్ కరీన్ హుల్‌షోప్ సమక్షంలో నవంబర్ 21న టెండ్కూలర్ సంతకం చేశారు. సబ్బుతో చేతులు కడుక్కునే అలవాటుపై తన శాయశక్తులా ప్రచారం చేస్తానని సచిన్ అన్నారు. దక్షిణాసియాలో అత్యధికంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగుతున్నాయని కరీన్ హుల్‌షోప్ తెలిపారు.
ఇఫి చిత్రోత్సవం అవార్డులు
44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు (ఇఫి) పనాజీలో నవంబర్ 30న ముగిశాయి.
అవార్డులు:
ఉత్తమ చిత్రానికిచ్చే బంగారు నెమలి: తూర్పు తైమూర్ నిర్మించిన తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’కు దక్కింది. దీనికి బెటిరీస్ దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద రూ.40 లక్షలు బహూకరించారు.
వెండి నెమలి అవార్డు: మెగే దాకా తారా
(బెంగాలీ, దర్శకత్వం: కమలేశ్వర్ ముఖర్జీ)
ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ
(చిత్రం: అపూర్ పాంచాలి)
ఉత్తమ నటుడు: అలోన్ మోని అబేత్‌బేల్
(చిత్రం: ఎ ప్రెస్ ఇన్ హెలెన్)
ఉత్తమ నటి: మగ్దలెనా బోక్‌జరాస్కా
(చిత్రం: ఇన్‌హైడింగ్)
పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ ఐ.కె. శర్మ (ఇంగువ కార్తికేయ శర్మ) (76) హైదరాబాద్‌లో నవంబర్ 28న మరణించారు. ఆయన పురావస్తు శాస్త్రంలోనే కాకుండా కళలు, ఆర్కిటెక్చర్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ వంటి విషయాల్లో కూడా పేరొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున కొండ, గుడిమల్లామ్, అమరావతి, గుంటుపల్లి, పెదవేగి, రాజస్థాన్‌లోని కాలీభంగం, తమిళనాడులోని పైయాంపల్లి, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని సుర్‌కోడ్తా ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అనేక పుస్తకాలు ప్రచురించారు.
తుది తీర్పు ప్రకటించిన కృష్ణా జలాల ట్రిబ్యునల్
కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ తన తుది తీర్పును నవంబర్ 29న వెలువరించింది. ఈ తీర్పు 2050 వరకు అమలులో ఉంటుంది.
తీర్పు ప్రధానాంశాలు:
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది.
మిగులు జలాలపై ఉన్న హక్కును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఎగువ రాష్ట్రాలకు వాటా లభించింది.
ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది.
2010, డిసెంబర్ 30న ఇచ్చిన మధ్యంతర తీర్పులో ఈ కేటాయింపులు వరుసగా 1001 టీఎంసీలు, 911 టీఎంసీలు, 666 టీఎంసీలు ఉన్నాయి.
65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2578 టీఎంసీల నీటిని మూడు రాష్ట్రాలకు పంచింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీల నీటిని పంపిణీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ లభ్యత ఉంటే ఆ మేరకు మిగిలిన నీటిని ఎగువ రాష్ట్రాలు విడుదల చేయాలి.
నీటి వాడకంపై పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు చేస్తారు.
కర్ణాటకకు 173, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించింది.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 811, కర్ణాటక 734, మహారాష్ట్రలకు 585 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది.
సహజీవనం నేరం కాదన్న సుప్రీంకోర్టు
సహజీవనం నేరం కాదని సుప్రీంకోర్టు నవంబర్ 28న తీర్పులో పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళలకు, వారికి పుట్టే పిల్లలకు భద్రత, రక్షణకు చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును కోరింది. వివాహబంధాల్నే కాకుండా సహజీవనానికి గుర్తింపునివ్వాలని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను ప్రోత్సహించడం లేదని కూడా తెలిపింది. భరణం ఇప్పించాలంటూ సహజీవనం చేసిన మహిళ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది.
డా.సుబ్బన్న అయ్యప్పన్‌కు నాయుడమ్మ అవార్డు
ప్రముఖ శాస్త్రవేత్త ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్‌చ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్‌కు ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2014ను అందజేయనున్నట్లు నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎ.జగదీష్ డిసెంబర్ 2న తెలిపారు.
విప్లవకవి మండే సత్యం మృతి
విప్లవ కవి మండే సత్యనారాయణ (80) హైదరాబాద్‌లో నవంబర్ 27న మరణించారు. ఆయన పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో 100కు పైగా విప్లవ గీతాలు రాశారు. ఎర్ర సైన్యం, చీమల దండు సినిమాలకు పాటలు రాశారు.
అంతర్జాతీయం
మూన్ రోవర్‌ను ప్రయోగించిన చైనా
చంద్రుడిపై పరిశోధనకు చైనా తన మొదటి రోవర్‌ను డిసెంబర్ 1న ప్రయోగించింది. చాంగె-3 రాకెట్ ద్వారా ‘జడే రాబిట్’ అని పిలిచే రోవర్‌ను క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి పంపింది. ఈ రోవర్ డిసెంబర్ మధ్యలో చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడి ఉపరితలం, అక్కడి సహజ వనరులపై సమాచారం సేకరిస్తుంది. ఇది చంద్రుడిపైకి పంపిన మూడో లూనార్ రోవర్. గతంలో అమెరికా, రష్యాలు ఇటువంటి రోవర్లు పంపాయి.
దుబాయ్‌లో 2020 వరల్డ్ ఎక్స్‌పో
వరల్డ్ ఎక్స్‌పో-2020కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు నవంబర్ 28న జరిగిన బిడ్డింగ్‌లో దుబాయ్‌కు 116 ఓట్లు వచ్చాయి. రష్యాలోని ఎకటెరిన్ బర్గ్ 47 ఓట్లు మాత్రమే సాధించింది. పారిస్‌లో జరిగిన ఓటింగ్‌లో 168 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 6.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగం వ్యయం కలుపుకుంటే ఇది 18.3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 438 హెక్టార్లలో భారీ నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. 2,77,000 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ఈ ఎక్స్‌పో నిర్వహిస్తారు. 2015లో మిలాన్‌లో ఈ ఎక్స్‌పో జరుగుతుంది. చివరగా షాంఘైలో జరిగింది.
మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానానికి యూఎన్ ఆమోదం
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కమిటీ తొలిసారిగా మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానాన్ని నవంబర్ 27న ఆమోదించింది. మహిళా హక్కు పరిరక్షకులపై జరిగే హింసాత్మక చర్యలను దేశాలు బహిరంగంగా ఖండించాలని, వారిని అడ్డుకునే చట్టాలను సవరించాలని, వారికి ఐక్యరాజ్యసమితి సంస్థల్లో అవకాశాలు కల్పించాలని ఈ తీర్మానం పేర్కొంటోంది.
ఎయిడ్స్ సంబంధిత రోగంతో 2.1 లక్షల మంది పిల్లల మృతి
గత ఏడాదిలో ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2,10,000 మంది బాలలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) తన నివేదికలో తెలిపింది. హెచ్‌ఐవి వ్యాధితో బాధపడే చిన్నారుల్లో 34 శాతం మంది తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలు 10-19 సంవత్సరాల వయసువారిలో 2005-2012 మధ్యకాలంలో 50 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. 2005-12మధ్య కాలంలో పిల్లల్లో 8.5 లక్షల మందికి ఈ వ్యాధి సోకకుండా అరికట్టినట్టు నివేదిక పేర్కొంది.
గూఢచారం వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ వ్యక్తిగత జీవన హక్కు (రైట్ టు ప్రైవసీ) తీర్మానాన్ని నవంబర్ 26న ఆమోదించింది. జర్మనీ, బ్రెజిల్ ఒత్తిడితో ఈ తీర్మానం తీసుకొచ్చారు. జర్మనీ, బ్రెజిల్ నాయకులపై అమెరికా నిఘా పెట్టిందన్న వార్తలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ తీర్మానం కింద ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ అధిపతి నవనీతం పిళ్లై దేశీయ, దేశీయేతర ప్రైవసీపై నివేదిక తయారు చేస్తారు. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, రష్యా, ఉత్తర కొరియాతోపాటు 55 దేశాలు మద్దతునిచ్చాయి.
పాకిస్థాన్ సైన్యాధిపతిగా రహీల్ షరీఫ్
పాకిస్థాన్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ (57) నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ స్థానంలో షరీఫ్ నవంబర్ 29న బాధ్యతలు చేపట్టారు.
క్రీడలు
పి.వి.సింధుకు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్
మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. మకావులో డిసెంబర్ 1న జరిగిన ఫైనల్‌లో కెనడాకు చెందిన మిచెల్లి లీని ఓడించింది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో గ్రాండ్ ప్రి టైటిల్. గత మేలో మలేషియా ఓపెన్ టైటిల్ సాధించింది.
బుల్లర్‌కు ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్
ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గగన్‌జిత్ బుల్లర్ గెలుచుకున్నాడు. డిసెంబర్ 1న జకార్తాలో జరిగిన పోటీలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో బుల్లర్‌కు ఇది మొదటి టైటిల్. కాగా ఇండోనేషియాలో రెండో టైటిల్.
కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 117 పతకాలు
మలేషియాలోని పెనాంగ్‌లో నవంబర్ 30న ముగిసిన కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 117 పతకాలు లభించాయి. ఇందులో 57 స్వర్ణం, 39 రజతం, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. ఉత్తమ లిఫ్టర్ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల్ వెంకట్ రాహుల్‌కు దక్కింది. రాహుల్ మొత్తం ఆరు స్వర్ణ పతకాలు గెలిచాడు. జూనియర్, యూత్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. భారత్ యూత్ బాయ్స్, గర్ల్స్, జూనియర్ మెన్, ఉమెన్, సీనియర్ మెన్ విభాగాల్లో టీమ్ టైటిల్స్ సాధించింది. సీనియర్ ఉమెన్ విభాగంలో రన్నరప్ ట్రోఫీ దక్కింది.
కరణ్ ఠాకూర్ రికార్డు
సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను పది వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశారు.
శ్రీజకు స్వర్ణం
భారత్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఇరాన్‌లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. నవంబర్ 30న జరిగిన సింగిల్స్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన బరవోక్‌ను ఓడించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
వసీం జాఫర్ రికార్డు
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మెన్‌గా ముంబై బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ రికార్డులకెక్కాడు. నవంబర్ 27న విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఈ ఘనతను సాధించాడు. ఇంతకుముందు గవాస్కర్, సచిన్, ద్రవిడ్, విజయ్ హజారే, వెంగ్‌సర్కార్, లక్ష్మణ్, అజహర్ ఈ జాబితాలో ఉన్నారు.
వన్డే సిరీస్ విజేత భారత్
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కాన్పూర్‌లో నవంబర్ 27న జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్ భారత్ వశమైంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా విరాట్ కోహ్లి ఎంపిక య్యాడు.