కరెంట్ అఫైర్స్ | bhavita Current Affairs-Competitive Guidance-22-08-13 | Sakshi
Sakshi News home page

కరెంట్ అఫైర్స్

Published Thu, Aug 22 2013 4:13 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

bhavita Current Affairs-Competitive Guidance-22-08-13

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
 
 
అంతర్జాతీయం
 
 ఈజిప్టులో 525 మంది నిరసనకారుల మృతి


 ఈజిప్టు సైన్యం అణచివేత చర్యలకు నిరసనగా వీధుల్లో చేరిన వేలాది మంది ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ కార్యకర్తలపై ఆగస్టు 15న సైన్యం జరిపిన దాడుల్లో 525 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. అయితే 2600 మంది మరణించినట్లు 10 వేల మంది గాయపడినట్లు ముస్లిం బ్రదర్‌హుడ్ తెలిపింది. జూలై 3న అధ్యక్షుడు మోర్సీని సైన్యం అధికారం నుంచి తొలగించి, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసింది. దీంతో మోర్సీకి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ కార్యకర్తలు తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టారు. నిరసనలు అణచి వేసేందుకు సైన్యం చర్యలు చేపట్టింది. ఆగస్టు 14న దేశంలో నెల రోజులపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు ఎల్ బరాదీ పదవికి రాజీనామా చేశారు. సైన్యం మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వ చర్యలను అనేక పశ్చిమ దేశాలు ఖండించాయి.
 
 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా మైకేల్ జొతోడియా


 తిరుగుబాటు నాయకుడు మైకేల్ జొతోడియా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్) కొత్త అధ్యక్షుడిగా ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేశారు. ‘సెలెకా’ తిరుగుబాటు సంకీర్ణానికి ఆయన నాయకుడు. సుదీర్ఘకాలం పాలన సాగిస్తున్న ప్రాంకోసిస్ బూజీజెను మార్చిలో అధికారం నుంచి తొలగించి తనకు తానే అధ్యక్షుడిగా జొతొడియా ప్రకటించుకున్నాడు.
 
 
 జాతీయం
 జన్యుమార్పులతో క్లోమగ్రంధి వ్యాధి


 క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కి జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణం. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పాంక్రియాటైటిస్‌కు గల కారణాలపై 25 దేశాలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు, నిపుణులతో చేసిన సంయుక్త పరిశోధన ఫలితాలను లండన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ తాజా సంచికలో ప్రచురించింది. ఈ పరిశోధనల్లో కీలక భూమిక పోషించిన సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆగస్టు 18న హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు. మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించేవారు. అయితే జన్యుపరమైన మార్పులూ ఇందుకు కారణమని వారు చేసిన పరిశోధనలో తేలింది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా షుగర్‌ను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడం క్లోమం ప్రధాన విధులు. ఇది పనిచేయకపోతే మధుమేహం (షుగర్ వ్యాధి) వస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కాకపోవడంవల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.
 
 ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పేరు సిఫారసు
 ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పేరును భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. రెండువారాల్లోగా నియామకం జరగవచ్చని కేంద్ర న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ రమణ


 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతరాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. 2000, జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
 
 అమీర్‌ఖాన్‌కు ఉర్దూ యూనివర్సిటీ డాక్టరేట్


 హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకునేవారిలో అమీర్‌ఖాన్‌తోపాటు సచార్ కమిటీ చైర్మన్ జస్టిస్ రాజేంద్ర సచార్ కూడా ఉన్నారు. యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవం సందర్భంగా ఆగస్టు 24న వీరికి డాక్టరేట్లు ప్రదానం చేస్తారు.
 
 జీఎస్‌ఎల్‌వీ-డీ 5 ప్రయోగం వాయిదా


 జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - డీ 5 (జీఎస్‌ఎల్‌వీ-డీ5) ప్రయోగం వాయిదా పడింది. ఆగస్టు 19న శ్రీహరికోట నుంచి సాయంత్రం 4.50 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగ వాహన నౌక రెండో దశలో ద్రవ ఇంధనంలో లీకేజి ఏర్పడింది. ఈ వాహక నౌక ద్వారా 1982 కిలోల సమాచార ఉపగ్రహం జీశాట్-14ను 36,000 కిలోమీటర్ల దూరంలోని మధ్యంతర భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. 49.13 మీటర్ల ఎత్తు, 414.75 టన్నుల బరువు గల జీఎస్‌ఎల్‌వీలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మూడో దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్‌లో ద్రవ హైడ్రోజన్, ఆక్సిజన్‌లను వాడారు. ప్రస్తుతం జరిపేది ఎనిమిదో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం. మొదటి ఆరు ప్రయోగాలకు రష్యా అందించిన క్రయోజనిక్ ఇంజన్లు వాడారు. 2010 జూలై 10న జరిపిన ఏడో ప్రయోగంలో స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వాడారు. ఇది విఫలమైంది. ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను భూ స్థిర కక్ష్యలోకి ప్రయోగించేందుకు క్రయోజనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. పీఎస్‌ఎల్‌వీలు 1.5 టన్నుల ఉపగ్రహాలను మాత్రమే మోసుకుపోగలవు. ప్రస్తుత క్రయోజనిక్ టెక్నాలజీ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనాలు మాత్రమే కలిగి ఉన్నాయి.
 
 పేలుళ్లతో మునిగిపోయిన సింధురక్షక్ జలాంతర్గామి


 ఐఎన్‌ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో ఆగస్టు 13న వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ముంబై కొలాబా డాక్‌యార్డ్‌లో ఉన్న సింధు రక్షక్ సగం వరకు మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో అందులో ఉన్న మొత్తం 18 మంది సిబ్బంది మరణించినట్లు భావిస్తున్నారు. ఈ జలాంతర్గామిలో టోర్పడోలు, క్షిపణులు ఉన్నాయి. 2010, ఫిబ్రవరిలో హైడ్రోజన్ లీకేజీ వల్ల సింధు రక్షక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సిబ్బందిలో ఒకరు మరణించారు. డీజిల్ - ఎలక్ట్రిక్ జలాంతర్గామి సింధు రక్షక్‌ను రష్యా నిర్మించింది. రు.400 కోట్లతో కొనుగోలు చేసిన ఈ జలాంతర్గామిని 1997లో భారత నౌకా దళంలో చేర్చారు. దీన్ని 2010లో ఆధునికీకరణకు రష్యాకు అప్పగించారు. రు.450 కోట్లతో ఆధునికీకరించిన సింధు రక్షక్‌ను రష్యా తిరిగి జనవరి, 2013లో భారత్‌కు అప్పగించింది. అణు సామర్థ్యం గల ఐఎన్‌ఎస్ చక్రతోపాటు భారత్ 15 జలాంతర్గాములను కలిగి ఉంది.
 
 ఏపీ పోలీసుకు అశోక్ చక్ర


 శాంతి సమయంలో ధైర్యసాహసాలకిచ్చే రెండో అత్యున్నత అవార్డు అశోక్ చక్ర మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వి.ప్రసాద్ బాబుకు దక్కింది. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. మరో ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. ఇవే కాకుండా 10 సౌర్య చక్ర అవార్డులతోపాటు మొత్తం 43 గ్యాలెంటరీ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు.
 
 
 క్రీడలు

రంజన్‌సోధికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న


 ఈ ఏడాదికి సంబంధించిన క్రీడా అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించింది. ప్రతిష్టాత్మక క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర ట్రాప్ షూటర్ రంజన్ సోధికి దక్కింది. సోధి 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెండు రజత పతకాలు, 2012 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు.
 
 అర్జున అవార్డులు:
    పేరు    క్రీడ
    విరాట్ కోహ్లీ    క్రికెట్
    చక్రవోల్ సువురో     ఆర్చరీ
    రంజిత్ మహేశ్వరి    అథ్లెటిక్స్
    పి.వి. సింధు    బ్యాడ్మింటన్
    కవితా చాహల్    బాక్సింగ్
    రూపేశ్ షా    స్నూకర్
    గగన్‌జిత్ బుల్లర్     గోల్ఫ్
    సాబా అంజుమ్    హాకీ
    రాజ్‌కుమారీ రాథోర్    షూటింగ్
    జోత్స్న చినప్ప    స్క్వాష్
    మౌమా దాస్    టేబుల్ టెన్నిస్
    నేహా రాతీ    రెజ్లింగ్
    ధర్మేంద్ర దలాల్    రెజ్లింగ్
    అభిజిత్ గుప్తా    చెస్
   అమిత్‌కుమార్ సరోహా    ప్యారాస్పోర్ట్స్


 పోల్‌వాల్ట్‌లో ఇసిన్ బయేవాకు స్వర్ణం


 మాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆగస్టు 13న రష్యా అథ్లెట్ ఎలీనా ఇసిన్ బయేవా పోల్‌వాల్ట్‌లో స్వర్ణం సాధించింది. ఆమె 4.89 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 2005, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కూడా స్వర్ణ పతకాలు సాధించింది.
 
 రిటైర్‌మెంట్ ప్రకటించిన బర్తోలి


 వింబుల్డన్-2013 చాంపియన్ మరియన్ బర్తోలి (28) టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆగస్టు 15న ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన బర్తోలికి వింబుల్డన్ మాత్రమే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆమె కెరీర్‌లో 2000 నుంచి ఏడు డబ్ల్యూటీఏ టైటిల్స్, ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.
 
 క్రికెట్ కోచ్ ఆజాద్ మృతి


 ప్రముఖ క్రికెట్ కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్ (75) మొహాలిలో ఆగస్టు 16న మరణించారు. ఆయన భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తోపాటు చేతన్ శర్మ, యోగ


 రాజ్‌సింగ్, అశోక్ మల్హోత్రాలకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయనను ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది.
 ఆసియా యూత్ క్రీడల్లో కుశ్‌కుమార్‌కు స్వర్ణం


 ఆసియా యూత్ గేమ్స్‌లో స్క్వాష్‌లో భారత క్రీడాకారుడు కుశ్‌కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. నాన్‌జింగ్ (చైనా) లో జరుగుతున్న పోటీల్లో ఆగస్టు 19న జరిగిన ఫైనల్స్‌లో మహ్మద్ కమల్ (మలేిషియా)ను కుశ్‌కుమార్ ఓడించాడు. ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. టేబుల్ టెన్నిస్‌లో అభిషేక్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు.
 
 ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో రష్యాకు మొదటి స్థానం


 ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఏడు స్వర్ణ పతకాలతో రష్యా మొదటిస్థానంలో నిలిచింది. మాస్కోలో ఆగస్టు 18న ముగిసిన పోటీల్లో రష్యా మొదటిస్థానంలో నిలవగా, అమెరికా, జమైకాలు రెండు, మూడు స్థానాలు పొందాయి.
 
 పతకాల పట్టిక (మొదటి ఐదు స్థానాలు)
 దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం
 రష్యా    7    4    6    17
 అమెరికా    6    13    6    25
 జమైకా    6    2    1    9
 కెన్యా    5    4    3    12
 జర్మనీ    4    2    1    7
 ముఖ్యాంశాలు: ఈ చాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్


 (జమైకా)100 మీటర్లు, 200 మీటర్లు, 4ణ100 మీటర్ల రేసుల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించాడు. 200 మీటర్లలో వరుసగా మూడోసారి స్వర్ణం సాధించాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మొత్తం ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించి ఈ ఘనత సాధించిన కార్ల్ లూయిస్, మైకేల్ జాన్సన్, అలిసన్ ఫిలిక్స్ (అమెరికా)ల సరసన చేరాడు. బోల్ట్ 2009లో 100 మీ, 200 మీ, 4ణ100 మీ, 2011లో 200 మీ, 4ణ100 మీ విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అబ్‌డెల్ కిప్రొస్ (కెన్యా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. మహిళల విభాగంలో షెల్లీ ఆన్ ఫ్రేజర్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆమె 100, 200 మీటర్ల రేసుల తోపాటు 4ణ100 మీటర్ల రిలేలో జమైకాకు స్వర్ణాలు సాధించిపెట్టింది.
 
 నాదల్, అజరెంకాలకు సిన్సినాటి టైటిల్స్


 సిన్సినాటి పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. సిన్సినాటిలో ఆగస్టు 19న జరిగిన ఫైనల్స్‌లో జాన్ ఇస్నర్ (అమెరికా)ను నాదల్ ఓడించాడు. మహిళల సింగిల్స్‌ను విక్టోరియా అజరెంకా (బెలారస్) గెలుచుకుంది. ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా) ను ఓడించింది. సిన్సినాటి టైటిల్‌ను గెలుపొందడం నాదల్, అజరెంకాలకు ఇదే తొలిసారి.
 
 కార్తికేయన్‌కు టైటిల్
 భారత ఫార్ములావన్ డ్రైవర్


 నారాయణ్ కార్తికేయన్... ఆటో జీపీ సిరీస్‌లో మూడో గెలుపును నమోదు చేశాడు. ఆగస్టు 17న హోరాహోరీగా సాగిన రేసులో కార్తికేయన్ టైటిల్ గెలుచుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement