విజయానికి ‘వర్తమానం’! | By following current Affairs can be only success in Civil Services Examination | Sakshi
Sakshi News home page

విజయానికి ‘వర్తమానం’!

Published Wed, Dec 31 2014 11:04 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

విజయానికి ‘వర్తమానం’! - Sakshi

విజయానికి ‘వర్తమానం’!

వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్).. ఉద్యోగార్థుల విజయానికి కీలక అస్త్రాలు! ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే సివిల్ సర్వీసెస్ పరీక్షనైనా.. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు వంటి మేలిమి ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు  ఉపకరించే గ్రూప్స్ పరీక్షల్లోనైనా విజయానికి ‘వర్తమానం’పై పట్టు సాధించాల్సిందే! ‘గ్లోబల్ గ్రామ’ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిందే!  ఇంతటి కీలకమైన కరెంట్ అఫైర్స్‌పై స్పెషల్ ఫోకస్..
 
 కరెంట్ అఫైర్స్‌లో సమకాలీన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ పరిణామాలుంటాయి. అంతర్జాతీయ అంశాల్లో వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారి వివరాలు, సదస్సులు, ఆందోళనలు, ద్వైపాక్షిక సంబంధాలు, కూటములు వంటి వాటిపై దృష్టిసారించాలి. జాతీయ అంశాల్లో రాజకీయ పరిణామాలు కీలకమైనవి. ఎన్నికలు, పార్టీల బలాబలాలు, కొత్తగా పదవులు చేపట్టిన నేతలు వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ రెండు చోట్ల పోటీ చేశారు.. వాటిలో ఒకటి వడోదర కాగా రెండోది ఏమిటి?. ఇలాంటి ప్రశ్నలు పోటీ పరీక్షల్లో ఎదురవుతాయి. నియామకాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు-వాటి చైర్మన్లు తదితరాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రీయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, ఆర్థిక సర్వేలోని అంశాలు, కొత్త నియామకాలు వంటివి ముఖ్యమైనవి.
 
 ఆర్థికం, శాస్త్రసాంకేతికం
 ఆర్థిక రంగానికి సంబంధించి బడ్జెట్, సామాజిక-ఆర్థిక సర్వేలలోని ప్రధాన అంశాలపై దృష్టిసారించాలి. బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాలు వంటివి ముఖ్యమైనవి. శాస్త్రసాంకేతిక రంగంలో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యమైన విభాగాలు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకలు కీలకమైనవి. రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి; ఐటీలో సూపర్ కంప్యూటర్లు, కొత్త ఆవిష్కరణలు ప్రధానమైనవి.
 
 వ్యక్తులు, అవార్డులు, క్రీడలు
 నియామకాలు, ఎన్నిక-ఎంపికల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అవార్డుల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ముఖ్యంగా నోబెల్, మెగసెసే, ఆస్కార్, భారత రత్న, పద్మ పురస్కారాలు ముఖ్యమైనవి. సాహిత్య, శాస్త్రసాంకేతిక అవార్డులపైనా అవగాహన అవసరం. క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలపై దృష్ట్టిసారించాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా, గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలు- విజేతలు, రికార్డులు, మొదటి స్థానంలో నిలిచిన దేశాలు వంటివి ముఖ్యమైనవి.
 
 వెయిటేజీ ఎంత?
     పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, డీఎస్సీ, పంచాయతీ కార్యదర్శి, ఎస్‌ఐ/పోలీస్ కానిస్టేబుల్, ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఎస్‌ఎస్‌సీ.. ఇలా ఏ పరీక్ష తీసుకున్నా వాటిలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. గతంలో గ్రూప్స్ జనరల్ స్టడీస్ పేపర్లలో కరెంట్ అఫైర్స్ నుంచి 30-35 వరకు ప్రశ్నలు అడిగారు. కొన్ని పరీక్షల్లో 10-20 వరకు ప్రశ్నలు వస్తున్నాయి.
 
 పట్టు సాధించడమెలా?
     ఓ అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరుచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవడాన్ని అలవరచుకోవాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కూడా సమర్థవంతంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం.
     కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతో పాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది.
     పత్రికలను చదవడం వల్ల కరెంట్ అఫైర్స్‌పై పట్టుతో పాటు వివిధ రంగాల(ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ..)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ. వీలైతే కరెంట్ అఫైర్స్‌ను అందించే వెబ్‌సైట్లను ఉపయోగించుకోవచ్చు.
     ఏ పరీక్షకైనా ఎన్ని నెలల సమాచారంపై దృిష్టిసారించాలనేది ఒక ప్రధానాంశం. సాధారణంగా రెండు నెలల ముందునుంచి ఏడాది వెనకకు వెళ్లాల్సి ఉంటుంది.
 - ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, కరెంట్ అఫైర్స్ నిపుణులు.
 
 ప్రాధాన్యం పెరుగుతోంది
 ఇటీవల కాలంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదలు గ్రూప్-4 వరకు అన్ని నియామక పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. డెరైక్ట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగా పేర్కొనే వార్తల్లో వ్యక్తులు, అవార్డులు వంటివే కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటుచేసు కుంటున్న తాజా పరిణామాలపైనా ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలే కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలోనూ కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ముగిసిన సివిల్స్ మెయిన్ పరీక్షను పరిగణనలోకి తీసుకుంటే రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు, భూసేకరణ చట్టం-2013 నుంచి ప్రశ్నలు వచ్చాయి. అంటే అభ్యర్థుల సమకాలీన అంశాల పరిజ్ఞానాన్ని లోతుగా పరీక్షిస్తున్నారు. కాబట్టి ఔత్సాహికులు కరెంట్ అఫైర్స్‌కు కూడా అధిక ప్రాధాన్యమివ్వాలి. ఈ ప్రిపరేషన్‌ను కూడా తులనాత్మకంగా ఉండేలా చూసుకుంటే తాము రాసే పరీక్షలో మెరుగైన ఫలితాలు ఖాయం.
 - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
 
 విజయానికి కీలకం... కరెంట్ అఫైర్స్
 నేటి పోటీ ప్రపంచంలో అనునిత్యం జరుగుతున్న పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ కీలక విభాగంగా మారింది. కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్న ప్రశ్నల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అంశాలను వాటి నేపథ్యానికి ముడిపెడుతూ పరోక్షంగా అడుగుతుండగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి పరీక్షలు, ఇతర నియామక పరీక్షల్లో నేరుగా అడుగుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆయా విధులు సమర్థంగా నిర్వహించడానికి కూడా కరెంట్ అఫైర్స్‌పై అవగాహన ఎంతగానో తోడ్పడుతుంది. సిలబస్‌లో మార్పులు-చేర్పులు వంటివి వర్తించని కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకుంటే ఆ స్థాయిలో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక.. కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదలవనున్న తరుణంలో ఔత్సాహికులు పరీక్షకు ఏడాది ముందుకాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకుంటే పోటీలో ముందంజలో నిలుస్తారు.
 - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement