ఆకేపాటి
శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
క్రీడలు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ నెంబర్‌వన్
ఆల్‌రౌండర్‌గా అశ్విన్
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అశ్విన్ 405 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ (362 పాయింట్లు), దక్షిణాఫ్రికాకు చెందిన కలిస్ (332 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారత్‌కు బహ్రెయిన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్స్
బహ్రెయిన్‌లో నవంబర్ 9న ముగిసిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు టైటిల్స్‌ను భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు.
పురుషుల సింగిల్స్: ఈ టైటిల్‌ను సమీర్‌వర్మ దక్కించుకున్నాడు. ఫైనల్‌లో సుభాంకర్ దేను ఓడించాడు.
మహిళల సింగిల్స్: తన్వీలాద్ గెలుచుకుంది. ఫైనల్‌లో సైలీ రాణిపై విజయం సాధించింది.
పురుషుల డబుల్స్: రూపేశ్‌కుమార్, సవానె థామస్ విజేతలుగా నిలిచారు. ఫైనల్‌లో నందగోపాల్, వి.దిజును ఓడించారు.
మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, ప్రద్న్యగాద్రే జోడి మహిళల డబుల్స్ టైటిల్ దక్కించుకున్నారు. ఫైనల్‌లో అపర్ణా బాలన్-సాన్యాగిత గోర్పడేలను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్: ఈ టైటిల్‌ను సనావె థామస్, ప్రజక్తా జంట గెలుచుకుంది. వీరు ఫైనల్‌లో సిక్కిరెడ్డి - దిజు జంటపై విజయం సాధించారు.
సిద్దీకుర్‌కు హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్
బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సిద్దీకుర్ హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన 50వ ఇండియన్ ఓపెన్ టైటిల్ విజేతగా సిద్దీకుర్ నిలిచాడు.
స్కేటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో
అనూప్ కుమార్‌కు స్వర్ణం
వరల్డ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనూప్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. చైనీస్ తైపీలో నవంబర్ 10న జరిగిన టోర్నీలో ఇన్‌లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో అనూప్ పసిడి నెగ్గాడు. ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
మహిళల రన్నరప్ భారత్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ పురుషుల టైటిల్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది. జపాన్‌లో నవంబర్ 11న జరిగిన ఫైనల్‌లో జపాన్‌ను ఓడించింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం, ఒమన్‌ను ఓడించి భారత్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. మహిళల టైటిల్‌లో జపాన్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత్‌పై నెగ్గింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం పొందింది.
ప్రపంచకప్ షూటింగ్‌లో హీనాకు స్వర్ణం
భారత షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. జర్మనీలో మ్యూనిచ్‌లో నవంబర్ 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2003లో అంజలి భగవత్, 2008లో గగన్ నారంగ్ తర్వాత ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారత వ్యక్తిగా హీనా రికార్డు సృష్టించింది.
జాతీయంమంగళయాన్‌ను
ప్రయోగించిన భారత్
అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన మంగళయాన్ ఆర్బిటర్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ25 రాకెట్ ద్వారా భారత్ ప్రయోగించింది. ఈ ప్రయోగానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎం.ఓ.ఎం)గా పేరుపెట్టారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ - సీ25 మార్స్ ఆర్బిటర్‌ను భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భూమి చుట్టూ 25 రోజులు పరిభ్రమిస్తుంది. తర్వాత అక్కడ నుంచి 300 రోజులపాటు 400 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది. అంగారకుడిపై జీవం ఆవిర్భావానికి ఆధారమైన మిథేన్ గురించి ఆర్బిటర్ అన్వేషిస్తుంది. ఒకప్పుడు ఉన్న నీరు ఎలా లేకుండా పోయిందో తెలుసుకుంటుంది. అంతేకాకుండా అంగారకుడి ఉపరితలంపై పరిస్థితులను, ఖనిజాలను, మూలకాలను అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధనల కోసం ఆర్బిటర్‌లో ఐదు పరికరాలను అమర్చారు. మంగళయాన్ విజయవంతంగా అంగారక కక్ష్యలోకి చేరుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా, తొలి ఆసియా దేశంగా భారత్‌కు గుర్తింపు లభిస్తుంది. ఇది భారత్ మొదటి గ్రహాంతర పరిశోధన. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే అంగారకుడిపై విజయవంతంగా ప్రయోగాలు చేశాయి. వివిధ దేశాలు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి.
పీఎస్‌ఎల్‌వీ-సీ25: భారత్ చేపట్టిన 25 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాల్లో 24 విజయం సాధించాయి. 1993లో తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-డీ1 విఫలమైంది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ-సీ25 ఉపగ్రహ వాహక నౌక 1337 కిలోల బరువు గల మార్స్ ఆర్బిటర్‌ను మోసుకెళ్లింది. 49.56 నిమిషాల్లో ఆర్బిటర్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి 450 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.
అగ్ని-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ప్రయోగ కేంద్రం నుంచి న వంబర్ 8న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 1000 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు.
హైదరాబాద్‌లో ప్రపంచ వ్యవసాయ సదస్సు
తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు - 2013 హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి నవంబర్ 4న దీన్ని ప్రారంభించారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం (డబ్ల్యుఏఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు రోజులపాటు సదస్సును నిర్వహించింది. సుస్థిర భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, సన్నకారు రైతులపై దృష్టి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. దేశ, విదేశాల నుంచి 400 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. 2050 నాటికి 1000 కోట్ల జనాభాకు ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. జనాభా అవసరాలకనుగుణంగా ఆహారోత్పత్తులు పెంచేందుకు ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంబించడం, చిన్న, సన్నకారు రైతులకు సహాయమందించడం, సాంకేతిక, వ్యవసాయ పరికరాలు వాడటం, ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు పెంచడం, వివిధ సంస్థల మధ్య భాగస్వామ్యం పెంచడం వంటి ఐదు విధానాలను పాటించాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆదాయాలవైపునకు మళ్లుతున్నవారిని అడ్డుకునేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూరించాలని డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ బోల్గర్ అన్నారు. చిన్నరైతులకు వ్యవసాయం ఆధారంగా కొనసాగాలంటే యాంత్రీకరణను ఒక పరిష్కారంగా పేర్కొన్నారు. సబ్సిడీలు చిన్నరైతులకు లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు.
నౌకాదళానికి ఆధునిక జెట్ ట్రైనర్ ‘హక్-132’
ఆధునిక జెట్ ట్రైనర్ (ఏజేటీ) ‘హక్ - 132’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నౌకాదళంలో చేర్చారు. నాలుగు ఏజేటీలను విశాఖపట్నంలోని తూర్పు నావల్ కమాండ్ బేస్ ఐఎన్‌ఎస్ డేగ వద్ద నౌకాదళాధిపతి డి.కె.జోషి నౌకాదళంలో ప్రవేశపెట్టారు. నాలుగో తరానికి చెందిన ఏజేటీ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. దీనికి ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, క్షిపణులు, రాకెట్లు, బాంబులు, తుపాకులు వంటి వాటిని చేర్చగల సామర్థ్యం ఉంది.
ఆహార పుస్తక రచయిత్రి తర్లా దలాల్ మృతి
ప్రముఖ ఆహార పుస్తక రచయిత్రి, పాక శాస్త్ర ప్రవీణురాలు తర్లా దలాల్ (77) నవంబర్ 6న ముంబైలో మరణించారు. ఆమె భారత తొలి మాస్టర్ చెఫ్‌గా గుర్తింపు పొందారు. వంటలపై 100 కు పైగా పుస్తకాలు రాశారు. 2007లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.
వ్యాపార రంగంలో శక్తిమంతమైన మహిళ చందా కొచర్
భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మ, క్యాప్‌జెమిని ఇండియా సీఈవో అరుణ జయంతి తర్వాత స్థానాల్లో నిలిచారు. 2013 సంవత్సరానికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది.
ఎల్‌ఐసీ ఎండీగా ఉషా సంగ్వాన్
దేశీయ అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కి మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉషా సంగ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సతీశ్‌రెడ్డికి హోమీ జే బాబా అవార్డు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన క్షిపణి అభివృద్ధి కేంద్రం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ డెరైక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. జమ్మూలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 03న జరగనున్న 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్మారకార్థం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి ఏటా ఈ అవార్డును అందిస్తోంది.
అంతర్జాతీయం
విశ్వసుందరిగా మారియా గాబ్రియెలా ఇస్లర్
మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) దక్కించుకుంది. నవంబర్ 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఫైనల్‌లో మొత్తం 85 మంది పాల్గొన్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్‌స్టాంజా నిలిచారు. టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్-
10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది. భారత్ నుంచి చివరిసారిగా 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికైంది.
హతాఫ్-9 క్షిపణిని పరీక్షించిన పాక్
హతాఫ్-9 క్షిపణిని పాకిస్థాన్ నవంబర్ 5న విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
బంగ్లాదేశ్‌లో మాజీ సైనికులకు మరణశిక్ష
2009 నాటి బంగ్లాదేశ్ సైనిక తిరుగుబాటు కేసులో 152 మంది మాజీ సైనికులకు ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నవంబర్ 5న మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ వద్ద 2009, ఫిబ్రవరి 25, 26న పారామిలిటరీ సిబ్బంది తిరుగుబాటు చేసి 74 మంది అధికారులను హత్య చేశారు. ఈ కేసులో కోర్టు 152 మందికి మరణశిక్ష, 158 మందికి యావజ్జీవం, 251 మందికి ఐదేళ్లవరకు జైలు శిక్ష విధించింది.
తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ ఎన్నిక
తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ నవంబర్ 13న తిరిగి ఎన్నికయ్యారు. దీంతో 20 ఏళ్లుగా పాలిస్తున్న ఆయన మరో ఏడేళ్లపాటు అధికారంలో కొనసాగుతారు. రఖ్మాన్ 1992 నుంచి తజికిస్థాన్‌ను పరిపాలిస్తున్నారు. 4 మిలియన్ల ఓట్లలో ఆయనకు 83.1 శాతం ఓట్లు దక్కాయి. ఎన్నికల ప్రచారంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం ఇస్లామిక్ రివైనల్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి.
భారత్ - చైనా సైనిక విన్యాసాలు
పది రోజులపాటు సాగే భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు నవంబర్ 5న చైనాలోని చెగ్దూ పట్టణ సమీపంలో ప్రారంభమయ్యాయి. ఇవి ఐదేళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్నాయి. ఇటీవల ఇరుదేశాలు సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో కౌంటర్ టైజంపై దృష్టిసారించి ఈ విన్యాసాలు చేపట్టారు.
కువైట్ ప్రధాని భారత్ పర్యటన
కువైట్ ప్రధానమంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ అహ్మద్ అల్ సబా తన భారత పర్యటనలో నవంబర్ 8న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తమ సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో భాగంగా పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, ఇంధన రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చలు జరిపాయి.
ఫిలిప్పీన్స్‌లో హైయాన్ తుఫాన్ విధ్వంసం
ఫిలిప్పీన్స్‌లో నవంబర్ 8, 9, 10 తేదీల్లో సంభవించిన తీవ్ర హైయాన్ తుఫాను వల్ల భారీ నష్టం జరిగింది. పదివేలమందికి పైగా మరణించారు. 44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. లైట్ ప్రావిన్స్‌లోని టాక్లోబాన్ పట్టణం అతలాకుతలం అయింది. తుపాన్ తీవ్రతకు లైట్, సమార్, విసాయాస్, బికోల్, మిండనాల్ ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. చైనా, వియత్నాంలపై కూడా తుపాన్ ప్రభావం పడింది.
మంగళయాన్ ప్రయోగం విజయవంతం
Published Thu, Nov 14 2013 4:49 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement