ప్లాస్టిక్ ఇంజనీరింగ్.. కెరీర్ షైనింగ్ | Plastic Engineering Career Shining .. | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ ఇంజనీరింగ్.. కెరీర్ షైనింగ్

Published Mon, Apr 27 2015 1:02 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

ప్లాస్టిక్ ఇంజనీరింగ్.. కెరీర్ షైనింగ్ - Sakshi

ప్లాస్టిక్ ఇంజనీరింగ్.. కెరీర్ షైనింగ్

దేశంలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ విభాగంలో శిక్షణనిచ్చే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ -2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కెరీర్ అవకాశాలు.. సిపెట్-జేఈఈ వివరాలు..
 
ప్లాస్టిక్ ఇంజనీరింగ్ నిపుణులు పాలిమర్స్ ఆధారంగా రూపొందించే వస్తువుల డిజైన్, మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియల్లో పాల్పంచుకుంటారు. ఇప్పుడు వినియోగదారుల దృక్పథం మారుతుండటం, తేలికపాటి వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది.
 
భారీగా అవకాశాలు
ప్రస్తుతం ఏటా 10 నుంచి 12 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంటున్న ప్లాస్టిక్ పరిశ్రమ.. 2017 చివరి నాటికి 14 శాతానికి చేరుకుంటుందని ప్లాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంచనా. అదే విధంగా 2018 చివరికి ప్లాస్టిక్ పరిశ్రమ రూ.1,37,000 కోట్ల మేర మార్కెట్ విలువ దక్కించుకుంటుందని ఫిక్కి తదితర సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంచనాలు, ప్రస్తుతం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులను బేరీజు వేస్తే వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంటుంది.
 
ఉపాధి వేదికలు
ప్లాస్టిక్ ఇంజనీరింగ్ నిపుణులకు ఉపాధి వేదికలుగా ఆటోమొబైల్ సంస్థలు; పెట్రోలియం ఉత్పత్తుల సంస్థలు; ఆర్ అండ్ డీ విభాగాలు నిలుస్తున్నాయి. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వరంగంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ తదితర సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రైవేటు రంగంలో ప్రతి ఉత్పత్తి పరిశ్రమలోనూ ప్లాస్టిక్ ఇంజనీర్లు అవసరమే.
 
డిప్లొమా నుంచి డాక్టోరల్ వరకు
 ప్రస్తుతం ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా నుంచి పోస్ట్ డాక్టోరల్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు తాము పూర్తిచేసిన కోర్సు ఆధారంగా కెరీర్ అవకాశాలు, వేతనాలు లభిస్తాయి. డిప్లొమా స్థాయి కోర్సు పూర్తిచేస్తే ప్రారంభంలోనే నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం అందుకోవచ్చు. ఆపై స్థాయి కోర్సులు పూర్తి చేస్తే ఎంపిక చేసుకున్న సంస్థ, హోదా ఆధారంగా భారీ స్థాయిలో వేతనాలు  ఉంటాయి.

బెస్ట్ కోర్సులకు కేరాఫ్ సిపెట్
ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సుల పరంగా బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ.. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. చెన్నై ప్రధాన క్యాంపస్‌గా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థకు హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న 23 క్యాంపస్‌ల ద్వారా పలు కోర్సులను అందిస్తోంది.
 
డిప్లొమా/పీజీ డిప్లొమా
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ; డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ; అర్హత: పదో తరగతి; కోర్సు వ్యవధి: మూడేళ్లు
పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ; పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్; పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్. అర్హత:బీఎస్సీ (ఎంపీసీ); కోర్సు వ్యవధి: ఏడాదిన్నర
 
బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
ప్లాస్టిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్
మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్ బీటెక్.
 
పీజీ కోర్సులు
ప్లాస్టిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీ; పాలిమర్ అండ్ నానో టెక్నాలజీ, క్యాడ్/క్యామ్; మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్, బయో పాలిమర్ సైన్స్‌లలో ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సులు. వీటిని సిపెట్ హై లెర్నింగ్ సెంటర్స్‌గా పేర్కొనే అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, లక్నో, కోచిలలో మాత్రమే అభ్యసించే అవకాశం ఉంటుంది.
 
షార్ట్ టర్మ్ కోర్సులు కూడా
 వీటితోపాటు సిపెట్ కేంద్రాలు ఉన్న సమీప ప్రాంతాల్లోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పలు షార్ట్ టర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 
సిపెట్ జేఈఈ - 2015: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అందించే బీఈ/బీటెక్; ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సిపెట్ జేఈఈ-2015 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివరాలు..
 
బీఈ/బీటెక్ కోర్సులు :  ప్లాస్టిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీ
అర్హత : ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ కోర్సులు:
 అర్హత: అభ్యర్థులు తాము దరఖాస్తు చేయదలచుకున్న సబ్జెక్ట్‌లతో బీటెక్ / బీఈ/ బీఎస్సీలో ఉత్తీర్ణత.
 
సిపెట్ జేఈఈ-2015 బ్యాచిలర్ డిగ్రీ స్వరూపం:
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 
విజయం సులువే:
ఇంజనీరింగ్ లక్ష్యంగా ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్ తదితర ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. అదే ప్రిపరేషన్‌తో సిపెట్ జేఈఈ పరీక్షకు ఉపక్రమించొచ్చు. దీనికి పేర్కొన్న సిలబస్ ఆసాంతం ఇంటర్ సిలబస్ మేరకే ఉంటుంది.
 
సిపెట్ జేఈఈ- 2015
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 5, 2015
జేఈఈ తేదీ: జూలై 12, 2015
వెబ్‌సైట్: www.cipet.gov.in
 
‘ప్లాస్టిక్’లో పెరుగుతున్న అవకాశాలు
పాలిమర్స్ ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేయడం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తుంది. దేశంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, తేలికపాటి వస్తువుల వినియోగానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో కింది స్థాయి నుంచి అనేక కెరీర్ అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సిపెట్ ద్వారా కోర్సులు పూర్తి చేసిన వారికి అందులోనూ బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల అభ్యర్థులకు ఉద్యోగాల పరంగా ఢోకా లేదు.

ఇందుకు ఆయా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గణాంకాలే నిదర్శనం. అయితే ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు, సృజనాత్మకత, కొత్త అంశాలను ఇట్టే పసిగట్టే నేర్పు ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశించే కొత్త వస్తువులు వాటి డిజైన్ వెనుక ఇమిడి ఉన్న సాంకేతికత, సృజనాత్మకతలను పరిశీలించే నైపుణ్యం, మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను డిజైన్ చేసే సామర్థ్యం వంటివి అవసరం.
 - వి.కిరణ్ కుమార్, సిపెట్ హైదరాబాద్ సెంటర్ హెడ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement