ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా? | How to Top College selections MBA | Sakshi
Sakshi News home page

ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?

Published Fri, Jun 10 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?

ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్ ముగిసింది.. ఫలితాలు సైతం వెలువడ్డాయి.
మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.
ఐసెట్ ర్యాంకుతో ఎంబీఏలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న..
మంచి కాలేజీని ఎంపికచేసుకోవడం ఎలా?! కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి?
ఈ క్రమంలో ఎంబీఏ కాలేజీ ఎంపికపై నిపుణుల సలహాలు...

 
ఏఐసీటీఈ ప్రమాణాలు
కళాశాల ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు- ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ సంఖ్య, ఫ్యాకల్టీ అర్హతలు, ఫ్యాకల్టీ సైటేషన్స్, మౌలిక సదుపాయాలు,  లైబ్రరీ,  ఈ-జర్నల్స్ సదుపాయం, అందుబాటులో ఉన్న రియల్ కేస్ స్టడీస్.
* ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి: 1:15
* ఫ్యాకల్టీలో 80 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన నియమితులై ఉండాలి.
* ఫ్యాకల్టీ హోదాల పరంగా ప్రొఫెసర్; అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలు ఉండాలి. వీరి నిష్పతి 1:2:6గా ఉండాలి.
* లైబ్రరీలో కనీసం ఆరు వేల జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ అందుబాటులో ఉండాలి.
* వీటిలో 25 శాతం జర్నల్స్‌ను డిజిటైజేషన్ విధానంలో ఈ-జర్నల్స్‌గా అందుబాటులో ఉంచాలి.
* కంప్యూటర్స్ పరంగా నలుగురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ చొప్పున అందుబాటులో ఉండాలి.
* ఇవన్నీ ఉంటేనే ఒక కళాశాలలో పరిపూర్ణమైన బోధన లభిస్తుందని ఏఐసీటీఈ అంచనా.
 
ఫ్యాకల్టీ.. ప్లేస్‌మెంట్స్
ఎంబీఏ మొదటి సంవత్సరం   అందరికీ కామన్‌గా ఉంటుంది. కాబట్టి రెండో  సంవత్సరంలో స్పెషలైజేషన్‌కు అనుగుణంగా సంబంధిత అర్హతలున్న ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ పరంగా గత నాలుగేళ్ల సమాచారం సేకరించాలి. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొంటున్న కంపెనీలు, వాటి ప్రొఫైల్స్, అవి ఆఫర్ చేసిన ఉద్యోగాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. గత మూడేళ్ల కాలంలో కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
 
బీటెక్ కళాశాలల్లో ఎంబీఏ
వివిధ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది. ఒక రకంగా ఇది  ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. కారణం.. బీటెక్ స్థాయిలో పేరున్న కళాశాలలకు ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు ఉంటుంది. ప్లేస్‌మెంట్స్ పరంగా ఇవి ముందుంటాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించే ప్లేస్‌మెంట్‌లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులే కాకుండా.. ఎంబీఏ అభ్యర్థులు సైతం అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి  ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేసే కళాశాలలో ఎంబీఏ కూడా ఉంటే అది సానుకూల అంశమే!
 
ప్రత్యక్ష పరిశీలన
వివిధ సర్వే సంస్థలు కాలేజీలకు ఇస్తున్న ర్యాంకుల్లో తేడాలు ఉంటున్నాయి. వీటివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి, అక్కడి సీనియర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం మేలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కోర్సులను అందిస్తున్న కళాశాలల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు ప్రాధాన్యమిస్తున్న కళాశాలలపై దృష్టిసారించాలి.
 
స్పెషలైజేషన్
కళాశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. స్పెషలైజేషన్లు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో ప్రధాన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, సదరు స్పెషలైజేషన్‌కు సంబంధించి రియల్ కేస్ స్టడీస్ అందుబాటులో లేకపోవడం, కేస్ అనాలిసిస్ చేస్తూ బోధించే అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలకు తావు లేని కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.
 
పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు
కళాశాల ఎంపిక విషయంలో మరో ముఖ్యమైన అంశం.. పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందాలున్న కళాశాలల ద్వారా ఆయా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫ్యాకల్టీ ద్వారా కేస్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంబీఏ కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కళాశాలలకు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఫ్యాప్సీ తదితర మేనేజ్‌మెంట్ అసోసియేషన్స్‌తో సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి.
 
ఐసెట్ 2015 గణాంకాల ప్రకారం..

ఏపీలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు
కళాశాలలు: 384  సీట్లు: 45,965
 
తెలంగాణలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు
కళాశాలలు: 347   సీట్లు: 41,796
 
ఐసెట్ కౌన్సెలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కళాశాల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. చివరి ర్యాంకులు, వెబ్‌సైట్ సమాచారం, సర్వే రిపోర్టులకే పరిమితం కాకుండా.. ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కళాశాల ఎంపికతో పాటు రెండో సంవత్సరంలో తీసుకోవాల్సిన స్పెషలైజేషన్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ప్రొ॥ఓం ప్రకాశ్, టీఎస్ ఐసెట్ కన్వీనర్.
 
గత కౌన్సెలింగ్ ‘చివరి ర్యాంకులు’ ఆధారంగా కళాశాలలపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఔత్సాహికులు తమ ప్రాథమ్యాల వారీగా కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, నిర్ణయం తీసుకోవడం మంచిది. కళాశాలల ఎంపికలో వాటికి పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్స్, రియల్‌టైం ప్రాజెక్ట్‌వర్క్‌కు ప్రాధాన్యమివ్వాలి.
- ప్రొ॥కట్టా రామమోహన్ రావు, ఏపీ ఐసెట్ కన్వీనర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement