ఎస్‌ఐ కొలువు సాధించానిలా..! | Success Secrets with vadde udaykumar | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ కొలువు సాధించానిలా..!

Published Mon, Jun 6 2016 11:30 PM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

ఎస్‌ఐ కొలువు సాధించానిలా..! - Sakshi

ఎస్‌ఐ కొలువు సాధించానిలా..!

సక్సెస్ స్పీక్స్
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో తొలి దశ ముగిసింది. అభ్యర్థులు మలిదశలో విజయానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్‌ఐ పరీక్షలో 327 మార్కులతో (2011, ఆగస్టు) 3వ ర్యాంకు సాధించిన వడ్డే ఉదయ్‌కుమార్ తన సక్సెస్ సీక్రెట్స్‌ను ‘భవిత’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
మాది ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, కరివారిగూడెం. నాన్న వడ్డే శ్రీనివాసరావు సింగరేణిలో కోల్ ఫిల్లర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆయన 2005లో మరణించారు. అమ్మ సత్యవతి గృహిణి. నేను ఇంటర్ వరకు మణుగూర్‌లో తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ కొత్తగూడెంలో, ఎంసీఏ హైదరాబాద్‌లో పూర్తి చేశాను.
 
బంధువు సలహాతో..
నా ఎంసీఏ పూర్తయ్యే నాటికి (2008లో) సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీపై ఆర్థికమాంద్యం ప్రభావం ఉంది. సరైన అవకాశాలు లేవు. అప్పటికే మా బంధువుల్లో చాలా మంది పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా అన్నయ్య వేణుమాధవ్ సలహా మేరకు ఎస్‌ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. మొదటి అటెంప్ట్‌లోనే విజయం సాధించాను.
 
శిక్షణలో అగ్రస్థానం..
 ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో ఏడాది పాటు శిక్షణలో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచా. బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్ట్ ఇండోర్‌గా నిలిచి సీఎం పిస్టల్, గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతోపాటు హోంమినిస్టర్ బ్యాటన్, గోల్డ్ మెడల్‌ను సాధించాను.
 
పరుగు పందెంలో అప్రమత్తంగా...
గతంలో మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, తర్వాత రాత పరీక్ష జరిపేవారు. కానీ, ఇప్పుడు మొదట రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మలి దశలో శారీరక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది  అయితే ఇప్పుడు సివిల్ ఎస్‌ఐ, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏవైనా రెండు ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.

ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్‌లో మెరిట్ సాధించినా.. ఎంపికలో ఎలాంటి మార్కులు కలపరు. కానీ, మిగిలిన పోస్టుల భర్తీలో మాత్రం ఈవెంట్స్‌లో సాధించిన మెరిట్‌కు స్కోరు కేటాయించి తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్ల పరుగుపందెంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిత్యం ప్రాక్టీస్ చేయాలి.
 
ఇంగ్లిష్‌లో అర్హత సాధించాలి...
ఫైనల్ ఎగ్జామ్‌లో ఇంగ్లిష్ ఒక పేపర్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేస్తారు.
 
టెస్టులతో టైం మేనేజ్‌మెంట్...
కోచింగ్ కేంద్రాలు నిర్వహించే మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. అర్థమెటిక్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వదిలేసిన ప్రశ్నలను చివర్లో సాధించాలి. అర్థమెటిక్ పేపర్‌లో మెంటల్ ఎబిలిటీ/ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలను తక్కువ సమయంలో సాధించవచ్చు. అభ్యర్థులు రీజనింగ్ బిట్స్ మొదట చేయడం లాభిస్తుంది.
 
సబ్జెక్టు నేర్చుకోండి..
పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అలాకాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరీక్షలో మంచి ఫలితాలు సాధించవచ్చు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని చదవడం ద్వారా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నవారే అర్హత సాధించారు. తెలంగాణ విద్యార్థులు  రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాగా చదవాలి.
 
చాలా మంది అభ్యర్థులు ఎస్‌ఐ పరీక్షలో ఉండే అర్థమెటిక్‌ను ప్యూర్ మ్యాథ్స్‌గా భావించి.. కష్టమనే అపోహతో ఉంటారు. కానీ, పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆర్ట్స్ విద్యార్థులు కూడా సులువుగా చేసే విధంగా ఉంటాయి. అభ్యర్థులు తొలుత మ్యాథ్స్ అనే భయాన్ని వీడి ప్రిపరేషన్‌లో ముందుకుసాగాలి. ముందుగా సిలబస్‌లో ఉన్న అంశాలను పరిశీలించాలి. పరీక్షలో ఆయా అంశాల నుంచే  ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌లో లేని టాపిక్స్‌ను చదవద్దు.  ఏదైనా ఒక ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement