పోటీ పరీక్షల్లో కీలకం 'భౌగోళికం'
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రిఫీ
తెలుగు రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, కేంద్ర స్థాయిలో యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో భౌగోళిక శాస్త్రం అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే జీవపరిణామ క్రమంలో ‘ఆధునిక మానవుడి’ ప్రస్థానం భూమ్మీద ప్రారంభమైనప్పట్నుంచీ (సుమారు పదివేల ఏళ్ల నుంచి) ఇప్పటివరకు, భవిష్యత్తులో కూడా మానవ జీవితాన్ని భూగోళ శాస్త్రం ప్రభావితం చేస్తుంది.
రాష్ట్రాల్లో, దేశంలో ఆర్థిక ప్రగతిని అంచనా వేయడానికి, ఆయా ప్రాంతాల్లోని వనరుల లభ్యత, వినియోగం, వ్యవసాయ సామర్థ్యం, పారిశ్రామికీకరణ గురించి తెలుసుకోవడానికి, ప్రణాళికలు రూపొందించడంలో భూగోళశాస్త్ర పరిజ్ఞానం అవసరం.
పైన తెలిపిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ, భారత భూగోళశాస్త్రంలో ఈ అంశాలను అధ్యయనం చేస్తే సివిల్స్ ప్రిలిమ్స్‌కే కాకుండా మెయిన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉభయరాష్ట్రాల్లో ఇప్పటినుంచి జరగబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి, సరళి సివిల్స్ తరహాలో ఉండబోతుందనేది సుస్పష్టం. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రమే దీనికి ఉదాహరణ.
ఇప్పటినుంచి జరగబోయే పరీక్షల్లో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలే కాకుండా అసెర్షన్ అండ్ రీజన్, ఆడ్ మ్యాన్ ఔట్, మ్యాచ్ ద ఫాలోయింగ్, స్టేట్‌మెంట్ రూపంలో మిశ్రమ పద్ధతిలో ప్రశ్నపత్రాల సరళి ఉండబోతుంది. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన అవసరం. కింది ప్రశ్నలను పరిశీలిస్తే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది.
1) రుతువును అనుసరించి రాత్రి, పగటి సమయాల్లో తేడాలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
ఎ) భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం
బి) భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం
సి) ఓ ప్రాంత అక్షాంశం విలువ
డి) భూఅక్షం వాలి ఉన్నందున, భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గడం వల్ల
సరైన సమాధానం: డి
వివరణ: అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే ‘భూచలనాలు (మోషన్స్ ఆఫ్ ద ఎర్త్)’ అనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇక్కడ భూఅక్షం నిట్టనిలువుగా ఉండకుండా 23.5 డిగ్రీల కోణంలో ఓవైపు వాలి ఉంటుంది. భూభ్రమణ సమయంలో జనించే అపకేంద్రబలాల ప్రభావం తగ్గడంతోపాటు.. భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం(భూమి చుట్టుకొలత) తగ్గడమే ఇందుకు కారణం. ఈ మొత్తం ప్రక్రియ అర్థం కావాలంటే భూఅక్షం అంటే ఏమిటి? భూకక్ష్య(ఆర్బిట్) అంటే ఏమిటి? అపకేంద్రబలాలు అంటే ఏమిటి? అనే భావనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
2) కింది వాటిని పరిశీలించండి.
1) విద్యుదయస్కాంత వికిరణాలు (ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్)
2) జియో థర్మల్ ఎనర్జీ
3) గురుత్వాకర్షణ బలం
4) శిలావరణ ఫలకాల కదలికలు
5) భూభ్రమణం (రొటేషనల్ ఆఫ్ ద ఎర్త్)
6) భూపరిభ్రమణం (రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్)
పైన తెలిపిన వాటిలో భూమిపై గతిశీల మార్పులకు కారణమైన అంశాలేవి?
ఎ) 1,2,3,4 బి) 1,3,5,6
సి) 2,4,5,6 డి) పైవన్నీ
సరైన సమాధానం: డి
వివరణ: 1) సూర్యుని నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత వికిరణాలు భూమ్మీద ఉష్ణానికి, శక్తికి, పీడన వ్యత్యాసానికి మూలం. అంతేకాకుండా భూమ్మీద ఉన్న సకల జీవరాశులకు కావలసిన శక్తి అవసరాలు దీని ద్వారానే అందుతాయి.
2) శిలావరణ పలక సరిహద్దుల వెంబడి అగ్నిపర్వత విస్ఫోటనాలకు జియో థర్మల్ ఎనర్జీ కారణం
3) పోటు, పాటులు ఏర్పడటానికి, నదీ ప్రవాహ గమనానికి భూగురుత్వాకర్షణ బలాలు కారణం.
4) ఖండాల, పర్వతాల ఆవిర్భావానికి, భూకంపాలకు శిలావరణ ఫలక కదలికలు కారణం
5) రాత్రీపగలు ఏర్పడటానికి, భూమికి ఇరువైపులా ఉన్న అన్ని ప్రాంతాల్లో జీవ నివాసానికి, పవనాలు, సముద్రప్రవాహాలు కదలడానికి భూభ్రమణమే కారణం.
6) రాత్రి, పగలు సమయాల్లో తేడాలు ఏర్పడటానికి, రుతువులు ఏర్పడటానికి భూపరిభ్రమణం కారణం.
అభ్యర్థులు పై అంశాలను పరిశీలించిన తర్వాత భౌగోళిక ప్రక్రియలను అవగాహన చేసుకుని, వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో ప్రాథమిక పరిజ్ఞానం పొందాలి.
3) కింద పేర్కొన్న జతలను పరిశీలించండి.
జాతీయ పార్కు పార్కు ద్వారా ప్రవహించేనదులు
1) జిమ్ కార్బెట్ గంగ
2) కజిరంగా మానస్
3) సెలైంట్ వ్యాలీ కావేరి
4) కన్హా బెట్వా
పైన తెలిపిన వాటిలో ఏ జత సరైనదో పేర్కొనండి.
ఎ) 1, 2 బి) 3 సి) 1, 3 డి) 4
సరైన సమాధానం: డి
వివరణ: గంగా ఉపనది అయిన రామ్‌గంగా నది జిమ్ కార్బెట్ గుండా ప్రవహిస్తోంది. కజిరంగా పార్కు గుండా ఏ నదీ ప్రవహించడం లేదు. సెలైంట్‌వ్యాలీ గుండా కుంతీపూజా నది వెళుతోంది.
4) ప్రపంచంలో ఏ ప్రాంతంలో మత్స్య గ్రహణ కేంద్రాలు (ఫిషింగ్ గ్రౌండ్స్) కేంద్రీకృతమై ఉన్నాయి
ఎ) ఉష్ణ, శీతల వాతావరణ ప్రవాహాలు కలిసే చోట
బి) నదులు మంచినీటిని అధిక పరిమాణంలో సముద్రంలోకి పంపేచోట
సి) ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుగా ఉండేచోట
డి) ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే చోట
పైన తెలిపిన వాటిలో నిజమైన వాక్యమేది?
1) ఎ 2) ఎ, సి 3) ఎ, బి 4) సి, డి
సరైన సమాధానం: 4
వివరణ: ఖండతీరపు అంచు వెడల్పుగా ఉన్న ప్రాంతం చేపలు నివసించడానికి అనుకూలంమైంది. ఇక్కడ చేపలు గుడ్లు పెట్టి, పొదిగి ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయి. ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే ప్రదేశంలో వృక్ష ప్లవకాలు సమృద్ధిగా పెరుగుతాయి. వీటిని ఆహారంగా తీసుకుని జంతు ప్లవకాలు పెరుగుతాయి. జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకొని చేపలు సమృద్ధిగా పెరుగుతాయి. ఉష్ణ, శీతల ప్రవాహాలు కలిసే ప్రాంతాలు తీరరేఖ సమీపంలో ఉన్నందున ఖండ భూభాగాల నుంచి సమృద్ధిగా పోషకాలు అందుతాయి.
- ఎ.డి.వి. రమణ రాజు
సీనియర్ ఫ్యాకల్టీ,ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్